పరిశోధనలా.. లైట్‌ తీస్కో! | There is no research in 332 medical colleges in the country | Sakshi
Sakshi News home page

పరిశోధనలా.. లైట్‌ తీస్కో!

Published Mon, Jan 28 2019 1:21 AM | Last Updated on Mon, Jan 28 2019 1:21 AM

There is no research in 332 medical colleges in the country - Sakshi

వైద్య కళాశాలలో సీటు వచ్చిందా... చదివామా... హాయిగా స్థిరపడ్డామా.. అనే ధోరణి ఇప్పటి విద్యార్థుల్లో నెలకొంది.ఎంబీబీఎస్‌ చదవడం, ఆ తర్వాత ఏదో స్పెషలైజేషన్‌ పూర్తిచేసి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆరంకెల జీతంతో చేరడమే లక్ష్యమైంది. పైగా వైద్య రంగంలో పరిశోధన చేసే వారిని రెండో జాతి పౌరుడిగా చూస్తున్నారన్న ప్రచారమూ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య కళాశాల ల్లో పరిశోధన మసకబారింది. ఎయిమ్స్‌ సహా మరికొన్ని బోధనాసుపత్రుల్లో మాత్రమే దీనికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ అంశాన్నే ‘ఇండిపెండెంట్‌ కమిషన్‌ ఆన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌ ఇండియా’ఎత్తి చూపింది. దీంతో దేశంలో పుట్టుకొస్తున్న అనేక వ్యాధులకు పరిష్కారాలు దొరకడంలేదని పేర్కొంది. ఈ స్థితిపై ఒక అధ్యయన పత్రాన్ని కేంద్రానికి అందజేసింది. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారమే మెడికల్‌ కాలేజీల్లో నియమించుకునే అధ్యాపకులు తప్పనిసరిగా పరిశోధన పత్రాలు సమర్పించి ఉండాలి. వివి ధ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్‌ల్లో వారి పరిశోధన పత్రా లు ముద్రితమై ఉండాలంది. అప్పుడే దేశంలో పరిశోధన ముందుకు సాగుతుందని తెలిపింది. ఈ పత్రంపై రాష్ట్రంలోని వివిధ వైద్య ప్రముఖులూ చర్చిస్తున్నారు.    
– సాక్షి, హైదరాబాద్‌

ఇస్రో స్ఫూర్తి..ఎంతో మేలు 
ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశోధనల్లో ప్రధానంగా ఆయా దేశాల్లో వస్తున్న వ్యాధులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సంభవిస్తున్న జబ్బులకు పరిష్కారాలు కనుగొంటున్నారు. జీవనశైలి వ్యాధులు, స్థానికంగా తలెత్తుతున్న ఇన్‌ఫెక్షన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో 2007 నాటికి 9,066 ఆరోగ్య పరిశోధనా పత్రాలు తయారయ్యాయి. అందులో ఢిల్లీ ఎయిమ్స్‌ ఒక్కటే 2,567 పత్రాలను విడుదల చేయడం విశేషం. స్కోపస్‌ అనే డేటా బేస్‌ సంస్థ విశ్లేషణ ప్రకారం 2005–14 మధ్య దేశంలో ఉన్న 579 వైద్యకళాశాలలు, బోధనాసుపత్రుల్లో కేవలం 25 సంస్థల్లో మాత్రమే ఏటా 100కు పైగా పరిశోధనా పత్రాలు సమర్పించాయి. 332 కళాశాలలు ఒక్క పరిశోధనా పత్రాన్ని సమర్పించలేకపోయాయి. వాటి పత్రాలు ఏవీ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్‌లో ముద్రితం కాలేదు. అందులో మన తెలంగాణకు చెందిన కాలేజీలు ఉండటం విశేషం. కానీ మన దేశంలోనే ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో జరుగుతున్న పరిశోధనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కమిషన్‌ పేర్కొంది.ఇందులో పనిచేసే శాస్త్రవేత్తలకు చెల్లిస్తున్న వేతనాలు సముచితంగా ఉన్నా, ప్రైవేటు రంగంతో పోలిస్తే తక్కువే. అయినా ఇస్రోలో ఎందుకు పరిశోధనలు బాగుంటున్నాయంటే అక్కడ పని సంస్కృతి అధికంగా ఉండటమేనని కమిషన్‌ తేల్చింది.అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు జాతికి గర్వకారణంగా నిలిచారు. వైద్య రంగంలో పరిశోధనలు కుంటుపడటానికి బ్యూరోక్రసీ, రాజకీయ రంగ ఆధిపత్యం కూడా కారణాలుగా నిలిచాయి. 

వైద్య పరిశోధనలకు తలసరి కేటాయింపు రూ.డెబ్భైయేనా? 
వైద్యరంగంలో పరిశోధనలకు అత్యంత తక్కువ కేటాయిస్తున్నారు. మన దేశంలో తలసరి కేటాయింపు కేవలం రూ.70 మాత్రమే. ఆ కొద్ది మొత్తానికీ ప్రభుత్వం కొర్రీలు పెడుతుంది. స్థానిక అవసరాలు, దేశం ఎదుర్కొనే కీలక అనారోగ్య అంశాలపై కేంద్రీకరించడంలేదు. పైగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) దేశానికి అవసరమైన ఆరోగ్య పరిశోధన ఎజెండాను సరిగా నిర్వచించడంలేదన్న విమర్శ నెలకొంది. దీంతో ఐసీఎంఆర్‌ 2017 నుంచి 2024 మధ్య కాలానికి గాను పరిశోధనలపై వ్యూహాత్మక ప్రణాళికను రచించింది. ఐదు ప్రధాన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. శక్తి సామర్థ్యాలను సాధించడం, డేటా మేనేజ్‌మెంట్, సంప్రదాయ వైద్య విధానాలను గుర్తించడం, వాస్తవాల పునాదులపై విధానాలను రూపొందించడం, పరిశోధనల ద్వారా ఆరోగ్య కార్యక్రమాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఆరోగ్య బడ్జెట్లో 2% పరిశోధనకు సిఫార్సు..
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చూస్తే... ఆరోగ్య బడ్జెట్లో కనీసం రెండు శాతం పరిశోధనకు కేటాయించాలని కమిషన్‌ సిఫార్సు చేసింది. అందులో ప్రజారోగ్యంపై జరిగే పరిశోధనలకు అధికంగా ఇవ్వాలంది.మెడికల్‌ కాలేజీల్లో పరిశోధనరంగాన్ని విస్తృతం చేయాలి. అధ్యాపకులకు పరిశోధనలపై పదోన్నతులు కల్పించాలి. వారి పరిశోధన పత్రాలు వివిధ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్‌ల్లో ముద్రితమై ఉండాలి.జాతీయస్థాయి ప్రాధా న్యం ఉన్న అంశాలపై పరిశోధనను తప్పనిసరి చేయాలి. వైద్య రంగంలో పరిశోధన చేసే వారిని ప్రముఖంగా గుర్తించాలి. 

వైద్య రంగంలో పరిశోధన విధాలు... 4
1 ప్రత్యక్ష పరిశోధన... ఏదో ఒక వ్యాధిపై పరిశోధన చేయాలి. అది కూడా జాతీయ ప్రాధాన్యంగల అంశంపై చేయాలి. స్వల్పకాలిక లేదా మధ్యకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా జరగాలి. ప్రభుత్వమే ఆ ప్రాధాన్యాన్ని నిర్ధారించాలి. ప్రభుత్వమే నిధులు కేటాయించాలి.  

2 అంతర్జాతీయస్థాయి కలిగిన కటింగ్‌ ఎడ్జ్‌ రీసెర్చ్‌.. దీని లక్ష్యం కొత్త వ్యాక్సిన్లు, మాలిక్యూల్స్, సాంకేతిక అంశాలను అభి వృద్ధి చేయడం. 
ప్రైవేటు రం గంతో కలసి నిర్వహిస్తారు. మేధోపరమైన హక్కులు సాధించుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు.  

3 క్లినికల్‌ రీసెర్చ్‌... వ్యాధుల వల్ల దేశానికి కలిగే నష్టం, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జరగాలి. ప్రధా నంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిధులు కేటాయించాలి.  

4 విదేశీ నిధులతో జరిగే పరిశోధనలు... ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగానికి సవాల్‌ విసురుతున్న అంశాలపై దేశంలో జరిగే పరిశోధనలకు అంతర్జాతీయ సంస్థలు నిధులు కేటాయిస్తాయి. ఆ నిధులతో పరిశోధనలు చేపట్టాలి.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement