సిరిసిల్లలో రూ.100 కోట్ల భూములు పరాధీనం | they were khabja the god lands also | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో రూ.100 కోట్ల భూములు పరాధీనం

Published Sat, Jul 19 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

సిరిసిల్లలో రూ.100 కోట్ల భూములు పరాధీనం

సిరిసిల్లలో రూ.100 కోట్ల భూములు పరాధీనం

సిరిసిల్లలో రూ.100 కోట్ల భూములు పరాధీనం
నామమాత్రపు ధరలకే దక్కించుకున్న వైనం
నిర్మాణాల కూల్చివేతకు రాజకీయ అడ్డంకులు
సీఎం ఆదేశాలతో కబ్జాదారుల గుండెల్లో గుబులు

 
సిరిసిల్ల నడిబొడ్డున పురాతనమైన శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. పాపభీతి లేకుండా దేవుని భూములను కొందరు కబ్జా చేశారు. రాజకీయ అండదండలు, దేవాదాయశాఖ ఉదాసీన వైఖరి వల్ల సుమారు రూ.100 కోట్ల విలువైన భూములు పరాధీనమయ్యాయి. ఆక్రమణలకు గురైన ఆలయాల భూములను వెనక్కి తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో సిరిసిల్ల వెంకన్న భూముల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశమైంది.
 
సిరిసిల్ల :  సిరిసిల్లలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎనిమిది శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఆలయ అర్చకుల జీవనభృతి కోసం కొంత భూమిని ఇనాంగా అందించారు. ఈ భూములు ఒకప్పుడు ఊరికి దూరంగా ఉండేవి. క్రమంగా సిరిసిల్ల పట్టణం విస్తరించడంతో ఆలయ భూములు ఇప్పుడు పట్టణ నడిబొడ్డున ఉన్నాయి. పట్టణంలోని సుభాష్‌నగర్, శాంతినగర్, గాంధీనగర్, అంబేద్కర్‌నగర్‌లను కలుపుకొని ఈ భూములు విస్తరించి ఉన్నాయి. వీటిపై కన్నేసిన కొందరు వ్యక్తులు రాజకీయ పలుకుబడితో పుష్కరకాలం కిందటే కబ్జా చేసేందుకు పథకం ప్రకారం పావులు కదిపారు.
 
పట్టణంలోని సుభాష్‌నగర్‌లో సర్వేనంబర్ 611లో మూడెకరాల 36 గుంటల భూమి ఉండగా, దాన్ని మూడు బిట్లుగా విభజించారు. ఈ భూమిని కేవలం రూ.19 లక్షలకే కొందరు స్థానికులు దక్కించుకోగా, రూ.6 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించలేదు. మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుతం ఈ భూముల విలువ రూ.కోటి ఉంటుంది. పాత ధరకే రిజిస్ట్రేషన్ చేయాలంటూ దేవాదాయ శాఖ అధికారులకే నోటీసులిస్తున్నారు.
 
పట్టణంలోని శాంతినగర్‌లో సర్వేనంబర్ 1578లో ఎకరం 16 గుంటల భూమి ఉంది. ఇందులో బుర్ర రామస్వామి, ఎన్.వెంకటేశ్వర్‌రావు, ఎండీ.ఉమ్రాన్ అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇండ్లను తొలగించాలని దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు నిర్మించుకున్నవారు హైకోర్టును ఆశ్రయించగా, ఒక్కొక్కరు రూ.వెయ్యి చొప్పున నెలనెల ఆలయ ఈవోకు డ్యామేజి కింద అద్దె చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రెండేళ్లపాటు అద్దె చెల్లించిన ఈ ముగ్గురు ఏడాదికాలంగా ఎగబెడుతున్నారు. శాంతినగర్‌లో సర్వేనంబర్ 263లో ఎకరం మూడు గుంటల భూమి ఉండగా, ఏటా రూ.పదివేలకు కౌలుకు ఇచ్చారు. ఇలా ఆలయ భూములను ఎక్కడికక్కడ స్థానికులే ఆధీనంలో ఉంచుకున్నారు.
 
గాంధీనగర్‌లో సర్వేనంబర్లు 603, 604, 668, 671, 646, 650, 651లో దేవాలయ ఇనాం భూమి పదెకరాల పది గుంటలు ఉంది. ఈ భూమి మార్కెట్ విలువ రూ.61 కోట్లు ఉండగా, 2002లో జీవో ఎంఎస్ నంబర్ 1743/2000 ద్వారా కేవలం రూ.14 లక్షలకే సొంతం చేసుకున్నారు. దేవాలయంలో పూజలు చేసే ఆలయ అర్చకుల పేరున ఉన్న ఈ భూములను కొందరు ముందే కొనుగోలు చేసి ప్రభుత్వ పెద్దల అండతో ఇనాం చట్టాన్ని ఉల్లంఘించి సొంతం చేసుకున్నారు.
 
ప్లాట్లుగా విక్రయించి భూములు అమ్మారు. అర్చక కంప్రమెన్స్ ద్వారా అమ్మినట్లుగా రికార్డుల్లో పేర్కొన్నా, నిజానికి రూ.కోట్లు విలువ చేసే ఇనాం భూములు రూ.లక్షల్లోనే పరాధీనమయ్యాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజకీయ నేతల ఒత్తిళ్లతో జీవోలు ఇచ్చి ఇనాం భూములను ధారదత్తం చేసింది. పట్టణంలోని అంబేద్కర్‌నగర్, శాంతినగర్‌లో ఇనాం భూములు ఇప్పటికీ కొందరి చేతుల్లో ఉన్నాయి.
 
కోర్టుల్లో కేసులు.. కాసుల పంటలు
ఇనాం భూముల విక్రయాన్ని అడ్డుకునేందుకు కొందరు స్థానికులు కోర్టులో కేసులు వేశారు. 1999లో కోర్టుకు వెళ్లిన కొందరు తర్వాత కబ్జాదారులతో చేతులు కలిపి కాసులు దండుకున్నారు. ఇనాం భూముల చట్టం 982 జీవో ప్రకారం తెలంగాణ ప్రాంతంలో దేవాలయ భూములను అమ్మడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ కొందరు కోర్టులకు వెళ్లి కాసులు సంపాదించారు.
 
సిరిసిల్ల మున్సిపల్ లేఖ నంబర్ జీ1/832/2000 సంవత్సరంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇనాం భూముల్లో పదిశాతం లేఅవుట్‌గా మున్సిపల్‌కు కేటాయించాలని కోరినా ప్లాట్లు అమ్మినవారు ఇదేం పట్టించుకోకుండా రాజకీయ అండదండలతో ప్లాట్లను అమ్ముకున్నారు. కౌన్సిలర్లను సంతృప్తిపరిచేందుకు ఇతర మార్గాలను ఆశ్రయించారు. మొత్తంగా సిరిసిల్లలో దేవాలయ భూములు గంపగుత్తగా కబ్జాల పాలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన దేవాదాయ శాఖ ఉన్న ఆస్తులను కూడా కాపాడుకోలేకపోతోంది. ఎక్కడికక్కడ ఆక్రమణల పాలవుతున్నా రక్షణ కల్పించడంలో విఫలమైందన్న  ఆరోపణలున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement