తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
చౌటుప్పల్ : మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు నీల అంజయ్య (55), మణేమ్మలకు ఏడుగురు కుమార్తెలు. కుమారులు లేరు. ఆరుగురు కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కూతురు రాణి వివాహం కాలేదు. ప్రస్తుతం కూలీ పనులకు వెళ్తోంది. వీరిది రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం. ఎలాంటి ఆస్థిపాస్తులు లేవు. అంజయ్య గీత కార్మికుడు. కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు.
గురువారం రాత్రి అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందాడు. శుక్రవారం అంత్యక్రియలను నిర్వహించారు. కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు రాణి తలకొరివి పెట్టింది. కాగా, మృతుడి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని సర్పంచ్ కప్పల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ బత్తుల శంకర్, ఉప సర్పంచ్ టి.వెంకటేశం, వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.