
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తళుక్కుమననున్నారు. వినూత్న ఆలోచనలతో స్థాపించిన తమ స్టార్టప్‌లతో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తల సరసన సత్తా చాటనున్నారు. హెచ్‌ఐసీసీలో మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన 76 మంది యువ పారిశ్రామికవేత్తలకు అవకాశం దక్కింది. వారిలో పలువురిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ఈ యువ పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలను వెల్లడించారు.
– సాక్షి, హైదరాబాద్
సొరెవా..
ఇంటింటికీ సౌర విద్యుత్
పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు.. ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్.. రాజస్తాన్ బిట్స్ పిలానీలో బీటెక్.. అనంతరం క్యాంపస్ సెలెక్షన్స్‌లోనే రిలయన్స్ సంస్థలో రూ.10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. కానీ కొత్తగూడెంకు చెందిన శివ సుబ్రమణ్యానికి ఇవేవీ సంతృప్తినివ్వలేదు. తాను కలలుగన్న ప్రాజెక్టు కోసం ఆర్నెల్లలోనే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. సౌర విద్యుత్‌ను గ్రామస్థాయిలో ఇంటింటికీ తీసుకురావడమే లక్ష్యంగా.. ‘సొరెవా’పేరుతో కంపెనీని నెలకొల్పారు. ప్రయోగాత్మకంగా ‘ఈ–గ్రిడ్’అనే ప్రాజెక్టును చేపట్టారు. ‘పవర్ టు ఎంపవర్’అనే థీమ్‌తో స్వయం సహాయక గ్రూపుల సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇచ్చాయి. 2017 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ‘ఎన్‌ఐఎస్‌ఈ’కింద ఇచ్చిన ప్రాజెక్టును గుర్గావ్‌లో విజయవంతంగా అమలు చేయడంతో.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. వివిధ దేశాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఆ ప్రాజెక్టును సందర్శించి, ప్రశంసించారు. ఈ క్రమంలో పలువురు విదేశీ శాస్త్రవేత్తల సలహాల మేరకు.. దేశ విదేశాల్లో ‘సోలార్ ప్రాజెక్టు–మహిళా సాధికారత’, ఇతర అంశాలపై ప్రపంచ స్థాయి సదస్సుల్లో ప్రసంగించారు. 70కి పైగా దేశాల్లో పర్యటించి తన ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు. ఈ క్రమంలో హాంకాంగ్‌లో జరిగిన సదస్సులో శివ ప్రాజెక్టు నచ్చిన అమెరికన్ కంపెనీ ‘సోలెవాల్ట్’.. సోరెవా కంపెనీతో కలసి పనిచేయటానికి ముందుకు వచ్చింది. ఈ విధంగా ఇరు సంస్థలు కలసి ఆఫ్రికాలోని గినీ దేశంలో తొలి ప్రాజెక్టును ప్రారంభించారు. వచ్చే మూడేళ్లలో 200 గ్రామాల్లో సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడమే వారి లక్ష్యం. ‘‘అమెరికన్ కంపెనీతో కలసి పనిచేయడం.. హైదరాబాద్‌లో మహిళా సాధికారత థీమ్‌తో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో పాల్గొనే అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి..’’అని శివ సుబ్రమణ్యం పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్
సమస్యల పరిష్కార వేదిక
ఏటా లక్షలాది మంది ఉన్నత చదువులు చదువుతున్నారు. కానీ ఇంగ్లిష్ భాషపై పట్టు, ఉద్యోగంలో చేరేందుకు అవసరమైన కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు ఉండటం లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు చూపే దిశగా స్థాపించిన సంస్థే ‘ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్’. జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్‌కు చెందిన పులి రవి ఈ సంస్థను స్థాపించారు. ఉద్యోగం కోసమని ఇరవై ఏళ్ల కింద రవి అమెరికా వెళ్లారు. ఐదేళ్లపాటు ఉద్యోగం చేశాక.. ‘ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్’పేరిట ఓ సంస్థను ప్రారంభించారు. జీఈఎస్ సదస్సులో పాల్గొనే అవకాశం వచ్చిన నేపథ్యంలో ‘సాక్షి’ ఆయనను పలకరించింది. కనీసం బస్సు సౌకర్యం లేని మారుమూల పల్లె నుంచి అంచెలంచెలుగా తాను ఈ స్థాయికి వచ్చానని.. తన లాంటి నేపథ్యమున్న యువత భారత్‌లో ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి యువత డిగ్రీలు చదివినా ఇంగ్లిష్ భాషపై పట్టు లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లోపాలతో మంచి ఉద్యోగాలు సంపాదించడంలో వెనకబడిపోతున్నారని చెప్పారు. అలాంటి వారికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని ఉందని.. ఈ మేరకు తమ సంస్థ తరఫున ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఈ సదస్సు జరగడం ఎంతో ప్రయోజనకరమన్నారు. వివిధ దేశాల్లో పరిశ్రమలు నిర్వహిస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు ఒకే చోట కలసి.. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన, నిర్వహణ, సవాళ్లపై చర్చిస్తారని చెప్పారు.
కోకోబూస్ట్..
తృణధాన్యాలతో పౌష్టికాహారం
తేజస్విని.. ‘కోకోబూస్ట్’పేరిట ఫుడ్ స్టార్టప్‌ను స్థాపించి ఏడు నెలల్లోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహిళ. చిత్తూరు జిల్లా బుడిపాలం మండలం రాజవానిపట్టడికి చెందిన ఆమె.. సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తూనే, సివిల్ సర్వీస్ కోసం సన్నద్ధమవుతున్న తేజస్విని... ఇటు ‘కోకోబూస్ట్’సంస్థనూ విజయవంతంగా నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పౌష్టికాహార సమస్యను ఎదుర్కొంటున్నాయి. పిల్లల, పెద్దల ఆహారపు అలవాట్లు, జంక్‌ఫుడ్‌తో అనేకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి పౌష్టికాహారాన్ని సరికొత్త పద్ధతిలో అందుబాటులోకి తేవాలని భావించిన తేజస్విని.. ‘కోకోబూస్ట్’ను స్థాపించారు. తృణధాన్యాలతో పూర్తి పౌష్టికాహారాన్ని తయారు చేస్తున్నారు. వాటిని న్యూట్రిషన్ బార్ (చాక్లెట్ బార్ లాంటి) రూపంలో అందిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, అథ్లెట్లు, క్రీడాకారులు, డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇవి ఉపయుక్తంగా ఉంటాయని తేజస్విని చెప్పారు. అంతేకాదు ఎలాంటి రసాయన మిశ్రమాలను ఉపయోగించకుండా.. పూర్తి సహజ పద్ధతిలో నిల్వ చేస్తున్నామన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా తాము కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కర్ణాటక నేషనల్ మిల్లెట్ ఫెయిర్‌లో ‘కోకోబూస్ట్’ ఆకర్షణగా నిలిచిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment