జగిత్యాల: నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలపై పలు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. గంటలోపే 14 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈవీఎంను పట్టుకున్నారని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరిగిన రోజునే ఈవీఎంలను తరలించాల్సింది పోయి 15వ తేదీ రాత్రి తరలించడం ఏమిటని ప్రశ్నించారు.
ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. జగిత్యాల, నిజామాబాద్ కలెక్టర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్ ఓడిపోలేదని వ్యాఖ్యా నించారు. లక్ష్మణ్‌కుమార్ ఓడిపోవడంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ‘ప్రజాగొంతుకైన కలానికి సంకెళ్లా?’ అనే పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం జగిత్యాల కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మకు వినతిపత్రాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment