అది కొత్త సీసాలో పాత సారా | The new bottle that old Sara | Sakshi
Sakshi News home page

అది కొత్త సీసాలో పాత సారా

Published Fri, Apr 3 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

The new bottle that old Sara

  • ఐఆర్‌ఎస్ 2014 సర్వేపై ఐదు పత్రికల ధ్వజం
  • ఐఆర్‌ఎస్ - 2013ను 18 పత్రికలు ఖండించాయి
  • ఆ సర్వే పూర్తిగా లోపభూయిష్టం, తప్పుల తడక
  • అందులోని మూడొంతుల సమాచారాన్నే మళ్లీ వాడారు
  • హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా సహా ఐదు పత్రికల ఖండన
  • సాక్షి, హైదరాబాద్: భారతీయ పాఠకుల సంఖ్య సర్వే (ఐఆర్‌ఎస్) - 2014 పేరుతో ప్రకటించిన సర్వే ఫలితాలు.. కొత్త సీసాలో పాత సారా వంటివేనని ప లు జాతీయ పత్రికలు అభివర్ణించాయి. గతంలో 18 పత్రికలు ఏకగ్రీవంగా ఖండించిన ఐఆర్‌ఎస్ 2013 తరహాలో ఇది కూడా పూర్తిగా తప్పుదోవ పట్టించేదేనని.. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, దైనిక్ జాగరణ్, దైనిక్ భాస్కర్, అమర్ ఉజాలా పత్రికలు గురువారం ఒక ప్రకటనలో విమర్శించాయి. ‘‘మూడు వంతులు పాత సారా పోసి.. ఒక వంతు కొత్త సారా పోసి.. దానినే సరికొత్త సారా సీసాగా ఇవ్వజూపటం పారదర్శకత అనిపించుకోదు.

    ఈ సర్వేలో మూడు వంతులు గతంలో తిరస్కరించిన ఐఆర్‌ఎస్ 2013 లోనిదే. మిగతా నాలుగో వంతు మాత్రమే కొత్తగా చేపట్టిన శాంపిల్’’ అని తప్పుపట్టాయి.  ‘‘విచిత్రమేమిటంటే.. మా ఐదు పత్రికల పాఠకుల సంఖ్య గత ఐఆర్‌ఎస్ సర్వే కన్నా పెరిగినట్లు.. ఈ పెరుగుదల మా పోటీ పత్రికలకన్నా ఎక్కువగా ఉన్నట్లు చూపించారు. ఇది మేం గొప్పలు చెప్పుకోవటానికి ఉపకరిస్తుంది. కానీ.. సత్యం, నిష్పక్షపాతం విలువలకు కట్టుబడటం వల్ల మేం అలా చేయదలచుకోలేదు’’ అని స్పష్టంచేశాయి.

    గతంలో ఐఆర్‌ఎస్ 2013 తీవ్రమైన దోషంతో నిండివుందని, దిగ్భ్రాంతికరమైన లోపాలున్నాయని, దీనికి హేతుబద్ధత, కనీస పరిజ్ఞానం లేవని.. దేశంలోని 18 అగ్రస్థాయి వార్తాపత్రికల యాజమాన్యాలు ఏకగ్రీవంగా ఖండించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాయి. ‘‘హిందూ బిజినెస్ లైన్ పత్రికకు.. చెన్నైలో ఉన్న పాఠకుల కన్నా మణిపూర్‌లో మూడు రెట్లు ఉన్నారని; 60 వేలకు పైగా అధీకృత సర్క్యులేషన్ గల నాగ్‌పూర్‌కు చెందిన అగ్రశ్రేణి వార్తాపత్రిక హితవాదకు ఒక్క పాఠకుడు కూడా లేరని; ఢిల్లీలో ఆంగ్ల పాఠకుల సంఖ్య 19.5 శాతం తగ్గిపోయారని చెప్పటం.. ఆ సర్వే ఇచ్చిన షాక్‌లలో కొన్ని. ఇవి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) లెక్కలతో కూడా పూర్తిగా విభేదించాయి’’ అని ఆ సర్వేలోని లోపాలను ప్రస్తావించాయి.

    ఆ సర్వేలోని మూడు వంతుల సమాచారాన్ని కొత్త సర్వేలో ఉపయోగించటం వల్ల.. అందులోని చాలా పొరపాట్లు కొత్త సర్వేలోనూ పునరావృతమవుతాయనేది విస్పష్టమని పేర్కొన్నాయి. ‘‘పైగా.. ‘తాజా నమూనా’ అని చెప్పుకుంటున్న ఈ సర్వే క్షేత్రస్థాయి పరిశీలనను 2014 జనవరి - ఫిబ్రవరి నెలల్లో చేపట్టారు. అంటే ఇప్పటికి ఏడాది కాలం దాటిపోయింది. అలాంటపుడు ఈ నివేదికకు ‘ఐఆర్‌ఎస్ 2014 తొలి త్రైమాసికం’ అని పేరు పెడితే సరిగ్గా ఉండేది. కానీ.. ఇందులో కాలం చెల్లిపోయిన సమాచారం ఉంటే.. ఆ ఏడాది మొత్తానికి సంబంధించిన తాజా సమాచారం అన్నట్లు ఐఆర్‌ఎస్ - 2014 అని చెప్తున్నారు’’ అని ఆయా పత్రికలు మండిపడ్డాయి.

    ఎంఆర్‌యూసీ వంటి గౌరవప్రదమైన సంస్థ.. ఇటువంటి పాచిపోయిన సమాచారాన్ని.. అందులో లోపాల గురించి తనకు పూర్తిగా తెలిసి కూడా ఇప్పుడు విడుదల చేయటానికి ఎటువంటి కారణాలేమిటనేది తమకు అవగతం కావట్లేదని విమర్శించా యి. దోషరహితమైన సర్వేను ఐఆర్‌ఎస్ తీసుకువచ్చేవరకూ.. వారి సర్వేలోని లోపాలను ఎత్తిచూపటాన్ని కొనసాగిస్తామని, వారు చెప్పే సంఖ్యలకు ఎటువంటి విశ్వసనీయతనూ కల్పించబోమని తేల్చిచెప్పాయి.
     
    9.67% పెరిగిన సాక్షి’ పాఠకుల సంఖ్య

    ఐఆర్‌ఎస్ - 2014లో తెలుగు వార్తాపత్రికల పాఠకుల సంఖ్యను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా చూపించినప్పటికీ.. ఈ అధ్యయనం కోసం ఏపీలో కొత్తగా ఏ నగరాలనూ, లేదా పట్టణాలనూ ఎంపిక చేయలేదు. ఐఆర్‌ఎస్ - 2013ను తీవ్రంగా లోపభూయిష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా ఖండించాయి. ఎందుకంటే.. ఒకవైపు రాష్ట్ర విభజన, మరొకవైపు ఎన్నికలతో మీడియా క్రియాశీలంగా ఉండగా.. ప్రధాన వార్తాపత్రికలన్నీ భారీ సంఖ్యలో పాఠకులను కోల్పోయినట్లు చూపటంలో హేతుబద్ధత లేదు. అయితే.. 2013 సర్వేతో పోలిస్తే ఐఆర్‌ఎస్ 2014లో ‘సాక్షి’ పాఠకుల సంఖ్య 9.67 శాతం పెరగటం విశేషం. 2013లో 33.68 లక్షలుగా ఉన్న పాఠకుల సంఖ్య 2014లో 36.94 లక్షలకు చేరిందని ఈ సర్వే చెప్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement