సొంత వాళ్లే ముంచారు | They doused own | Sakshi
Sakshi News home page

సొంత వాళ్లే ముంచారు

Published Fri, Aug 8 2014 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సొంత వాళ్లే ముంచారు - Sakshi

సొంత వాళ్లే ముంచారు

  •       చేసింది చెప్పుకోలేక ఓడాం
  •      సాధారణ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌లో చర్చ
  •      ‘వరంగల్ లోక్‌సభ’ పరిధిలో ముగిసిన పొన్నాల సమీక్ష
  •      సారయ్య, సిరిసిల్ల, దుగ్యాల గైర్హాజరు
  • సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకంగా పనిచేశారు. టిక్కెట్ల కేటాయింపు ఆలస్యంగా జరిగింది. తెలంగాణ ఇచ్చిన విషయం, హామీలపై స్పష్టంగా చెప్పలేకపోయాం. డబ్బులు ఉన్న నేతలకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఇవ్వడంతో వారు కొందరికే ప్రాధాన్యం ఇచ్చారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో బాగా పని చేసింది. ఓటమితో అయినా మన పార్టీ నేతల తీరు మారాలి. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన అందరిపై చర్యలు తీసుకోవాలి.  ఓట్లు వేయిస్తానని చెప్పి డబ్బులు దండుకున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. పార్టీపై సమీక్షలు కాదు, నాయకులపై సమీక్షలు చేయాలి. చిన్న కార్యకర్తలను ఎదిగేలా చేయాలి. కాంగ్రెస్ బలోపేతం కోసం చర్యలు మొదలుపెట్టాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలి.’
     
    ...సాధారణ ఎన్నికల్లో ఓటమిపై నియోజకవర్గాల సమీక్షలో కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు ఇవీ. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమిపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింట సమీక్ష పూర్తయింది.

    వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు ఎవరూ వెళ్లకపోవడంతో ఈ సెగ్మెంట్‌పై సమీక్ష జరగలేదు. వరంగల్ తూర్పు సెగ్మెంట్‌కు ఇటీవలి వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య సమీక్షకు హాజరు కాలేదు.
     
    మొదటి నుంచి పొన్నాలకు ప్రత్యర్థి వర్గంగా ఉన్న ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ సమీక్షకు వెళ్లలేదని తెలిసింది. సారయ్యకు సన్నిహితంగా ఉండే వరంగల్ మాజీ లోక్‌సభ సభ్యుడు సిరిసిల్ల రాజయ్య సైతం సమీక్షకు హాజరుకాలేదు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దుగ్యాల శ్రీనివాసరావు సైతం సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు.

    డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, కొండేటి శ్రీధర్, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జి.విజయరామారావు, నేతలు భువనగిరి ఆరోగ్యం, హరిరమాదేవి, టి.విద్యాసాగర్, జి.రమాకాంత్‌రెడ్డి, ఈవీ.శ్రీనివాస్, బట్టి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా కమిటీని వెంటనే నియమించాలని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాపోలు జయప్రకాశ్, ఈవీ.శ్రీనివాస్, కె.శ్రీనివాస్, లక్ష్మణ్‌గౌడ్  కోరారు.
     
    నైరాశ్యం వద్దు...
     
    ఆరు నియోజకవర్గాల సమీక్షల్లో నాయకులు చెప్పిన అంశాలను ఆలకించిన పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య... పార్టీ బలోపేతం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాష్ట్ర పార్టీ నేతలను పరిశీలకులుగా నియమిస్తామని చెప్పారు.  పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై క్రమశిక్షణ సంఘం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ‘అసలైన కార్యకర్తలకు న్యాయం చేస్తాం. పార్టీని కూడగట్టడం... ముందుకు ఎలా వెళ్లాలో వంటి అంశాలపై  గ్రామ, మండల, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకుందామన్నారు.

    ఓటమి సహజమని... ఎవరూ నైరాశ్యం చెందొద్దన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా... మన వాళ్లు మనకు ఉంటారు, అందరం కలిసి పార్టీ కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.  జిల్లాలోని 12 నియోజకవర్గాల నేతలు కలిసి వరంగల్ కార్పొరేషన్‌లో విజయం కోసం ప్రణాళిక రూపొందించుకుందాం’ అని పొన్నాల అన్నట్లు విశ్వసనీయనీయ వర్గాల ద్వారా తెలిసింది.
     
    పరకాల : ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఇనుగాల వెంకట్రామిరెడ్డి సహా 25 మంది నాయకులు ఈ సమీక్షకు హాజరుకాగా... సాంబారి సమ్మారావు గైర్హాజరయ్యూరు. టికెట్ల కేటాయింపులో ఆలస్యం కావడంతో ప్రజల్లోకి వెళ్లలేకపోయామని... ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని పలువురు అభిప్రాయపడ్డారు. కొందరు కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ వారితో చేతులు కలపడంతో నష్టపోయామని చెప్పారు. ఇలాంటి వారిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ పొన్నాల చెప్పారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన నేతలకు పదవులు ఇవ్వొద్దని పొన్నాలను పలువురు కోరారు.
     
    భూపాలపల్లి : టీఆర్‌ఎస్ మేనిఫెస్టో, కేసీఆర్ బహిరంగ సభలు ఎన్నికల్లో ప్రభావితం చూపాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర నేతలు చెప్పారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలతో సింగరేణి కార్మికులు, యువత ముఖ్యంగా కొత్త ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని పలువురు అన్నారు.
     
    పాలకుర్తి...
     
    పాలకుర్తి : నియోజకవర్గ సమీక్షకు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావు హాజరు కాలేదు. కొడకండ్ల, పాలకుర్తి నుంచి నాయకులు ఎవరు హాజరుకాలేదని తెలిసింది.  జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన దుగ్యాల శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కొందరు నాయకులు ఫిర్యాదు చేశారు. పాలకుర్తి రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాంచారని చెప్పారు. ఈ అంశాలు తమ పరిశీలనలో ఉన్నాయని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.
     
    వర్ధన్నపేట : నియోజకవర్గ సమీక్షలో కాంగ్రెస్ నాయకులు మోసం చేయడం వల్లే ఓడిపోయామని పార్టీ నేతలు చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వారు ఇప్పుడు కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన 11 మంది నాయకులపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు చెందిన సీనియర్ నాయకులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది.
     
    వరంగల్ పశ్చిమ : నియోజకవర్గ సమీక్షలో ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ... ‘ఎవరి మీద ఫిర్యాదు చేయను. ఏ ఒక్కరు చేస్తేనో విజయం రాదు. కాంగ్రెస్ విజయం కోసం ఎవరు పనిచేశారు, ఎవరు చేయలేదని నేను చెప్పదలుచుకోలేదు. ఏ ఒక్కరో ఇద్దరో వ్యతిరేకంగా పనిచేసినా, అనుకూలంగా వ్యవహరించినా... మెజారిటీ విషయంలో అంత తేడా ఉండదు. పార్టీ ఓటమిపై అందరం పరిశీలించుకోవాలి. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం అందరం కృషి చేయాలి’ అన్నారు.
     
    స్టేషన్‌ఘన్‌పూర్ : నియోజకవర్గ సమీక్ష సాదాసీదాగా జరిగింది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనను పట్టించుకోవడం లేదని భువనగిరి ఆరోగ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకు ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement