సాక్షి, ఖమ్మం: ఒకప్పుడు మసీదులకు ఆదాయ వనరులుగా ఉన్న వక్ఫ్ భూములు నేడు అన్యాక్రాంతమయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో ఈ భూములకు రూ.కోట్లు పలుకుతుండటంతో వీటిపై కబ్జాదారుల కన్నుపడింది. అధికారులు, మసీదు సంరక్షకుల చేయి తడిపి అందినకాడికి కాజేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల్లో వందలాది ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యా యి. ఇవి వక్ఫ్ భూములని తెలిసి కూడా అధికారులు కబ్జాదారులకు సహకరించి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తుండటం గమనార్హం.
వక్ఫ్‌భూములు మసీదుల అభివృద్ధికి ఆదాయ వనరుగా ఉండాలి. ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏటా ఆయా మసీదు కమిటీల పేరున బ్యాంకు ఖాతాలో జమ చేసి ఖర్చు చేయాలి. కానీ ఈ పరిస్థితి మారిపోయింది. ఇవి ప్రభుత్వ భూములైనా బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే రూ.కోట్లు పలుకుతున్నాయి. ఖమ్మం నగ రం, పాల్వంచ, బూర్గంపహాడ్, వేంసూరు, కల్లూరు, బోనకల్, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ , కొణిజర్ల, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో విలువైన వక్ఫ్ భూములున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూములను క్రయవిక్రయాలు చేయకూడదు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి. అయితే జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రకారం వక్ఫ్ భూములు వందల ఎకరాలు ఉన్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడికక్కడ అన్యాక్రాం తమయ్యాయి. ముతావలి(సంరక్షకులు)లు ఈ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలి. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో ఖమ్మం నగరం, ప్రధాన పట్టణాల్లో ఉన్న వక్ఫ్ భూములకు ధర పెరిగింది. సంరక్షకులుగాా ఉన్న వీరు కబ్జాదారుల మాయలో చిక్కుకుని ఈ భూములను వారికి దొడ్డిదారిన అమ్మేస్తున్నారు.
కాసుల భూములు..: ఖమ్మం నగరంలో గత పదిహేనేళ్లలో 170 ఎకరాలకు పైగా వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయి. ఖమ్మం నగరం కార్పొరేషన్‌గా అవతరించి భూముల ధరలు పెరగడంతో ఇంకా ఈ ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. నగరంలోని జామామసీదు, ముస్తఫానగర్, గొల్లగూడెం, మున్నేరు నది సమీపం, బుర్హాన్‌పురం, ఖజాయిత్, షాహిద్ దర్గా ప్రాం తం, ఓల్డ్ క్లబ్, కస్పాబజార్ సమీపంలో ఈ భూములను ఆక్రమించడంతోపాటు రిజిస్ట్రేషన్లు చేసుకుని పెద్దపెద్ద భవనాలే నిర్మిం చారు. వీటికి కార్పొరేషన్ నుంచి కూడా అన్ని అనుమతులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ముతావలీలు మారుతుండటంతో వీరంతా ఈ భూములను అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. అలాగే వైరా, ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల, మధిర మం డలం మాటూరు, కొణిజర్ల మండలం అమ్మపాలెంలో కూడా ఈ భూములను ఆక్రమిం చారు. బోనకల్ మండలం నాగులవంచ, వేంసూరు రెవెన్యూ పరిధిలో, పాల్వంచ, ఎర్రుపాలెం మండలం రెమిడిచర్ల, బూర్గం పాడు మండలం నాగినేనిప్రోలులో కబ్జాలు యథేచ్ఛగా సాగాయి.
అధికారుల కన్నుసన్నల్లోనే...
మండలస్థాయిలో మసీదుల ఆధ్వర్యంలో ఉన్న వక్ఫ్ భూములకు ముతావలిలు సంరక్షకులు. ఇక అవి కబ్జాకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. మసీదుల భూములను కబ్జా చేస్తున్నారని కొంతమంది మత పెద్దలు మండల, జిల్లాస్థాయి అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. ఈ భూములకు స్థానిక అధికారులే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇస్తుండటంతో ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అధికారులకు ముడుపులు ముట్టచెబుతుండటంతో తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జాదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. కబ్జా అవుతున్నట్లు ఇచ్చే ఫిర్యాదులపై కొంతమంది అధికారులు స్పందిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినా ముతావలిలు వీరిని బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం.
ఎస్పీకి ఫిర్యాదు..: వేంసూరు గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.లక్షల విలువ చేసే మసీదు భూములు ఆక్రమణలో ఉన్నాయని, వీటిని రక్షించాలని కోరుతూ గ్రామానికి చెందిన కొంతమంది ముస్లింలు ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామ రెవెన్యూ పరిధిలో 70 ఎకరాల వరకు వక్ఫ్ భూములున్నాయి. ఇందులో 10 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు వారు ఎస్పీకి వివరించారు. అంతేకాకుండా ఉన్న భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని మసీదు అభివృద్ధికి వెచ్చించకుండా ముతావలిల వారసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణలో ఉన్న భూములపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఎస్పీకి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాసుల వక్ఫ్ భూములు
Published Sun, Oct 5 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement