అఖిలపక్షం తరవాతే మెట్రో మార్గం ఖరారు
- హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
- మెట్రో ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు
- మెట్రోకు కరెంటు కష్టాల్లేవు, ఉద్యోగాలపై అసత్య ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరమే మారిన మెట్రోరైలు మార్గా న్ని ఖరారు చేయనున్నట్లు హెచ్‌ఎంఆర్ (హైదరాబాద్ మెట్రోరైల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొత్త అలైన్‌మెంట్‌తో సుల్తాన్‌బజార్, అసెంబ్లీ వద్ద మెట్రో మార్గంలో పెద్దగా దూరం పెరగలేదన్నారు. జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2)లో అదనంగా 3.2 కి.మీ దూరం పెరిగిందన్నారు.
సోమవారం హెచ్‌ఎంఆర్ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అలైన్‌మెంట్ మార్పుతో అవసరమైన ఆస్తుల సేకరణ, పెరిగే అంచనా వ్యయం పై స్వతంత్ర ఇంజనీరింగ్ ఏజెన్సీ లూయిస్ బెర్జర్ సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందన్నారు. తాజా మార్పుతో ఆస్తులు కోల్పోయే వారికి 2012 భూసేకరణ-పునరావాస చట్టం ప్రకారం పరిహార మిస్తామన్నారు. మెట్రో స్టేషన్లు, రైళ్లలో వికలాంగులకు వసతులు కల్పిస్తామన్నారు.
మెట్రోకు తొలగిన అడ్డంకులు
బేగంపేట్ గ్రీన్‌ల్యాండ్స్ నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రో పనులపై ఉన్న స్టేను ఇటీవలే హైకోర్టు తొల గించిందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు కరెంట్ కష్టాలు లేవని స్పష్టంచేశారు. ఉప్ప ల్, మియాపూర్ మెట్రో డిపోల్లో ప్రత్యేకంగా విద్యుత్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెట్రో ప్రా జెక్టుకు అన్నిరకాల అడ్డంకులు తొలగినట్లేనని తెలి పారు. మొత్తం 72 కి.మీ.కి గాను 40 కి.మీ. మార్గంలో పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని, 3 కారిడార్లలో 2,800 పిల్లర్లకుగాను 1,525 పిల్లర్ల నిర్మాణం పూర్తిచేశామన్నారు. పిల్లర్లపై వయాడక్ట్ సెగ్మెంట్ల అమరిక 30 కి.మీ. పూర్తయిందన్నారు.
నాగోల్-మెట్టుగూడ (8 కి.మీ)మార్గంలో స్టేషన్ల నిర్మాణం తుదిదశకు చేరుకుందన్నారు. ముంబై, ఢిల్లీ కంటే ఆధునిక కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టం (సీబీటీసీ) సాంకేతికత ఆధారంగా మెట్రో రైళ్ల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. ఇందులో డ్రైవర్‌లెస్ టెక్నాలజీ ఉంటుందని, ఉప్పల్‌లోని కంట్రోల్ కేంద్రం ద్వారా 2 నిమిషాలకోమారు ఒకదాని వెనక మరొకటి వెళ్లేలా మెట్రో రైళ్ల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్‌లలో ఉద్యోగాలిప్పిస్తామంటూ సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో జరుగుతున్న అసత్యప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ప్రస్తుతానికి ఉద్యోగాల భర్తీ లేదని ఆయన స్పష్టంచేశారు.
నేడు వికలాంగుల అవగాహన నడక
ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హెచ్‌ఎంఆర్, వికలాంగుల హక్కుల వేదికల ఆధ్వర్యంలో మంగళవారం వికలాంగుల అవగాహన నడకను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఉదయం 7కి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పీపుల్స్‌ప్లాజా వరకు నడక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమా న్ని స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభిస్తారన్నారు.