వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.. దాన్ని ఐదు గంటలకు కుదించారు.. ఇదన్నా సక్రమంగా ఇస్తున్నారా అంటే అదీ లేదు.
భీమ్‌గల్, న్యూస్‌లైన్ : ‘వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.. దాన్ని ఐదు గంటలకు కుదించారు.. ఇదన్నా సక్రమంగా ఇస్తున్నారా అంటే అదీ లేదు. మా ఊర్లో 30 గంటలుగా కరెంటు లేదు. అసలు పంటలు ఉంటాయా..’ అంటూ జాగిర్యాల గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భీమ్‌గల్ పట్టణ శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు ట్రాన్స్‌కో అధికారుల తీరుకు నిరసనగా సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకుని వచ్చిన ఏఈ అశోక్‌ను నిలదీశారు. పొట్ట దశలో ఉన్న పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క గ్రామాలకు ఉంటున్న విద్యుత్ తమ గ్రామానికి ఎందుకు ఉం డడం లేదని ప్రశ్నించారు.
ఏ నుంచి సి, బి నుంచి డి గ్రూపుల మధ్యన విద్యుత్ వేళలు షిఫ్టింగ్ సమయం లో ఇలా జరిగిందని ఏఈ తెలిపారు. సరిగ్గా అదే స మయంలో పైనుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతరాయం ఏర్పడిందన్నారు. ఇక ముందు అలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో గ్రామ ఉప సర్పంచ్ చిన్నోల్ల నవీన్, మాజీ ఉప సర్పంచ్ సంగెం రాజేశ్వర్, రైతులు కల్లెడ దేవేందర్, చిన్నోల్ల సురేష్, బొంగు రాజేశ్వర్ గౌడ్, కల్లెడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.