- విధులను నిర్లక్ష్యం చేసిన నిలోఫర్ వైద్యుడి బదిలీ
- నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులపట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడంతోపాటు సమయపాలన పాటించని వైద్యులపై సర్కారు కొరడా ఝళిపిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖపై ఏడు గంటలపాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రులపై ఆ శాఖ అధికారులు అప్రమత్త య్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. సీఎం ఇటీవల ఫీవర్ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో ఆ ఆసుపత్రి సూపరింటెం డెంట్ శంకర్, ఆర్‌ఎంవో చిత్రలేఖ, ఐదుగురు డాక్టర్లు లేకపోవడం విమర్శలకు దారితీసింది. దీంతో వైద్య విద్యాశాఖ సంచాలకులు (డీఎంఈ) పుట్టా శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇంతమంది లేకపోతే ఇక ఆసుపత్రి నడపడం ఎలా అని ఆయన పేర్కొన్నారు. దీంతో వారందరికీ సోమవారం నోటీసులు జారీ చేసినట్లు డీఎంఈ ‘సాక్షి’కి చెప్పారు. నిలోఫర్ ఆసుపత్రికి తాను శుక్రవారం రాత్రి వెళ్లి 9.45 గంటల నుంచి 11 గంటల వరకు పరిశీలించానని... ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ నారాయణ లేనేలేరని చెప్పారు. రికార్డుల్లో మాత్రం ఆయన విధుల్లో ఉన్నట్లు రాసి ఉందన్నారు. దీంతో ఆయన్ను తక్షణమే వరంగల్‌కు బదిలీ చేసినట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణలో విఫలమైన నిలోఫర్ సూపరింటెండెంట్ దేవరాజ్‌కు నోటీసులు జారీ చేశానన్నారు.
ఉస్మానియా ఆసుపత్రి అసిస్టెంట్ డాక్టర్ భార్గవి విధుల్లో ఉన్నా రౌండ్స్ వేయలేదని... అందుకు ఆమెకూ మెమో జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిత్యం పారిశుద్ధ్యంపై ఇంటర్నెట్ ద్వారా ఫొటోలు పంపాలని డీఎంఈ ఆదేశించారు. ఎంతమంది డాక్టర్లు విధుల్లో ఉన్నారో తప్పనిసరిగా నివేదిక పంపాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అందుతోన్న వైద్య సేవలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నందున విధుల పట్ల, పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వైద్య సేవలు అందించకపోతే వేటే
ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో పేదలకు సరైన వైద్య సేవలు అందించకపోతే కఠి నంగా వ్యవహరించాలని సర్కారు సంబంధిత వైద్యాధికారులను ఆదేశించింది. సీఎం సహా మంత్రులు, వైద్యాధికారులు తరచూ తనిఖీలు చేయాలని, ఫిర్యాదులపై స్పం దించి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాలని నిర్ణయించారు. విధులపట్ల క్రమశిక్షణగా ఉన్న వారికి సరైన చోటుకు బదిలీలు, ఉద్యోగోన్నతులు ఇవ్వాలని అంచనాకు వచ్చారు. కోఠిలోని కీలక అధికారుల పేషీల్లో అవినీతి, నిర్లక్ష్యం రాజ్యమేలుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొందరు అధికారుల పీఏలు తమ వద్దే ఫైళ్లు ఉంచుకొని సంబంధిత కీల కాధికారికి అందించకుండా లంచాల కోసం చేతులు చాపుతున్నారన్న విమర్శలూ ఉన్నా యి. ఈ నేపథ్యంలో వైద్యరంగాన్ని ప్రక్షాళన చేస్తానని సీఎం చెప్పడంతో అధికారులు, డాక్టర్లు, సిబ్బంది వణికి పోతున్నారు.