- టెండర్లలో కనిపించని పారదర్శకత
- పోతుగల్లు చెరువుకు రెండోసారి టెండర్
- పెద్దాయన ఆదేశాలకు అధికారుల సలాం
- ప్రభుత్వానికి రూ.10 లక్షల నష్టం
- కోర్టుకు వెళ్లనున్న కాంట్రాక్టర్లు!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మిషన్ కాకతీయలో రాజకీయ నేతలు, అధికారుల వ్యవహారాలు ఇప్పుడిప్పుడే బహిర్గతమవుతున్నాయి. చెరువుల పునరుద్ధరణలో భాగంగా మొదటి విడతలో మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలోని పెద్ద చెరువును ఎంపిక చేశారు. ఈ చెరువును రూ.75.75 లక్షలతో అభివృద్ధి చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. ఇందులో పూడిక తీతల కోసమే సుమారు రూ.23 లక్షలకు పైగా నిధులు కేటాయించారు.
దీంతో అధికార పార్టీకి చెందిన మండల నాయకుడి కన్ను ఈ చెరువుపై పడింది. మిషన్ కాకతీయలో చెరువుల టెండర్లు ఈ-ప్రొక్యూర్‌మెంటులో నిర్వహిస్తున్నందున తక్కువ మొత్తానికి కోట్ చేసిన వారికే పనులు దక్కుతాయి. ఎలాగైన తనకు ఈ చెరువు పనులు దక్కేలా చూడాలని నియోజకవర్గ పెద్ద నాయకున్ని ఆశ్రయించారు. మండల నేతకు దక్కేలా చూడాలని ఇరిగేషన్ ముఖ్య అధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి. పూడిక తీతలతో నీటి సామర్ధ్యం పెంచుకునేందుకు ఆయకట్టులోని రైతులు కొందరు మరో కాంట్రాక్టర్ పేరుతో టెండర్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఈ చెరువు కోసం మార్చి 16న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పనులు దక్కించుకునేందుకు అధికార పార్టీ మండల నేత హర్షా కన్‌స్ట్రక్షన్స్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఏజెన్సీ పేరుపై టెండర్ వేశారు. మొత్తం ఈ టెండర్‌లో ఐదుగురు బిడ్లు దాఖలు చేశారు. అధికార నేతకు మద్దతుగా హర్షా కన్‌స్ట్రక్షన్ అంచనాలకు 4 శాతం ఎక్కువగా టెండర్ వేసింది. గట్టు జీవన్ అనే కాంట్రాక్టర్ 12.50 శాతం లెస్(తక్కువ), జీవీ రెడ్డి 12 శాతం లెస్, కె.వెంకటేశ్వర్‌రెడ్డి 6 శాతం లెస్, సుధాకర్‌రావు 7 శాతం లెస్‌లకు టెండర్లు దాఖలు చేశారు. టెక్నికల్ బిడ్‌లో హర్ష మాత్రమే ఎక్కువకు.. మిగిలిన టెండర్లన్నీ లెస్‌లో ఉండడంతో అధికారులకు ఏమి చేయాలో పాలు పోలేదు. ఫైనాన్సియల్ బిడ్ తెరిస్తే లెస్ ఎవరు ఉంటే వారికి అప్పగించాల్సి ఉంటుంది. అధికార నేత ఆదేశాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు మిగిలిన కాంట్రాక్టర్లకు సమాచారం అందించారు. అధికార పార్టీ నాయకులతో ఎందుకు తంటా అని కాంట్రాక్టర్లు సద్దుమణిగారు.
రెండోసారి టెండర్..
మిషన్ కాకతీయలో ఒక పనికి మళ్లీ టెండర్ వేయడం ఈ చెరువుతోనే మొదలయ్యింది. టెండర్ రద్దు చేసిన అధికారులు మళ్లీ ఈ చెరువుకు ఈనెల 8న ఆన్‌లైన్‌లో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి స్థానిక రైతుల తరఫున టెండర్ వేసేందుకు సహరించవద్దని ఇరిగేషన్ అధికారుల నుంచి కాంట్రాక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. దీంతో రైతులకు టెండర్ షెడ్యూల్ ఇచ్చేందుకు ఏ కాంట్రాక్టరు ముందుకు రాలేదు.
చెరువు పునరుద్ధరణ ఎలాగైనా చెపట్టాలన్న ధ్యేయంతో స్థానిక రైతులు వారి దగ్గరి కుటుంబీకుల్లోని కాంట్ట్రార్లను సంప్రదించారు. నల్గొండ జిల్లాకు చెందిన వారితో టెండర్ వేయించారు. ఈ సారి నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. నల్లగొండకు చెందిన హిమసాయి కన్‌స్ట్రక్షన్ రైతుల పక్షాన 9.99 శాతం లెస్, కరీంనగర్‌కు చెందిన కె.అనందరావు 2 శాతం లెస్‌కు వేశారు. గుజ్జ సుమన్‌రావు 3 శాతం ఎక్కువగా వేశారు. అధికార పార్టీ మండల నాయకుడి తరఫున టెండరు వేసిన హర్షా కన్‌స్ట్రక్షన్స్ గతంలో కంటే ఒక శాతం తగ్గించి 2.71 శాతం ఎక్కువకు టెండర్ దాఖలు చేశారు.
ఇతర జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లలో పాల్గొనడంతో అధికారులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. తక్కువ వేసిన ఇద్దరు కాంట్రాక్టర్లలో ఒకరికి సాల్వేన్స్(బ్యాంకు గ్యారంటీ) లేదని, మరోకరికి ఇంత పెద్ద పనిచేసిన అనుభవం లేదని పేర్కొంటూ అనర్హులుగా ప్రకటించారు. అధికార పార్టీ మండల నేతకు చెందిన హర్షా కన్‌స్ట్రక్షన్స్‌కు టెండర్ ఖరారు చేస్తునుట్లుగా సమాచారం బయటికి పొక్కింది. దీంతో లెస్‌కు వేసిన కాంట్రాక్టర్లు తమకు ఎందుకు అనర్హత లేదని నిర్ణయించారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని గురువారం సాగునీటి శాఖ సర్కిల్ కార్యాలయానికి వచ్చి సాంకేతిక విభాగం డిప్యూటీ ఇంజనీర్ రఘపతిని కోరారు. హిమసాయి, ఆనందరావు ఏజెన్సీలకు చెందిన ప్రతినిధులు ఈ విషయాన్ని ‘సాక్షి’కి తెలిపారు. మిషన్ కాకతీయలో పారదర్శక అనే విషయాన్ని పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
కోర్టుకు వెళ్తాం..
రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అర్హత ఉన్నప్పటికి టెండర్ మరొకరి దక్కేలా చేస్తున్న అధికారులపై కోర్టుకు వెళ్తామని హిమసాయి, ఆనందరావు కాంట్రాక్టర్ సంస్థలకు చెందిన ప్రతినిధులు తెలిపారు. ఫైనాన్సియల్ బిడ్ తెరిచినట్లు అధికారులు చెబుతున్నా.. ఆన్‌లైన్‌లో ‘కీ’ పెడితే పనులు ఎవరికి కేటాయించారో వివరాలు రావడం లేదని వారు తెలిపారు.
లెస్‌కు వేసిన టెండర్‌కు పనులు ఇస్తే ప్రభుత్వానికి సుమారు రూ.10 లక్షల వరకు ఆదా అవుతున్నా.. అధికారులు అధికార పార్టీ నాయకుడి కోసం కట్టపెట్టేందుకే ఈ డ్రామా అడుతున్నారని ఆరోపించారు. మిషన్ కాకతీయ అంతా పారదర్శకత అంటూ ఊదరగొడుతున్న అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలాంటి అంశాలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
కాకతీయలో ఆపరేషన్!
Published Fri, Apr 24 2015 2:52 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement