సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. మొన్నటివరకు ఎన్నికల సమయం కదా అనుకుంటే, ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రభుత్వం నుంచి పైసా అందలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. పాఠశాలల్లో నిర్వహణ ఖర్చులను పక్కనపెడితే, విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన చాక్‌పీసులకు కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంది. గదులు ఊడ్చే, టాయిలెట్లు శుభ్రంచేసే సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 2018–19 విద్యా సంవత్సరంలో జూన్, జూలై, ఆగస్టు నెలలు మినహా ఇప్పటివరకు పాఠశాలలకు ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల నిర్వహణకు, కేజీబీవీల నిర్వహణకు కేంద్రం ఇస్తున్న 60% నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉండిపోవడంతో పాఠశాలల్లో ప్రతి పనికీ ఇబ్బంది తప్పడం లేదు. ముఖ్యంగా సమగ్ర శిక్షా అభియాన్‌లో (ఎస్‌ఎస్‌ఏ) వివిధ పనులకు నిధులు లేక, సిబ్బందికి వేతనాలులేక తంటాలు పడుతున్నారు.
రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఏకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1,200 కోట్లకు ఆమోదం తెలిపింది. అందులో 60 శాతం కేంద్రం వెచ్చిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంది. ఇందులో భాగంగా కేంద్రం మొదటి విడతలో తమ వాటాగా రూ.470 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం తమ వాటా కలిపి మొత్తంగా రూ.600 కోట్లు సర్వ శిక్షా అభియాన్‌కు విడుదల చేయాల్సి ఉంది. కానీ విద్యా సంవత్సరం మొదట్లో కేవలం రూ.80 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో మొదటి మూడు నెలలు పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఇపుడు పాఠశాలల్లో ఇబ్బందులు తీవ్రతరం అయ్యాయి. విద్యాశాఖ రూ.600 కోట్లను ఖర్చు చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇస్తేనే కేంద్రం రెండో విడత డబ్బును విడుదల చేయనుంది.
రాష్ట్రం తమ వాటా ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చిన మొదటి విడత నిధులను కూడా విడుదల చేయకపోవడంతో క్షేత్ర స్థాయిలో 27 వేల పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నిర్వహణ నిధులు లేక, జీతాలు లేక మండలాల్లో పనిచేసే దాదాపు 10 వేల మంది వరకు క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో జిల్లాల్లో, పాఠశాలల ఖాతాల్లో ఏమైనా నిధులు ఉంటే వాటిని వేతనాలుగా తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసిందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. మరోవైపు గత డిసెంబర్ 12వ తేదీన ప్రభుత్వం రూ.472 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్‌వో) ఇచ్చినా డబ్బులను మాత్రం విడుదల చేయకపోవడంతో తంటాలు తప్పడం లేదు. పాఠశాలల్లోని విద్యార్థులను బట్టి కొన్ని పాఠశాలల్లో ఒక్కరు, మరికొన్ని స్కూళ్లలో ఇద్దరు చొప్పున పనిచేస్తున్న వేల మంది స్కావెంజర్లు కూడా వేతనాలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లోనూ నిర్వహణ కష్టతరంగా మారింది.
చాక్‌పీసులకూ పైసల్లేవ్
Published Sat, Jan 5 2019 3:49 AM | Last Updated on Sat, Jan 5 2019 3:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment