త్రినేత్రం | The focus on the movement of vehicles | Sakshi
Sakshi News home page

త్రినేత్రం

Published Thu, Jul 10 2014 3:55 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

త్రినేత్రం - Sakshi

త్రినేత్రం

  •       వాహనాల కదలికలపై పోలీసుల దృష్టి
  •      జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానం
  •      ప్రత్యేక కంట్రోల్ రూమ్
  •      ప్రయాణికుల భద్రత దిశగా మార్పులు
  •      అన్ని  క్యాబ్‌లకు ఒకే రంగు
  •      ఆర్టీఏ, పోలీసు విభాగాల సన్నాహాలు
  • స్వాతి ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగి. విధులు ముగించుకొని వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌లోకి ఎక్కింది. అందులో కొందరు ఆకతాయిలు ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఆమె ఓ నెంబర్‌కు ఫోన్ చేసింది. క్షణాల్లో క్యాబ్ ముందు పోలీస్ జీపు ఆగింది. ఆకతాయిల  ఆగడాలకు బ్రేక్ పడింది. ఇదేదో కథ కాదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో నగరంలో పోలీసుల నుంచి ఈ తరహా సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్యాబ్‌లను ఆశ్రయించే ప్రయాణికులు, ముఖ్యంగా యువతులు, మహిళలు క్షేమంగా ఇళ్లకు చేరేందుకు అవకాశం కలుగనుంది.
     
    సాక్షి, సిటీ బ్యూరో: ప్రయాణికులకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా తిరిగే  క్యాబ్‌ల కదలికలను నమోదు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు సన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఆర్టీఏ, పోలీసు విభాగాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించేందుకు అనువైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల క్యాబ్‌లను జీపీఆర్ ఎస్‌తో అనుసంధానం చేయనున్నారు.

    వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తారు. క్యాబ్‌లపైన 24 గంటల పాటు నిఘా ఉండేవిధంగా కంట్రోల్ రూమ్ పని చేస్తుంది. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు, సందర్శకులు, ఐటీ కారిడార్‌లలో పని చేసే సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల క్యాబ్‌లను ఒకే విధమైన నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేవిధంగా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని క్యాబ్ సంస్థలు సొంతంగా ఇలాంటి  జీపీఆర్‌ఎస్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.

    మరి కొన్ని క్యాబ్‌లు కాల్ సెంటర్‌ల ఆధారంగా నడుస్తున్నాయి. ఇలాంటి అన్ని రకాల క్యాబ్‌లను ఇక పోలీసు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించే విధంగా సరికొత్త జీపీఆర్‌ఎస్‌తో లింక్ పెడతారు. గ్రేటర్‌లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే క్యాబ్‌లతో పాటు, హైటెక్ సిటీ, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్థలకు తిరిగే క్యాబ్‌లు, సాధారణ క్యాబ్‌లన్నీ కలిపి సుమారు 25 వేల వరకు ఉంటాయి.

    వీటన్నింటినీ జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానిస్తారు. వచ్చే ఆగస్టు నాటికి 1000 సిటీ బస్సులను జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానం చేసే వ్యవస్థకు ఆర్టీసీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. మరోవైపు క్యాబ్‌లను కూడా ఇలాంటి వ్యవస్థ  పరిధిలోకి తెచ్చేందుకు రవాణా, పోలీసు విభాగాలు తాజాగా సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణికుల రవాణాకు వినియోగించే అన్ని రకాల వాహనాలను దశల వారీగా ఇలాంటి నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది.
     
    అన్ని క్యాబ్‌లు తెలుపు రంగులోకి...

    ప్రయాణికులు తేలిగ్గా గుర్తించేవిధంగా క్యాబ్‌ల రంగులను కూడా పూర్తిగా మార్చి వేయనున్నారు. ప్రస్తుతం క్యాబ్ సంస్థలు తమకు నచ్చిన రంగులలో వాహనాలను నడుపుతున్నాయి. ఇక నుంచి అలా కాకుండా అన్నిటినీ తెలుపు రంగులోకి మార్చి, నీలి రంగు పట్టీని (బ్లూ బ్యాండ్) ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులే కాకుండా పోలీసులు, రవాణా అధికారులు కూడా తేలిగ్గా గుర్తించే విధంగా వాహనం పైన ‘ట్యాక్సీ క్యాబ్’ అని పెద్ద అక్షరాలతో బోర్డును ఏర్పాటు చేస్తారు. డోర్‌లపైన కూడా ‘ట్యాక్సీ క్యాబ్’ అని రాస్తారు. డ్రైవర్లు తెలుపు రంగు యూనిఫామ్ ధరిస్తారు. ఇందుకు అనుగుణంగా మోటారు వాహనాల చట్టాల్లో మార్పులు తేనున్నట్లు ఆర్టీఏ అధికారి చెప్పారు.
     
    నిర్వహణ సంస్థలకు భారం
     
    ఆర్టీఏ, పోలీసు విభాగాలు అనుకున్నట్లుగా క్యాబ్‌లను జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానిస్తే వాటి సంస్థలపైన పెద్ద ఎత్తున నిర్వహణ భారం పడే అవకాశం ఉంది. ఒక్కో వాహనంలో జీపీఆర్‌ఎస్ పరికరాలను అమర్చుకోవాలంటే రూ.7 వేల నుంచి  రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. పైగా వాహ నాల రంగును కూడా పూర్తిగా మార్చవలసి ఉంటుంది. ఈ సరికొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement