సచివాలయం తరలింపు విరమించాలి | The Secretariat should stop the move | Sakshi
Sakshi News home page

సచివాలయం తరలింపు విరమించాలి

Published Sun, Sep 17 2017 1:56 AM | Last Updated on Sat, Sep 15 2018 8:38 PM

సచివాలయం తరలింపు విరమించాలి - Sakshi

సచివాలయం తరలింపు విరమించాలి

వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
► ఆ నిధులు సంక్షేమానికి వినియోగించాలని డిమాండ్‌
► వాస్తు పేరుతో రూ.300 కోట్ల దుర్వినియోగం: మతీన్‌
► సచివాలయం తరలింపుపై న్యాయ పోరాటం: శివకుమార్‌
► బైసన్‌ పోలో గ్రౌండ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ధర్నా విజయవంతం


సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం తరలింపును ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణమే వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సెక్రటేరియట్‌ తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం బైసన్‌పోలో గ్రౌండ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకూ ఉపయోగపడేలా హైదరాబాద్‌లో భవనాలు పంచారన్నారు.

‘ఓటుకు కోట్లు’కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి అమరావతికి పారిపోయారన్నారు. దీంతో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాల్సిన కేసీఆర్‌ వందల కోట్లు వెచ్చించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని తప్పుపట్టారు. కొత్త భవనాలకు వెచ్చించే నిధులను ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం మీకెక్కడిదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ భవనాల నుంచి పరిపాలన సాగించారని గుర్తుచేశారు. ప్రజా పరిపాలనకు వాస్తు అవసరం లేదన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి
సచివాలయాన్ని బైసన్‌ పోలో గ్రౌండ్‌కు తరలించాలన్న నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోందని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి.. తరలింపు ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. రైతులకు లాభం చేకూర్చని రైతు సమన్వయ సమితుల ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేకుంటే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాయని హెచ్చరించారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు మూడున్నరేళ్లయినా కొలిక్కి రాలేదని, అమరవీరుల సాక్షిగా చెప్పిన లక్ష ఉద్యోగాలు, ఉద్యమం సాక్షిగా రైతాంగానికి చెప్పిన కోటి ఎకరాలకు సాగునీరు, మేనిఫెస్టోలో చెప్పిన హామీల సంగతి తేల్చాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేసి కొత్త కట్టడాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. వైఎస్సార్‌ హయాంలో రాష్ట్రంలో పూర్తయిన 80 శాతం ప్రాజెక్టులను ప్రారంభించుకుంటూ వస్తున్నారన్నారని గట్టు అన్నారు.

గరీబోళ్ల పెన్షన్‌కు కేటాయించాలి
పార్టీ ప్రధాన కార్యదర్శి మతీన్‌ ముజ్దాదీ మాట్లాడుతూ.. సీఎం వాస్తు పేరుతో రూ.300 కోట్లు దుర్వినియోగం చేసే బదులు గరీబోళ్ల పెన్షన్‌కి కేటాయిస్తే బాగుంటుందని హితవు పలికారు. బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సచివాలయ నిర్మాణాన్ని తాము అంగీకరించబోమన్నారు. మరో ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌ మాట్లాడుతూ.. కోటి ఎకరాలకు నీరు, లక్ష ఉద్యోగాల హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టుకుందని, మూఢనమ్మకాలతో కోట్లాది రూపాయలు వృథా చేస్తున్నారని విమర్శించారు. సచివాలయానికే సీఎం కేసీఆర్‌ వస్తలేదని, ఆయనకు కొత్త సచివాలయందేనికని ప్రశ్నించారు.

రాబోయే రోజుల్లో బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. సీఎం డౌన్‌ డౌన్, బైసన్‌ పోలోను పేదల ఇళ్ల కోసం కేటాయించాలి, సచివాలయం తరలింపును విర మించుకోవాలి అంటూ ప్లకార్డులు చేత పట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, యువజన విభా గం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు  శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు నశ్రీన్, వనజ, అవినాశ్‌గౌడ్, నాగదేశి రవికుమార్, ఆర్‌.చంద్రశేఖర్, సంజీవరావు, కుసుమకుమార్‌రెడ్డి, కేసరీసాగర్, వెంకటరమణ, బాలకృష్ణారెడ్డి,  గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement