
సుపరిపాలనే లక్ష్యం
ఓకే అంటే..?
బాధ్యతలు స్వీకరించాక తన చాంబర్‌కు వచ్చిన అధికారులతో జేసీ పౌసుమిబసు ముచ్చటించారు. డీఆర్వో వీరబ్రహ్మయ్యను ప్రజావాణి ప్రగతిపై అడిగారు. ఆయన ‘ప్రజావాణి ఓకే’ అని సమాధానమివ్వడంతో.. ఓకే అంటే ఏంటని జేసీ ప్రశ్నించారు. తన పరిధిలోని పెండింగ్ సమస్యలు, కేసుల వివరాలు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ముకరంపుర : ‘ప్రభుత్వ పథకాల అమలుపై పారదర్శకంగా వ్యవహరిస్తా.. ప్రజవాణిని మరింత పటిష్టంగా అమలు చేయిస్తా... సమస్యలు పెండింగ్ లేకుండా సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పని చేస్తా..’ అని కొత్త జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు స్పష్టం చేశారు. వరంగల్ నుంచి బదిలీపై వచ్చిన ఆమె మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అన్ని శాఖల సిబ్బందిని, అధికారులను పరిచయం చేసుకున్నారు.
శాఖాపరమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేలా ఉండాలని సూచించారు. పెండింగ్ రికార్డులు సిద్ధం చేసి పండుగ పూర్తికాగానే తనకు నివేదించాలని చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టిన సంక్షేమ పథకాలను జిల్లాలో సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆహారభద్రత కార్డుల జారీ, సన్నబియ్యం భోజన పథకం, దళితులకు మూడెకరాల భూమి పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రజావాణి అత్యంత ముఖ్యమైనదని, ఈ కార్యక్రమాన్ని మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. అందరి సహకారంతో అర్హులకు పథకాలు అందేలా చూస్తామని, పథకాల అమలును వేగవతం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో వీరబ్రహ్మయ్య, డీఎస్వో చంద్రప్రకాశ్, సివిల్‌సప్లై డీఎం సంపత్‌కుమార్, ఆర్డీవో చంద్రశేఖర్, కలెక్టరేట్ ఏవో రాజాగౌడ్, డీపీఆర్వో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పర్సనల్ టచ్
పేరు : పౌసుమి బసు
పుట్టిన తేది : 03-01-1980
స్వరాష్ట్రం : పశ్చిమబెంగాల్
మాతృభాష : బెంగాలీ
చదువు : కోల్‌కతా యూనివర్సిటీ నుంచి జాగ్రఫీలో బీఎస్సీ ఆనర్స్. ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించారు.
ఢిల్లీలోని జవహర్‌నెహ్రూ యూనివర్సిటీ నుంచి జాగ్రఫీలో పీజీ ఫస్ట్ డివిజన్. అదే యూనివర్సిటీ నుంచి జాగ్రఫీలో ఎంఫిల్ పట్టా పొందారు.
సివిల్స్‌కు ఎంపిక : 2007 ఐఏఎస్ బ్యాచ్
నిర్వహించిన బాధ్యతలు : ఖమ్మం జిల్లా పాల్వంచ సబ్ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ 30-08-2009 నుంచి 07-08-2010 వరకు
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా 18-04-2011 నుంచి 18-06-2011 వరకు
కాకినాడలో వాణిజ్య పన్నుల శాఖ డెప్యూటీ కమిషనర్‌గా 18-06-2011 నుంచి 08-10-2013 వరకు..
అనంతరం వరంగల్ జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.