న్యూఢిల్లీ: జైలులో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర ఎంపీ షేక్ రషీద్ ఇంజినీర్‌కు లోక్‌సభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనుమతించింది. దీంతో ఈ నెల అయిదవ తేదీన రషీద్ లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్ఐఏ ఆయనకు కొన్ని షరతులు విధించింది.
నూతన ఎంపీ మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది. కాగా షరతులకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జూలై 2న తుదితీర్పు ఇవ్వనుంది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
షేక్ అబ్దుల్ రషీద్ ఎవరు?
జమ్మూకాశ్మీర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజినీర్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఇంజనీర్ రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింద ఎన్‌ఐఏ 2019లో ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అబ్దుల్ రషీద్ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2008 మరియు 2014లో గెలుపొందిన జమ్మూ కశ్మీర్‌లోని లాంగేట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment