ఎమ్మెల్యేలపై నమ్మకం లేకే ఈ సర్వే
హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కి తన ఎమ్మెల్యేలపై నమ్మకం లేకపోవడం వల్లే సర్వేలని తెరపైకి తీసుకొస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..మూడేళ్ల పాలనలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారని ప్రజలు పట్టం కడుతారని, యువతకు వెన్ను పోటు పొడిచినందుకా లేక , రైతులను గాలికి వదిలేసినందుకా అని సూటిగా ప్రశ్నించారు.
12 శాతం రిజర్వేషన్ అని ముస్లిం, ఎస్టీలను మోసం చేసినందుకు కేసీఆర్‌కి పట్టం కట్టాలా..? అని ద్వజమెత్తారు. సర్వేల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, దమ్ము ధైర్యం ఉంటే పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ ఎమ్యెల్యేలను తన చేతిలో పెట్టుకోడానికే ఈ సర్వే నాటకమాడుతున్నారని ఆరోపించారు.