వడివడిగా తొలి అడుగులు | The first steps dashes | Sakshi
Sakshi News home page

వడివడిగా తొలి అడుగులు

Published Thu, Mar 12 2015 1:36 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

వడివడిగా తొలి అడుగులు - Sakshi

వడివడిగా తొలి అడుగులు

  • మా బాట.. బంగారు తెలంగాణ
  •  బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్
  •  సవాళ్లను అధిగమించి ముందుకు
  •  సామాజిక, ఆర్థిక పునర్నిర్మాణమే లక్ష్యం
  •  సొంత వనరులతో నవ తెలంగాణ ఆవిష్కరణ
  •  సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలకు ప్రాధాన్యం
  •  అంగన్‌వాడీలకు జీతాల పెంపు, బీడీ కార్మికులకు వెయ్యి భృతి
  • సాక్షి, హైదరాబాద్: ‘వెయ్యి మైళ్ల దూరాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని మొదటి అడుగుతోనే ప్రారంభించాలి.. బంగారు తెలంగాణను సాధించే క్రమంలో ఎన్నో వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ మా ప్రభుత్వం దృఢంగా.. వడివడిగా ప్రయాణం ప్రారంభించింది. గమ్యాన్ని చేరుకునే వరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ మా ముఖ్యమంత్రి వెనుతిరిగి చూడరు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం. అందుకు తొమ్మిది నెలల అతి తక్కువ కాలంలో అనుసరించిన విధానమే నిదర్శనం. బడ్జెట్ అంటే చిట్టా పద్దుల పట్టిక కాదు.. జీవంలేని అంకెలు, సారం లేని గణాంకాలు కాదు.

    బడ్జెట్ అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి కళ్లలో తొణికిసలాడుతున్న కలలు. వారి ఆశలని ఆకాంక్షలని నిజం చేసే నిర్మాణాత్మకమైన ప్రణాళిక. ప్రజాధనాన్ని ప్రజల నిజమైన అభివృద్ధికి వెచ్చించే గంభీరమైన, బాధ్యతాయుతమైన ప్రక్రియ. ఈ బడ్జెట్ తెలంగాణ నెలకొల్పిన సామాజిక విలువల ఆధారంగా రూపొందించిన సజీవ ఆర్థిక ప్రణాళిక..’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన2015-16 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

    ‘ఇప్పుడు ప్రవేశపెడుతున్నది పూర్తి అవగాహనతో, స్పష్టతతో, సమన్వయంతో రూపొందించిన పూర్తిస్థాయి బడ్జెట్. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ర్ట ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం అట్టడుగు వర్గాల నిజమైన అభివృద్ధికి రూపొందించిన పథకాల సమాహారమే ఈ బడ్జెట్. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఒక చారిత్రక సత్యాన్ని రుజువు చేసింది. దేశంలో గుజరాత్, తెలంగాణను మిగులు రాష్ట్రాలుగా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రజల శ్రేయోసంక్షేమాలే ప్రభుత్వానికి గీటురాయి. అదే స్ఫూర్తితో మూడు ప్రాధమ్యాలను గుర్తించాం. అవి బలహీన వర్గాల సంక్షేమం, వ్యవసాయం-అనుబంధ రంగాల వికాసం, పారిశ్రామిక అభివృద్ధి. ఇవి ప్రాధమ్యాలే కాదు.. మా ప్రభుత్వం ఎంచుకున్న సిద్ధాంతాలు’ అని ఈటెల వివరించారు.
     
    వృద్ధి రేటుపై ఆశలు

    వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాభివృద్ధి ఆశాజనకంగా ఉంటుందని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. కొన్నేళ్లుగా తిరోగమనంలో ఉన్న వృద్ధి రేటు గత ఏడాది నుంచే పెరుగుతోందన్నారు. ‘2011-12 నుంచి రాష్ర్ట ప్రగతి కుంటుపడింది. 2004-09 మధ్య 12.87 శాతంగా ఉన్న సగటు వృద్ధి.. 2012-13 నాటికి 4.1 శాతానికి పడిపోయింది. 2014-15లో 5.3 శాతం ఆర్థికాభివృద్ధి ఉండవచ్చని అంచనా. రుతు పవనాలు ఆలస్యంగా రావడం, తక్కువ వర్షపాతం వల్ల వ్యవసాయ రంగం కుదేలైంది.

    అయితే పారిశ్రామిక, సేవా రంగాలు నిలదొక్కుకోవడం ఆశలకు జీవం పోసింది. సేవా రంగంలో అభివృద్ధి ప్రస్తుతం 9.7 శాతానికి పెరిగింది. ఇక పారిశ్రామిక వృద్ధి గత సంవత్సరం 0.1 శాతంగా ఉంటే ఇప్పుడది 4.1 శాతానికి చేరింది. జాతీయ స్థాయిలో ఆర్థిక రంగ పురోగమనానికి తోడు రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నాను’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వ్యాట్, భూ క్రమబద్ధీకరణ మినహా గత బడ్జెట్‌లో సమర్పించిన పన్నులు, పన్నేతర ఆదాయాలు దాదాపుగా గాడిలోనే ఉన్నాయని తెలిపారు. క్రమబద్ధీకరణ వల్ల పేదలకు కనీసం రూ. 30 వేల కోట్ల ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేశారు.
     
    ఎన్నో సవాళ్లు ఎదురైనా..

    అఖిల భారత సర్వీసు అధికారులను రాష్ట్రానికి కేటాయించడంలో తీవ్ర జాప్యం జరిగిందని, రాష్ట్ర స్థాయి సిబ్బంది విభజన కూడా ఇంకా పూర్తి కాకపోవడంతో పాలనలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పలేదని ఈటెల వివరించారు. అయినా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటూ పాలనను గాడిన పెట్టిన ఘనత తమదేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయకుండా నిరాటంకంగా నిధులు మళ్లించారని, 14వ ఆర్థిక సంఘం నివేదికతో ఈ విషయం తేటతెల్లమైందని మంత్రి అన్నారు. తెలంగాణలోని మిగులు ఆదాయ వనరులను ఆంధ్రప్రదేశ్‌కు మళ్లించినట్లు ఆర్థిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోందన్నారు. ప్రస్తుతం సొంత రాష్ర్టంలో సొంత వనరులను సద్వినియోగం చేసుకుని నవ తెలంగాణను ఆవిష్కరించేందుకు సామాజిక, ఆర్థిక పునర్నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు.
     
    సంక్షేమ పథకాల ఏకరువు

    రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు పథకాలను ఈటెల ప్రధానంగా ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ముస్లిం, సిక్కు, దళిత క్రిస్టియన్ వర్గాలకు చెందిన పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం తెచ్చిన ‘షాదీ ముబారక్ పథకం’ ప్రజల మన్ననలు అందుకుంటోందన్నారు. అర్హులైన ఆడపిల్లల బ్యాంకు ఖాతాల్లో ముహూర్తం రోజు కంటే ముందే రూ. 51,000 జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని కూడా లెక్క చేయకుండా ‘ఆసరా’ పథకం కింద అనేక వర్గాల వారికి పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. వృద్ధులు, వితంతువులకు రూ. 1,000, వికలాంగులకు రూ. 1,500 రూపాయలను ఇస్తున్నామని, పింఛన్ల పెంపువల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 4,000 కోట్ల భారం పెరిగిందని చెప్పారు. అలాగే బీడీ కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని నెలకు రూ. 1,000 భృతిని ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో ఇందుకు రూ. 188 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తల నెల జీతాన్ని రూ. 4,200 నుంచి రూ. 7,000కు, సహాయకుల నెల జీతాన్ని రూ. 2,450 నుంచి రూ. 4,500కు పెంచినట్లు ఈటెల ప్రకటించారు. వంట పాత్రల కొనుగోలు కోసం ప్రతి కేంద్రానికి రూ. 1,000 చొప్పున గ్రాంటును ప్రకటించారు. కేంద్ర తోడ్పాటు తగ్గినా అంగన్‌వాడీలకు రాష్ర్టం చేయూతనిస్తోందన్నారు.
     
    అందుబాటులో 20 లక్షల ఎకరాలు


    ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సాగుకు పనికిరాని భూమి 20 లక్షల ఎకరాలు ఉందని, అందులో పరిశ్రమలకు అనువైన భూమిని గుర్తించి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు. ‘2015-16 సంవత్సరంలో హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్, వరంగల్‌లో వస్త్రోత్పత్తి పరిశ్రమ, కొత్తగా రానున్న ఫార్మాసిటీ, ఇండస్ట్రియల్ పార్కులకు అనుసంధానంగా మినీ పారిశ్రామిక టౌన్‌షిప్‌ల అభివృద్ధికి సర్కారు నిర్ణయించింది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే దళితులకు రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహిస్తాం. హైదరాబాద్‌కు సమీపంలోని ముచ్చర్ల ప్రాంతంలో 11వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివద్ధి చేస్తాం’ అని ఈటెల పేర్కొన్నారు.
     
    సోలార్ పవర్‌ను ప్రోత్సహిస్తాం

    రాష్ట్రంలోని 19.53 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు ఏడు గంటల పాటు విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సంప్రదాయ విద్యుత్‌తో పాటు సోలార్ పవర్‌నూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మంత్రి వెల్లడించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల స్థాపనకు కేంద్ర సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 20 శాతం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. గృహావసరాల కోసం కిలోవాటు సామర్థ్యంగల 4000 సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తామన్నారు. 2018 నాటికి రాష్ర్టం మిగులు విద్యుత్ సాధిస్తుందని పేర్కొన్నారు. కాగా, 108 అంబులెన్స్‌ల సంఖ్యను 337 నుంచి 506కు పెంచుతున్నట్లు ఈటెల ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవల కోసం 104 సర్వీసులను మెరుగుపరచడానికి నిర్ణయించామన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి ఈ ఏడాది రూ. 100 కోట్లు మంజూరు చేశామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నిధులిస్తామని మంత్రి వెల్లడించారు.
     
    సీఎంపై ప్రశంసల జల్లు

    ఈటెల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన పోరాట పటిమను పలుమార్లు కొనియాడారు. ‘ఎవరైతే కాయలు కాసిన భుజాల మీద ఉద్యమ భారాన్ని మోసినారో.. ఎవరైతే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షలను, అవసరాలను అర్థం చేసుకున్నారో.. ఎవరు ప్రజలను ఒక్క తాటి మీద నడిపించినారో.. ఎవరు త్యాగాలకు వెనుదీయకుండా యుద్ధరంగంలో ముందుండి నడిచారో.. ఎవరు పోరాటాన్ని విజయ తీరానికి చేర్చి గమ్యాన్ని ముద్దాడినారో.. వారి నేతృత్వంలోనే ఏర్పడిన ప్రభుత్వం.. తెలంగాణను అభ్యుదయ పథంలో నడిపించేందుకు నిజాయితీగా రూపొందించిన ఆర్థిక ప్రణాళికల సారమే ఈ బడ్జెట్’ అని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement