ప్రారంభానికి సిద్ధమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి
నగరానికి ప్రత్యేకాకర్షణగా నిలవనున్న దుర్గం చెరువుపై కేబుల్ వంతెన పనులు చకచకా పూర్తవుతున్నాయి. హైదరాబాద్ ఐకానిక్‌గా మారనున్న దీన్ని జూలై నెలాఖరున ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2నే ప్రారంభించాలని తొలుత భావించినప్పటికీ, విద్యుత్ అందాలు సమకూర్చడం తదితర తుది మెరుగులు దిద్దాల్సి ఉండటం, ముఖ్యంగా దానికి అనుసంధానంగా జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45 ఫ్లై ఓవర్ పనులు పూర్తికావాల్సిన నేపథ్యంలో జూలై నెలాఖరుకు ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ అధికారులకు లక్ష్యం నిర్దేశించినట్లు తెలిసింది. దీని అంచనా వ్యయం రూ.184 కోట్లు.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో మరికొన్ని ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. పనులు మంజూరై దాదాపు రెండేళ్లయినప్పటికీ, అనుమతి కోసం ఎదురు చూస్తున్న రెండు స్టీల్ బ్రిడ్జిలు, మరో ఫ్లై ఓవర్ పనులకు ఈమేరకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జూ పార్క్, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో మూడు ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో భూసేకరణలతో సహ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని పనులు త్వరితంగా చేసేందుకు స్టీల్ బ్రిడ్జిలు నిర్మించాలని భావించారు. గతంలో నగరంలో స్టీల్‌బ్రిడ్జిలు లేకపోవడం.. సదరు పనులు చేసేందుకు తొలుత కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండరు నిబంధనల్లో మార్పులు చేయడం, అంచనా వ్యయం కొంత పెరగడం, తదితర పరిణామాలతో జాప్యం జరిగింది. గత సంవత్సరమే టెండర్లు పూర్తయినప్పటికీ, అప్పటికే వివిధ ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉండటం, జీహెచ్‌ఎంసీలో నిధులు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో ప్రభుత్వం నుంచి ఆ పనులకు ఆమోదం లభించలేదు. ఇటీవల మూడు పనులకు జీవోలు జారీ చేసి పచ్చజెండా ఊపడంతో అధికారులు తదుపరి ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా..
భూ సేకరణలు, ఇతరత్రా కాకుండా ఫ్లై ఓవర్ల నిర్మాణాలకే మూడు ప్రాజెక్టులకు వెరసి మొత్తం రూ.1086.44 కోట్లు ఖర్చు కానుంది. ఇవి వినియోగంలోకి వస్తే ఉప్పల్, రామంతాపూర్, విద్యానగర్, రామ్‌నగర్, వీఎస్టీల నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా సెక్రటేరియట్, లక్డీకాపూల్, పంజగుట్ట తదితర ప్రాంతాలవైపు వెళ్లేవారికి, రామ్‌నగర్ నుంచి వయా బాగ్‌లింగంపల్లి హిమాయత్‌నగర్, సెక్రటేరియట్, బషీర్‌బాగ్‌ల వైపు వెళ్లే వారికి సాఫీ ప్రయాణం సాధ్యమవుతుంది.
⇔ మిథాని, సంతోష్‌నగర్‌ల వైపు నుంచి చాదర్‌ఘాట్, కోఠిల మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
⇔ ఆరాంఘర్, జూపార్క్ మార్గంలో ప్రయాణాలు చేసేవారికి ఎంతో సదుపాయంగా ఉంటుంది.
మలుపులు ఉంచుతారా.. ప్లాన్ మారుస్తారా..
ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యంగా ఇందిరాపార్కు–వీఎస్‌టీ జంక్షన్, నల్గొండ క్రాస్‌రోడ్స్– ఒవైసీ జంక్షన్ ఫ్లై ఓవర్ల మార్గాల్లో ఆయా ప్రాంతాల్లో మలుపులున్నాయి. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రమాదాలకు షార్ప్ కర్వ్ కారణమనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూపొందించిన ప్లాన్‌ల మేరకే వీటిని నిర్మిస్తారో, లేక మార్పులు చేస్తారో వేచి చూడాల్సి ఉంది.
ప్రాజెక్టుల వివరాలిలా..
నల్గొండ క్రాస్‌రోడ్స్– ఒవైసీ జంక్షన్ ఫ్లై ఓవర్
పరిపాలన అనుమతి :10 మే, 2018
ఫ్లై ఓవర్ పొడవు :2.5 కి.మీ.
వెడల్పు :16.6 మీటర్లు
లేన్లు : 4 (రెండు వైపులా ప్రయాణం) అంచనా వ్యయం : 312.37 కోట్లు
ఆరాంఘర్– జూ పార్క్ ఫ్లై ఓవర్
పరిపాలన అనుమతి :5 మే 2018
ఫ్లై ఓవర్ పొడవు :
దాదాపు 4 కి.మీ.
వెడల్పు :24 మీటర్లు
లేన్లు : 6 (రెండు వైపులా ప్రయాణం) అంచనా వ్యయం :రూ. 348.07 కోట్లు
ఇందిరాపార్కు – వీఎస్‌టీ జంక్షన్
ఈ ప్రాజెక్టులో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు నాలుగు లేన్ల బ్రిడ్జి (2.6 కి.మీ), రామ్‌నగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు మూడు లేన్ల (900 మీటర్లు) బ్రిడ్జి నిర్మిస్తారు. వీటివల్ల ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, బాగ్‌లింగంపల్లి, వీఎస్‌టీ జంక్షన్లలో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయి. అంచనా వ్యయం :రూ. 426 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment