జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్‌పై శుక్రవారం సాయంత్రం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సమీపంలోని కొండపై నుంచి జవాన్లపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సైనిక బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందిన సమాచార మేరకు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది. సంఘటన స్థలంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్‌లో అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం.
కాగా నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో సహా ఉన్నత స్థాయి అధికారులు ప్రస్తుతం పూంచ్‌లోనే ఉన్నారు. అక్కడ తరుచూ జరుగుతున్న తీవ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరగడం గమనార్హం. గత ఆరు ఏడు నెలల్లో పిర్ పంజాల్ ప్రాంతంలో( రాజౌరీ, పూంచ్) ఉగ్రదాడులు ఎక్కువయ్యాయని, ఈ కాలంలో అధికారులు కమాండోలతో సహా 20 మంది సైనికులు మరణించారు.
ఇక నెల రోజుల వ్యవధిలో పూంచ్ జిల్లాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. మూడు వారాల క్రితం పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల వాహానాలపై ముష్కరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఈ దాడుల వెనక పాకిస్థాన్ - చైనా పన్నిన కుట్ర దాగుందని భారత రక్షణశాఖ వర్గాలు విశ్వసించాయి.
Comments
Please login to add a commentAdd a comment