‘మేరీ పంచాయతీ’ యాప్‌లో నమోదు చేసిన గ్రామపంచాయతీ సమాచారం
ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయతీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను పంచాయతీ కార్యాలయాలకు వెళ్లకుండానే యాప్ ద్వారా పరిశీలించవచ్చు.
పంచాయతీలకు సంబంధించిన పద్దుల వివరాలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ యాప్‌ను 2019 లోనే రూపొందించగా కొన్ని కారణాలతో వివరాలన్నింటినీ నిక్షిప్తం చేయలేదు. గతేడాది నుంచి అన్నింటినీ ఇందులో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు.
ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్..
గ్రామపంచాయతీకి సంబంధించిన నిధుల వివరాలే కాకుండా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తుల సమాచారాన్ని సైతం యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా మంజూరు చేసే నిధుల వివరాలతో పాటు ఏయే పనులకు ఎంత మొత్తం వెచ్చించారు. పనులు ఏ దశల్లో ఉన్నాయనే సమాచం యాప్‌లో దర్శనమిస్తుంది.
జిల్లా - పంచాయతీలు
► ఆదిలాబాద్ - 467
► నిర్మల్ - 396
► మంచిర్యాల - 311
► ఆసిఫాబాద్ - 335
పారదర్శకతకు ప్రాధాన్యం..
పంచాయతీ నిధుల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నిక్షిప్తం చేయడంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేపడుతున్నాయనేది ప్రజలు సులువుగా తెలుసుకోవచ్చు.
గ్రామంలో చేపట్టే పనులను జీపీఆర్‌ఎస్ ద్వారా గుర్తిస్తుండడంతో ఒక్కసారి నిధులు మంజూరైన పనికి మరోసారి బడ్జెట్ కేటాయించడానికి వీలుండదు. పద్దుల వివరాలు ప్రజల వద్దకు వెళ్లడంతో పాలకవర్గాలు పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రజలు ప్రశ్నించవచ్చు.
పంచాయతీ వివరాలు ఇలా..
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ప్లేస్టోర్‌కు వెళ్లి ‘మేరీ పంచాయతీ’ అని టైప్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తెరవగానే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, పంచాయతీ వివరాలు దర్శనమిస్తాయి. వాటిని నమోదు చేయగానే గ్రామపంచాయతీకి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. గ్రామం పేరు లేదా పిన్‌కోడ్‌తో సైతం సంబంధిత పంచాయతీ వివరాలు తెలుసుకోవచ్చు.
సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు..
గ్రామపంచాయతీలకు సంబంధించిన వివరాలను నెలకోసారి ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా నిక్షిప్తపరుస్తారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిధుల కేటాయింపు, పనుల వివరాల్లో సందేహాలు ఉంటే గ్రామసభల్లో ప్రశ్నించవచ్చు. – అరుణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment