ఓటేస్తాం
- నగర రాజకీయాలను ప్రక్షాళన చేస్తాం
- ఇదీ ‘గ్రేటర్’ యువత మనోగతం
- ‘సాక్షి’ సర్వేలో వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో : గజి‘బిజీ’ జీవితం.. ట్రాఫికర్.. బద్ధకం.. అలసత్వం.. కారణమేదైనా నగరజీవులు ఓటింగ్ ప్రక్రియకు కాస్త దూరమే!. అందుకే సిటీలో ఓట్లకు, పోలింగ్‌కు పొంతన ఉండదు. కానీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నిక ల్లో ఈ సీన్ మారనుందనే అనిపిస్తోంది. సోషల్‌నెట్‌వర్క్ మీడియా పుణ్యమా అని యువతలో చైతన్యం రగిలింది. ఓటుపై అవగాహన కలి గింది. ఓట్ల శాతమూ పెరిగింది.
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, అవినీతి రహిత సమాజాన్ని స్థాపించేందుకు ఈసారి ఓటుహక్కు ను విధిగా వినియోగించుకుంటామని, బిజీలైఫ్‌లోనూ ఓటు వేసేందు కు సమయం కేటాయిస్తామని యువత ఘంటాపథంగా చెబుతోంది. యువత ఆశయాలు, ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే పార్టీలనే ఆదరిస్తామంటోంది.
నగర రాజకీయాలను ప్రక్షాళన చేస్తామంటోంది. హోరాహోరీగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ‘సాక్షి ’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. యువత నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. నగరవ్యాప్తంగా 18-25 ఏళ్ల మధ్యనున్న వెయ్యిమంది యువతను వివిధ అంశాలపై ప్రశ్నించగా, వారి అభిప్రాయాలిలా ఉన్నాయి.