జన జీవనంపై వాన | The population living on the rain | Sakshi
Sakshi News home page

జన జీవనంపై వాన

Published Tue, Sep 9 2014 2:08 AM | Last Updated on Wed, Aug 1 2018 3:48 PM

జన జీవనంపై వాన - Sakshi

జన జీవనంపై వాన

ఆదిలాబాద్, ఖమ్మంల్లో వందలాది గ్రామాలు జల దిగ్బంధం
వేల ఎకరాల్లో నీట మునిగిన వరి, పత్తి, మిరప పంటలు
రోడ్లకు కోత.. చెరువులకు గండ్లు

 
సాక్షి నెట్‌వర్క్: రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. వరద నీటితో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో... రహదారులు తెగిపోయి చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. దాదాపు వంద వరకూ ఇళ్లు కూలిపోగా... భారీ సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, ఖమ్మం జిల్లాలో ఒకరు వరదనీటిలో గల్లంతయ్యారు. వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. ఈ సీజన్‌లోనే అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు 45 మంది సభ్యులతో కూడిన జాతీయ విపత్తు నిర్వహణ బృందాన్ని అక్కడికి పంపారు.

అంతా అతలాకుతలం..

ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. పెన్‌గంగా, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కోతకు గురై కౌటాల, బెజ్జూరు, దహెగాం, కాగజ్‌నగర్ తదితర మండలాల పరిధిలో సుమారు 120 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దహెగాం మండలంలో ఎర్రవాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోవడంతో... వైద్యం అందక మడె అమృత (20) అనే మహిళ మృతిచెందింది. తిర్యాణి మండలం ఇర్కపల్లికి చెందిన హన్మంతరావు (25), లోకేశ్వరం మండలం కిష్టాపూర్‌కు చెందిన ఎస్.కిషన్ (32) వరద నీటిలో గల్లంతయ్యారు. కొమురంభీం, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు.

జలదిగ్బంధంలో ఏజెన్సీ..

భారీ వర్షాలతో గోదావరిలో వరద పెరిగి ఖమ్మం జిల్లాలోని  8 మండలాలు, పాల్వంచ డివిజన్‌లోని 6 మండలాల్లోని 175 గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. భద్రాచలం నుంచి వాజేడు, వీర్‌పురం వెళ్లే రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సుమారు 20 వేల ఎకరాల్లో పత్తి, మిర్చి, వరి పంటలు, జామాయిల్ తోటలు నీటమునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి మట్టం సోమవారం సాయంత్రం 56 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం ఆలయ కల్యాణ కట్ట, అభయాంజనేయ స్వామి ఆలయం నీటమునిగాయి. కరకట్టకు ఉన్న స్లూయిస్‌ల లీకేజీతో భద్రాచలం పట్టణంలోకి వరద నీరు వచ్చి చేరడంతో... మూడు కాలనీల వారిని పున రావాస శిబిరాలకు తరలించారు. కుక్కునూరు మండలంలో పశువుల కాపరి కొట్టుకుపోయాడు.

పొంగి ప్రవహిస్తున్న వాగులు..

వరంగల్ జిల్లా రాంనగర్-రామన్నగూడెం గ్రామా ల మధ్యలోని లోలెవల్‌కాజ్‌వే పై నుంచి జీడివాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముంపు ప్రాం తం ప్రజలు గ్రామాల్లోనే ఉండిపోయారు. జంపన్నవాగు, దయ్యాలవాగు, వట్టివాగు, జీడివాగు, నా గులమ్మ ఒర్రె, సుద్దాలవాగు పొంగి ప్రవహిస్తుండడంతో పది గ్రామాల రాకపోకలు స్తంభించారుు.

ప్రాజెక్టుల్లోకి భారీగా వరద..

కృష్ణా  ఎగువ ప్రాంతాల్లో భారీగా వరదనీరు పోటెత్తుతుండడంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  సోమవారం రాత్రికి ప్రాజెక్టు నీటిమట్టం 1,044 అడుగులుగా ఉంది. ఇక గోదావరి నదిపై కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా.. 140.2 మీటర్లకు నీరు చేరుకుంది. సోమవారం సచివాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూం ఫోన్ నంబర్: 040-23454088, ఫ్యాక్స్ నంబర్: 040-23454293గా ఏర్పాటు చేశామని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
 
ముంపు గోదారి

ఏలూరు/కొవ్వూరు/రాజమండ్రి: ఎగువ ప్రాం తాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న గోదావరి సోమవారం ఉగ్రరూపందాల్చింది. నీటి ప్రవాహం ఉభయ గోదావరి జిలా ్లల్లో నదీ తీరాల్లోని లంకలను ముంచెత్తుతూ.. ప్రమాద స్థాయికి చేరుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద  నీటిమట్టం మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ఇప్పటికే గోదావరి లంకలు పూర్తిగా నీటమునిగారుు. వరద ప్రవాహం కాజ్‌వేలను సైతం ముంచెత్తింది.

వరద నీటిలో ఏడుగురు

తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలేనికి చెందిన ఏడుగురు పశువులను మేపడానికి గ్రామ సమీపంలోని గాజుల్లంకకు వెళ్లి వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అధికారులు ఇంజన్ పడవల సహాయంతో ప్రయత్నిస్తున్నారు.

 తూర్పులో ఇలా..

♦   గోదావరి ప్రవాహం పెరగడం, బ్యారేజి నుంచి భారీ పరిమాణంలో నీటిని విడుదల చేయడంతో రాజమండ్రి వద్ద, దిగువన కోనసీమలో పలు లంక గ్రామాలు ముంపు బారిన పడి 300 కుటుంబాలు అవస్థల పాల య్యా యి. తూర్పులంక, బ్రిడ్జి లంక, కేతావారిలంక, సుబ్రహ్మణ్యలంకలను వరద తాకింది. బ్రిడ్జిలంకకు చెందిన 45 కుటుంబాలను రాజ మండ్రి చందా సత్రానికి తరలించారు.

♦   కోనసీమలోని అయినవిల్లి, మామిడికుదురు, కొత్తపేట, ఆత్రేయపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం మండలాలతో పాటు కపిలేశ్వరపురం మండలంలోని సుమారు 90 లంక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. ఇప్పటికే అయినవిల్లి, పి.గన్నవరం మండలాల్లో కాజ్‌వేలు నీట మునిగాయి. ఏజెన్సీ ప్రాంతంలోని దేవీపట్నం మండలంలో సుమారు 30 గ్రామాలు ఆదివారం రాత్రి నుంచే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

♦   సాధారణంగా భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన వెంటనే ఈ గ్రామాలకు వరద సహాయక బృందాలు బయలుదేరాలి. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలకు ఐదు బృందాలను అధికారులు నియమించగా.. మూడు బృందాలు సోమవారం సాయంత్రం వరకూ ప్రత్యేక లాంచీల్లో గ్రామాలకు బయలుదేరనేలేదు. ప్రవాహం మరింత ఉధృతమైతే లాంచీలు కూడా ప్రయాణించలేవు. అదే జరిగితే వరద తగ్గేవరకూ ఆ గ్రామాలకు సాయం అందించే వీలుండదు.

 పశ్చిమలో ఇలా..

♦    పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని 26 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు  నిలిచిపోయాయి. కొత్తూరు, కోండ్రుకోట కాజ్‌వే, కడెమ్మ వంతెనలు నీటమునిగారుు.

♦    కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని వరద ముంచెత్తింది. గోదావరికి దిగువన గల యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌వే నీట ముని గింది. ఇదే మండలంలోని దొడ్డిపట్ల రేవులో గోదావరి మాత విగ్రహాన్ని తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలిలంక, బాడవ గ్రామాల్లోకి మంగళవారం వరద నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు వాటిని ఖాళీ చేరుుస్తున్నారు.

♦    గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతండటంతో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి..సహాయక చర్యలను పర్యవేక్షించారు.
 రెండో ప్రమాద హెచ్చరిక..

♦    ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద నది నీటిమట్టం సోమవారం సాయంత్రం 14.30 అడుగులకు చేరుకోగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజికి ఉన్న 175 గేట్లను ఎత్తివేసి 13,54,515 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

♦    భద్రాచలం వద్ద ఉదయం ఎనిమిది గంటలకు 53.6 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం ఆరు గంటలకు 56 అడుగులకు చేరింది. ఇదే ఉరవడి సోమవారం అర్ధరాత్రి రాజమండ్రి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement