జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.
ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్‌ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.
కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్‌కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్‌లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్‌లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment