♦ మంత్రి చందూలాల్ తనయుడు ప్రహ్లాద్ పద్ధతి మార్చుకోవాలి
♦ అక్రమార్కులకు ప్రజల చేతుల్లో శిక్ష తప్పదు... కేకేడబ్ల్యూ డివిజన్ కార్యదర్శి దామోదర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి నదిలో సొసైటీల పేరుతో ప్రభుత్వమే ఇసుక మాఫియాగా మారిందని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) కరీంనగర్-ఖమ్మం-వరంగల్ డివిజన్ కమిటీ కార్యదర్శి దామోదర్ పేర్కొన్నారు. మంత్రి అజ్మీరా చందూలాల్‌ను అడ్డం పెట్టుకొని ఏజెన్సీలో దోపిడీ చేస్తున్న ఆయన కొడుకు ప్రహ్లాద్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. సొసైటీలను ఏర్పాటు చేసి గిరిజనులకు లబ్ధి చేకూరుస్తున్నట్లు ప్రకటనలు చేసి ప్రహ్లాద్ కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడని అన్నారు. మావోయిస్టు పార్టీ కేకేడబ్లూ కార్యదర్శి దామోదర్ శుక్రవారం పత్రిక కార్యాలయాలకు ఓ లేఖ పంపారు.
‘‘సొసైటీలకు ఇసుక అమ్మకానికి ఆదివాసులకు అధికారం ఉందని చెబుతూనే మంత్రి చందూలాల్ కొడుకు ప్రహ్లాద్ సొసైటీలపై రాజకీయ ఆధిపత్యంతో చక్రం తిప్పుతున్నాడు. కాంట్రాక్టర్లకు ఇసుక సొసైటీల అశలు చూపి వారి వద్ద నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాడు. కాంట్రాక్టర్లకు ఇసుక సొసైటీలను ఇవ్వకుండా వారి వద్ద నుంచి రూ.10 కోట్ల ముడుపులు పుచ్చుకున్నాడు. ఈ వ్యవహారంలో పర్యాటక మంత్రి చందూలాల్ పాత్ర కీలకంగా ఉంది. సొసైటీలను అడ్డం పెట్టుకొని కోట్లు ఆర్జిస్తున్న ఆజ్మీరా ప్రహ్లాద్ పద్ధతులు మార్చుకోవాలి. ఇసుక కాంట్రాక్టర్లు ఓం నమఃశివాయ (ఏటూరు 2వ క్వారీ), నర్సింహారెడ్డి(1బీ క్వారీ), నిజామాబాద్ యలమంచిలి శ్రీనివాసరావు (1ఎ-క్వారీ), ఖమ్మం కృష్ణబాబు (3వ క్వారీ), తుపాకులగూడెం క్వారీ ప్రభాకర్‌లు రాజకీయ నాయకులకు దగ్గరగా ఉండి ఇసుక అక్రమ తరలింపునకు పాల్పడుతూ కోట్లు సంపాదిస్తున్నారు. వీరు గ్రామాల్లో ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడం, గ్రూపులు కట్టించడం, తాగడం, గ్రామాల్లో చెడు సంస్కృతిని ప్రజలపై రుద్దుతున్నారు. ఈ పద్ధతులు మార్చుకోకపోతే అజ్మీరా ప్రహ్లాద్, నర్సింహారెడ్డి, శ్రీనివాసరావు, ఓం నమఃశివాయ, కృష్ణబాబు, ప్రభాకర్‌లకు ప్రజల చేతుల్లో శిక్ష తప్పదు’ అని దామోదర్ ఆ లేఖలో హెచ్చరించారు.
ఇసుక సొసైటీల పేరుతో రూ.10 కోట్లు
Published Fri, Feb 26 2016 11:54 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement