
ముష్కరులపై మూడో చార్జ్‌షీట్
మానవ బాంబులతో దాడి కేసులో ఎన్‌ఐఏ అభియోగపత్రం దాఖలు
కీలక నిందితులుగా రియాజ్, తెహసీన్ పేర్లు
కేసులో ఇద్దరు హైదరాబాదీలు కూడా..
హైదరాబాద్: మానవబాంబులతో హైదరాబాద్ నగరంలోని మూడు ప్రాంతాలతో సహా దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం మూడో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్‌లో ఉన్న ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించిన అభియోగపత్రాల్లో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్, ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్, జకీ ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్ (ఈ ముగ్గురూ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులు)లతో సహా మొత్తం ఇరవై మందిపై మోపింది. ప్రభుత్వంపై యుద్ధానికి తెగబడటం, ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నడం, నిషిద్ధ ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉండటం, యువతను ఆకర్షించి ఉగ్రవాదబాట పట్టించడం వంటి నేరాల కింద నిందితులు శిక్షార్హులని స్పష్టం చేసింది. ఇదే కేసుకు (ఆర్‌సీ నం-06/2012/ఎన్‌ఐఏ/డీఎల్‌ఐ) సంబంధించి గతేడాది జూలై 17న ఎన్‌ఐఏ దాఖలు చేసిన మొదటి చార్జ్‌షీట్‌లో హైదరాబాద్‌లోని పాతబస్తీ గుల్షన్ ఇక్బాల్‌కాలనీకి చెందిన ఒబేద్-ఉర్-రెహ్మాన్, షాహిన్‌నగర్‌కు చెందిన సయ్యద్ మగ్బూల్ అలియాస్ జుబేర్‌లతో పాటు బీహార్ వాసులు డానిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, ఇమ్రాన్ ఖాన్‌లు నిందితులుగా ఉన్నారు. వీరి వాంగ్మూలాల మేరకు అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు పేలుడు పదార్థాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది ఫిబ్రవరి 21న జరిగిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ హైదరాబాద్ విభాగం మగ్బూల్, ఇమ్రాన్‌లను పీటీ వారంట్‌పై తీసుకువచ్చి విచారించింది. ఆర్‌సీ నెం-06/2012 కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన ఐఎం ఫౌండర్ రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.ఢిల్లీ పోలీసులు 2012 అక్టోబర్‌లో ఈ కుట్రను ఛేదించి నలుగురు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. ఆ తరువాత కేసు దర్యాప్తు బాధ్యతల్ని జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. మూడో చార్జ్‌షీట్‌తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 మంది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ అభియోగాలు నమోదు చేసింది. వీరిలో ఐఎం వ్యవస్థాపకుడు, 2007లో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లలో నిందితుడిగా ఉన్న అమీర్ రజా ఖాన్ కూడా ఉన్నాడు.
ఇదీ ఉగ్రవాదుల కుట్ర...
రియాజ్ భత్కల్ దేశ వ్యాప్తంగా మరోసారి మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నాడు. మానవబాంబులతో వివిధ నగరాల్లో ఉన్న జనసమ్మర్ధ ప్రాంతాల్లో విరుచుకుపడాలని పథకం వేశాడు. వీరి టార్గెట్‌లో హైదరాబాద్‌తో పాటు బీహార్‌లోని బుద్ధగయ ప్రాంతం కూడా ఉంది. గతానికి భిన్నంగా మానవబాంబుల్ని తయారు చేసి దాడులు చేయాలని నిర్ణయించిన రియాజ్ దీపావళి టపాసుల్లో వాడే మందు, వ్యవసాయానికి వినియోగించే యూరియా, డీజిల్‌లతో అత్యాధునికమైనవి తయారు చేయించాలని నిర్ణయించాడు. బాంబుల తయారీలో ప్రమేయం ఉన్న మగ్బూల్‌కు వీటి తయారీ బాధ్యతలు అప్పగించాడు. ఔరంగాబాద్ శివార్లలో అసద్ ఖాన్‌కు ఉన్న ఫామ్‌హౌస్‌లో మగ్బూల్ కొన్ని ట్రయల్స్ కూడా పూర్తి చేశాడు. ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి 2011లో హైదరాబాద్ వచ్చి దిల్‌సుఖ్‌నగర్, బేగంబజార్, అబిడ్స్‌ల్లో రెక్కీలు నిర్వహించాడు. దిల్‌సుఖ్‌నగర్ టార్గెట్ అని 2012లో మగ్బూల్, ఇమ్రాన్ తదితరుల అరెస్టు సందర్భంలో బయటపడినా 2013 ఫిబ్రవరి 21 నాటి జంట పేలుళ్లను ఆపలేకపోయారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి.