
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో స్టేట్ హోం అధికారులను విచారిస్తున్న పోలీసులు
* స్టేట్ హోంలో ఘటన
* చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు
* వేధింపులు తాళలేకే అంటున్న బాధితులు
హైదరాబాద్: స్టేట్ హోంలో ముగ్గురు బాలికలు గురువారం ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. వెంటనే బాలికలను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. వారం క్రితం స్టేట్‌హోం సిబ్బంది కళ్లుగప్పి పారిపోయిన 11మంది బాధితుల్లో ఈ ముగ్గురు కూడా ఉండటం గమనార్హం.
వివిధ నేరాలకు పాల్పడి అరెస్టైన 18 ఏళ్లలోపు అమ్మాయిలను కోర్టు ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలోని రెస్క్యూ హోంకు తరలిస్తారు. అలాగే తల్లిదండ్రులులేని అనాథలు, భర్త, ఇతరుల నిరాధరణకు గురైన మహిళలకు స్టేట్‌హోంలో వసతి కల్పిస్తారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 15 ఏళ్ళ బాలిక, మెదక్ జిల్లా కారమంగి గ్రామానికి చెందిన 16 ఏళ్ళ బాలిక, ఖమ్మం జిల్లా ముట్టితాండ గ్రామానికి చెందిన 15 ఏళ్ళ బాలిక సిబ్బంది వేధింపులు తాళలేక గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
రెస్క్యూహోంలోని ఇద్దరు బాలికలు ఐరన్ టాబ్లెట్లను మింగగా, స్టేట్‌హోంలోని మరో బాలిక సర్ఫ్ కలిపిన నీళ్లు తాగింది. హోం ఇన్‌చార్జి నిర్మల వెంటనే 108కు సమాచారం అందించి, చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలికలు మింగిన మాత్రలు, తాగిన సర్ఫ్ నీళ్లను వైద్యులు బలవంతంగా కక్కించారు.
వేధింపులు తాళలేకే..
అధికారుల వేధింపులు తాళలేకే తాము ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే హోంలో ఆశ్రమం పొందుతున్న బాలికలందరినీ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నామని, ఇప్పటి వరకూ తాము ఎవ్వరినీ వేధించలేదని శిశుసంక్షేమ శాఖ అధికారులు చెపుతున్నారు. రెస్క్యూ హోం, స్టేట్ హోంలో ఉండలేకే వారు ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.