
ప్రమాదం జరిగిన ఇల్లు
నాంపల్లి: ఇంటి మధ్య గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడిన సంఘటన గురువారం రాత్రి నగరంలోని హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అఫ్జల్‌సాగర్ మాన్గార్ బస్తీలో రోజు కూలితో పొట్టపోసుకునే మిఠాయి లాల్, సీమ దంపతులు తమకున్న ఆదాయ వనరులతో పునాదులు లేకుండా సిమెంట్ ఇటుకలతో చిన్న శ్లాబ్ ఇల్లు నిర్మించుకున్నారు. అదే ఇంట్లో గబ్బార్, సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు.
మిఠాయిలాల్, సీమలకు రోష్ని (4), లక్ష్మీ (5) పావని (రెండు నెలలు) సంతానంకాగా గబ్బార్, సురేఖలకు వరలక్ష్మి (5), గీత (3), ఆరోల (2) పిల్లలుఉన్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చిన తల్లిదండ్రులు బయట వీధిలోకి వెళ్లారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో గదిలోని వంట గది దిమ్మె వేడెక్కి గదికి మధ్యలో ఉన్న గోడపై పడింది. దీంతో ఆ గోడ ఒక్కసారిగా పిల్లలపై పడటంతో మిఠాయిలాల్ దంపతుల ముగ్గురు పిల్లలూ మరణించారు. అలాగే గబ్బార్ దంపతుల పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నిలోఫర్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.