‘ఓ తండ్రిగా ఆలోచించి నిర్ణయం..’ | YS Jagan Speech At The Hindu Group Excellence In Education At Vijayawada | Sakshi
Sakshi News home page

‘ఓ తండ్రిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా..’

Published Wed, Feb 5 2020 12:18 PM | Last Updated on Wed, Feb 5 2020 8:42 PM

YS Jagan Speech At The Hindu Group Excellence In Education At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : ‘ఒక ముఖ్యమంత్రిగా నేను తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తరాలపై పడుతుంది. ఒకవేళ నిర్ణయం తీసుకోకున్న ఆ ప్రభావం భవిష్యత్తు తరాలపై ఉంటుంది. రాజధానిగా చెప్తున్నా ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు.. రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. రూ. లక్షా 9వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి. రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించాను’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

బుధవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ది హిందూ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు. తన స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని సదస్సుకు హాజరైన ఆహుతులను ప్రశ్నించారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌ మీడియం, రివర్స్‌ టెండరింగ్‌, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై లెక్కలతో సహా సీఎం వైఎస్‌ జగన్‌ వివరణ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య మన దేశంలో చాలా తక్కువ. 77 శాతం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరడం లేదని అన్నారు. ఇంగ్లిషు మీడియం అనేది ఇప్పడు కనీస అవసరం. ఇంటర్‌నెట్‌, కంప్యూటర్‌ భాషలన్నీ ఇంగ్లిష్‌లో ఉంటాయి. ఈ రోజు మనం ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభిస్తే 20 ఏళ్లలో రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటివాడు. ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల్ని తెలుగు మీడియం స్కూళ్లకు పంపగలమా?. పేదవాళ్లు మాత్రమే తెలుగు మీడియం స్కూళ్లలో ఎందుకు చదవాలి?. 98.5 శాతం ప్రైవేట్‌ పాఠశాలలు ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువు చెప్తున్నాయి. పేద విద్యార్థులను ఎందుకు బలవంతంగా తెలుగు మీడియం చెప్పే పాఠశాలలకు పంపాలి. ఇంగ్లిష్‌ మీడియంలో చదవడం ద్వారా విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటారు. మేం కేవలం ఇంగ్లిష్‌ మీడియాన్ని మాత్రమే తీసుకురావడం లేదు.. విద్యావ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రారంభిస్తున్నాం. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతాం. ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తున్నాం. ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని తెలుసు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకురావడంతోపాటు.. విద్యావ్యవస్థలో మార్పుల కోసం నాలుగు కార్యక్రమాలు చేపట్టాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు 25వేల ప్రభుత్వ పాఠశాలల ఫొటోలు తీసి.. వచ్చే మూడేళ్లల్లో వాటి రూపురేఖలను మార్చబోతున్నాం. స్కూల్‌ బిల్డింగ్‌లు, బాత్‌రూమ్‌లు, ఫర్నీచర్‌ సహా అన్నింటినీ మార్చబోతున్నాం. నాడు-నేడు ద్వారా పాఠశాలల నాణ్యతను పెంచబోతున్నాం. అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాం. వంటలు చేసే ఆయాల జీతాల పెంచాం. అమ్మఒడి ద్వారా 42 లక్షల మంది తల్లులకు ఒక్కొక్కరికి రూ. 15వేలు ఇచ్చాం. తల్లులు తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తే ఏడాది రూ. 15వేలు అందజేస్తాం. ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకోస్తున్నాం. డిగ్రీని నాలుగేళ్లపాటు, ఇంజనీరింగ్‌ను ఐదేళ్లపాటు చదవాల్సి ఉంటుంది. చివరి  ఏడాది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. విద్యార్థులకు 100 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తున్నాం. ఏపీలో ప్రతి విద్యార్థికి విద్య రూపంలో ఎప్పటికీ తరగని ఆస్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేం చేపట్టిన సంస్కరణలకు మద్దతు తెలిపిన ది హిందూ పత్రికకు ధన్యవాదాలు. 

భవిష్యత్తు తరాల కోసం ఆలోచించా..
ప్రతీ ముఖ్యమంత్రికి అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. ఒక్క ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్‌ తరాలపై పడుతుంది. రాజధానిగా చెప్తున్నా ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు.. రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. రూ. లక్షా 9వేల కోట్లు అవసరమని గత ప్రభుత్వ రిపోర్టులే చెప్తున్నాయి.  రాజధాని కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించాను. ఒకవైపు అమరావతికి రూ. లక్షా 9వేల కోట్లు ఖర్చు చేయాలా?.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా? అని ఆలోచన చేశాను. మరోవైపు విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదు.

అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతోంది.. 
విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. విశాఖలో సచివాలయం, హెచ్‌వోడీ, ముఖ్యమంత్రి కార్యాలయాలు ఉండనున్నాయి. ఒక తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను  కాబట్టే.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశాం. ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. (చదవండి: రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’)

గ్రాఫిక్స్‌ చూపించాలని అనుకోలేదు..
రాష్ట్రంలోని ప్రజలను మభ్య పెట్టాలని, గ్రాఫిక్స్‌ చూపించాలని నేను అనుకోలేదు. నేను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలు మాత్రమే చెప్పా. జపాన్‌, సింగపూర్‌ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని నాకు తెలుసు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిచాం. గత పదేళ్లలో శ్రీశైలానికి చేరే కృష్ణా జలాలు.. 1200 టీఎంసీల నుంచి 600 టీఎంసీలకు పరిమితమయ్యాయి. మొత్తం కృష్ణానది ఆయకట్టుకు నీరు అందించడం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గోదావరిలో పుష్కలమైన జలాలున్నాయి. ఏడాదికి 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఒక్క అమరావతిలోనే డబ్బులు ఖర్చు చేయాలా?.. లేకపోతే ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలా?. (చదవండి: లెజిస్లేటివ్‌ రాజధాని అమరావతే)

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 2వేల కోట్లు ఆదా..
ఈ ఉగాదికి ఇల్లు లేని పేదవారికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా ప్రక్షాళన చేపట్టాం. ఒక టెండర్‌ ప్రాసెస్‌ కంటే ముందే న్యాయమూర్తి దగ్గరకు వెళ్తుంది. జ్యుడిషియల్‌ ప్రివ్యూ యాక్ట్‌ ద్వారా టెండర్లు పిలుస్తున్నాం. కాంట్రాక్ట్‌ సంబంధించి టెండర్లలో ఎలాంటి మార్పునైనా న్యాయమూర్తి సూచించవచ్చు. ఏడు రోజులపాటు టెండర్‌ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్నాక.. న్యాయమూర్తి ఆ టెండర్లకు ఒకే చెప్తారు. ఆ తర్వాత అత్యంత తక్కువ కోట్‌ చేసిన ధరను ప్రకటిస్తారు. ఆ ధరకంటే కూడా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇంకా ఎవరైనా తక్కువ ధరకు కోట్‌ చేస్తే వారికి ఇస్తాం. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చేశాం. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే రూ. 830 కోట్లు ఆదా చేశామ’ని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement