
పుష్కరాలకు వెళ్లి... శవమై వచ్చిన యువకుడు
పుష్కరాల కోసం వెళ్లిన యువకుడు శవమై ఇంటికి చేరిన సంఘటన చెర్లపల్లిలో చోటు చేసుకుంది
వెల్దుర్తి : పుష్కరాల కోసం వెళ్లిన యువకుడు శవమై ఇంటికి చేరిన సంఘటన చెర్లపల్లిలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని చెర్లపల్లి గ్రామానికి చెందిన కర్రోళ్ల లక్ష్మి, బుచ్చయ్య దంపతుల ఇద్దరు కుమారులు. వీరిలో రెండోవాడు కర్రోళ్ల ప్రవీణ్(21) ఆటో నడుపుతూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొంత మంది పుష్కరాల కోసం బాసర వెళ్తూ శుక్రవారం సాయంత్రం ప్రవీణ్ ఆటోను కిరాయి మాట్లాడుకుని మాసాయిపేట రైల్వే స్టేషన్‌కు వెళ్ళారు. ప్రవీణ్ సైతం ఆటోను స్టేషన్ వద్ద నిలిపి వారితో పాటు వెళ్లాడు.
శనివారం ఉదయం గోదావరి ఘాట్ వద్ద స్నానం చేయడానికి నదిలోకి దిగిన ప్రవీణ్‌కు మూర్చ రావడంతో నదిలో మునిగి మృతి చెందాడు. దీంతో స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సహకారంతో పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. అదే సమయంలో గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల కోసం రూ.5వేలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ అశోక్‌గౌడ్, నాయకులు భూపాల్‌రెడ్డి,వేణుగోపాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, క్రిష్ణాగౌడ్, అశోక్‌రెడ్డి ఉన్నారు.