
ఇసుక రవాణాకు బ్రేక్
ఏటూరునాగారం : మండలంలోని గోదావరి నది నుంచి ఇసుక రవాణాను వెంటనే నిలిపివేయాలని తహసీల్దార్ శ్రీనివాస్‌కు కలెక్టర్, జేసీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జీఓ నంబర్ 164 ప్రకారం ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట, మానసపల్లి, బుట్టాయిగూడెం, ఏటూరు, సింగారం గోదావరి, వాగుల పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీల నుంచి ప్రభుత్వ భవన నిర్మాణాల కోసం ఇసుక రవాణా చేయాల్సి ఉంది. అయితే ఈ జీవో ప్రకారం అనుమతి తెచ్చుకున్న ఇసుక వ్యాపారులు అక్రమంగా హైదరాబాద్‌కు లారీల్లో ఇసుక తరలిస్తుండగా భువనగిరి ప్రాంతంలో మైనింగ్ అధికారులకు పట్టుబడినట్లు తెలిసింది.
ఇసుక రవాణా చేసే లారీల యజమానులు క్వారీల యజమానులకు లారీకి రూ.25 వేలు ఇచ్చి లోడు చేసుకుంటున్నారు. ఇదే ఇసుకకు హైదరాబాద్‌లో రూ. 40 వేలకు పైన ధర పలుకుతోంది. అక్రమ ఇసుక రవాణా సమాచారం కలెక్టర్, జేసీలకు తెలియడంతో వెంటనే ఇసుక క్వారీల్లో తవ్వకాలను నిలిపివేయాలని స్థానిక తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇసుక రవాణాను వెంట నే నిలిపివేయాలని క్వారీ యజమానులకు వీఆర్‌ఓల ద్వారా తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా జేసీ నుంచి ఇసుక రవాణాను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు రావడంతో క్వారీలను నిలిపివేశామని ఆయన తెలిపారు. మళ్లీ ఉన్నతాధికారుల ఆదేశాల వస్తేనే ఇసుక రవాణాకు అనుమతి ఇస్తామన్నారు.