హుజూర్‌నగరం.. గరం! | There is an internal debate in Congress over who is the candidate for the seat Hujurnagar | Sakshi
Sakshi News home page

హుజూర్‌నగరం.. గరం!

Published Thu, Sep 19 2019 3:05 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

There is an internal debate in Congress over who is the candidate for the seat Hujurnagar  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ఎవరన్న దానిపై కాంగ్రెస్‌లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మొదటి నుంచీ ఊహిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌  సతీమణి పద్మావతి బరిలో ఉంటారా.. అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేశారా లేదా అనే విషయాల్లో డోలాయమానం కన్పిస్తోంది. అయితే గతంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్‌కే తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకమాండ్‌ ఇచ్చే అవకాశాలున్నా.. ఈలోపే వ్యక్తమవుతున్న అభ్యంతరాలు, ఫిర్యాదులు హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి.  

పద్మావతే అభ్యర్థి..? 
హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన నాటి నుంచే ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన సతీమణి పద్మావతిని పోటీ చేయించే ఆలోచన లేదని ఉత్తమ్‌ మొదట్లో చెప్పడంతో అభ్యర్థి ఎవరన్న దానిపై సందిగ్ధత నెలకొంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు, స్థానిక నేతలు, కేడర్‌ అభిప్రాయం ప్రకారం పద్మావతే అక్కడ సరైన అభ్యర్థి అనే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఉత్తమ్‌తో పాటు మంచి పరిచయాలున్న ఆమె అయితే టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వొచ్చని, కచ్చితంగా గట్టెక్కే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తన సతీమణి పద్మావతి పోటీ చేస్తారనే సంకేతాలను ఉత్తమ్‌ పంపారు. దీంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ వార్తలను  ఖండించారు. హుజూర్‌నగర్‌ అభ్యర్థిగా ఎవరినీ ఖరారు చేయలేదని ప్రకటించారు. 

హైకమాండ్‌ చెప్పాలి కదా?
హుజూర్‌నగర్‌ బరిలో పద్మావతి ఉంటారని ఉత్తమ్‌ ఎలా చెబుతారని, అసెంబ్లీ అభ్యర్థిత్వాలను పార్టీ హైకమాండ్‌ ప్రకటిస్తుందనే వాదన కాంగ్రెస్‌లో అంతర్గతంగా జరుగుతోంది. ఉత్తమ్‌ ప్రకటనపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అభ్యం తరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను కలసి రేవంత్‌ చర్చించారని, పద్మావతి అభ్యర్థిగా ఖరారైనా కూడా ఉత్తమ్‌ ప్రకటించడమేంటని ప్రశ్నించినట్లు గాంధీభవన్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చామల కిరణ్‌రెడ్డిని తాను ప్రతిపాదిస్తున్నానని పేర్కొనడం మరింత వేడిని రాజేసింది. ప్రస్తుతానికి కొంత గందరగోళం ఉన్నా కాంగ్రెస్‌ హుజూర్‌నగర్‌ అభ్యర్థిగా పద్మావతి పేరే చివరకు ఖరారవుతుందని సమాచారం.  

సెల్ఫీ కావాలంటే వారినే అడగాల్సింది : రేవంత్‌రెడ్డి
‘పవన్‌ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు సెల్ఫీ దిగే అవకాశం రాకపోతే నేనేం చేయాలి. దానికి టీపీసీసీ చీఫ్‌నే అడగాల్సింది’ అని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యురేనియం తవ్వకాలపై పార్టీ తరఫున ఓ కమిటీని వేసి దాని చైర్మన్‌గా వీహెచ్‌ ను పీసీసీ అధ్యక్షుడు నియమించారు. వాళ్లిద్దరూ హాజరైన సమావేశానికి నేను కూడా వెళ్లాను. యురేనియం తవ్వకాలతో ప్రభావితమయ్యే ప్రాంతంలో నా సొంతూరు ఉందనే ఆవేదనతో వెళ్లా. అక్కడకు సంపత్‌ రావడం ఎందుకు.. పవన్‌తో సెల్ఫీ దిగాలని అనుకుంటే టీపీసీసీ అధ్యక్షుడిని అడగాల్సి ఉండే’ అని అన్నారు. రేవంత్‌ మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అటుగా వచ్చారు. ‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని వదిలేసి నన్ను రాజగోపాల్‌రెడ్డి సోదరుడి గా దత్తత తీసుకున్నారని రేవంత్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement