సాక్షి, రంగారెడ్డి జిల్లా: నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలకు శుభవార్త. పదవుల కోసం ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నవారి నిరీక్షణ అతిత్వరలో ఫలించనుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం తాజాగా వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాలను రద్దు చేసింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటివరకు పదవులు అనుభవిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్, డెరైక్టర్ల పదవు లు సర్కా రు తాజా నిర్ణయంతో రద్దయ్యా యి. తిరిగి వీటిని భర్తీ చేసేవరకు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆ బాధ్యతలను సంబంధిత మార్కెటింగ్ శాఖ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది.
పర్సన్ ఇన్‌చార్జిల పాలన
ప్రస్తుతం జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో వికారాబాద్, మేడ్చల్, పరిగి మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు లేకపోవడంతో పర్సన్ ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. ఇబ్రహీంపట్నం, సర్దార్‌నగర్, నార్సింగి, చేవెళ్ల, మర్పల్లి, శంకర్‌పల్లి, ధారూర్, తాండూరు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలుండగా.. ప్రభుత్వం తాజాగా వీటిని రద్దు చేసింది. వీటికి కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటయ్యేవరకు పాలన పర్సన్ ఇన్‌చార్జీల కనుసన్నల్లో నడుస్తుంది. ప్రత్యేక గ్రేడ్ హోదా కలిగిన తాండూరు మార్కెట్ కమిటీకి మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు పర్సన్ ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. మిగిలిన 10 మార్కెట్ కమిటీలకు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు పర్సన్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు.
‘కుర్చీ’ దక్కేదెవరికో..
మార్కెట్ కమిటీ పాలకవర్గాలు రద్దు కావడంతో పార్టీ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తొలిసారిగా టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉత్సాహంగా ఉన్న నేతలు.. తాజాగా నామినేటెడ్ పదవులపై దృష్టి సారించారు. ఇప్పటికే అగ్రనేతల చుట్టూ చక్కర్లు కొట్టి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి ఆశించిన స్థాయిలో కేడర్ లేదు.
ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలు సైతం పదవులు దక్కించుకునే క్రమంలో కొత్త సమీకరణాలకు తెరలేపారు. పదవి కోసం ఏకంగా పార్టీలు మారేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నవారికి, తొలినాటి నుంచి పార్టీకి సేవలందించిన వారికి ఈ పదవులు కట్టబెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ కుర్చీలు ఎవరికి దక్కుతాయో వేచిచూడాలి.
నిరీక్షణకు తెర
Published Mon, Aug 18 2014 11:51 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement