షేక్‌పేట ఫ్లైఓవర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరు లేన్లతో అత్యంత పొడవైన (2.71 కి.మీ) షేక్‌పేట ఫ్లైఓవర్, ఒవైసీ– మిధాని ఫ్లైఓవర్ (1.3 కి.మీ) వారంలో ప్రారంభం కానున్నాయి. నగరంలో దాదాపు 11.5 కి.మీ. పొడవైన పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే నాలుగు లేన్లది కాగా, ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్లలో షేక్‌పేటది అత్యంత పొడవైనదిగా రికార్డుకెక్కనుంది. నాలుగు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించే ఈ ఫ్లైఓవర్ ఔటర్ రింగ్‌రోడ్డు– ఇన్నర్ రింగ్‌రోడ్డును కలిపే వారధిగానూ మారనుంది. వివరాలిలా ఉన్నాయి.
ట్రాఫిక్ ఇక్కట్లుండవ్.. ఇంధన వ్యయం తగ్గుతుంది..
రెండు ఫ్లై ఓవర్లు వినియోగంలోకి వస్తే ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి ట్రాఫిక్ చిక్కులు తగ్గడంతోపాటు తద్వారా ఇంధన వ్యయం, ప్రయాణ సమయం తగ్గుతాయి. జంక్షన్ల వద్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. ఎస్సార్‌డీపీ కింద ఈ రెండు ఫ్లై ఓవర్లతో సహా ఇప్పటి వరకు రూ. 2వేల కోట్ల విలువైన 22 పనులు పూర్తయినట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం రెండు ఫ్లై ఓవర్లను పరిశీలించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పురోగతిలో ఉన్న రూ.6 కోట్ల విలువైన 25 పనుల్ని వచ్చే సంవత్సరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయిన రెండు ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవం దాదాపు వారం రోజుల్లో జరిగే అవకాశముందన్నారు. (చదవండి: తెలంగాణ: కీలక దశకు చేరుకున్న ఉద్యోగుల విభజన)
షేక్‌పేట ఫ్లైఓవర్..
(గెలాక్సీ థియేటర్ నుంచి మల్కంచెరువు వరకు)
సెవెన్‌టూంబ్స్, ఫిల్మ్‌నగర్ మెయిన్‌రోడ్డు, ఓయూకాలనీ, విస్పర్‌వ్యాలీ టీ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించే ఈ భారీ ఫ్లైఓవర్ వల్ల నానల్‌నగర్ నుంచి ఖాజాగూడ, అక్కడి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు దాదాపు 11 కి.మీ మేర సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. కోర్‌సిటీ నుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల వైపు రాకపోకలు సాగించేవారికి దీని వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇన్నర్ రింగ్‌రోడ్డు (రేతిబౌలి) నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు (గచ్చిబౌలి) వరకు లక్‌డికాపూల్, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి మార్గాల్లో ప్రయాణించే దాదాపు 4 లక్షల వాహనాలకు భారీ ఊరట. బయోడైవర్సిటీ జంక్షన్– జేఎన్‌టీయూ జంక్షన్ మార్గానికి అనుసంధానంగానూ ఉన్న ఈ ఫ్లైఓవర్ వల్ల దాదాపు 17 కి.మీ మేర (లక్డీకాపూల్–జేఎన్‌టీయూ జంక్షన్) సాఫీ ప్రయాణం సాధ్యమని ఈ ప్రాజెక్ట్ పనులు పర్యవేక్షించిన ఎస్‌ఈ వెంకటరమణ పేర్కొన్నారు.
ఒవైసీ– మిధాని జంక్షన్ ఫ్లైఓవర్
ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వస్తే మిధాని జంక్షన్ వైపు నుంచి ఎల్‌బీనగర్ వైపు వెళ్లే వారికి ఎంతో సదుపాయం. మిధాని, ఒవైసీ జంక్షన్ల వద్ద ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయి. ముఖ్యంగా డీఆర్‌డీఓ, డీఆర్‌డీఏ, ఏఎస్‌ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆరాంఘర్ నుంచి ఎల్‌బీనగర్ మార్గంలో ఇబ్బందులుండవన్నారు.
క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ పానెల్స్ వంటి పనులకు ఆర్‌సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వాడినట్లు, దీని వల్ల ఎంతో సమయం కలిసి రావడంతోపాటు మ్యాన్‌పవర్ తగ్గిందని, పని ప్రదేశంలో ప్రమాదాల రిస్క్ తగ్గిందని పనులు పర్యవేక్షించిన ఎస్‌ఈ దత్తుపంత్ తెలిపారు. దేశంలో ఇలాంటి టెక్నాలజీ హైదరాబాద్‌లోనే తొలిసారి వినియోగించగా, పాతబస్తీలో ఇదే ప్రథమమన్నారు. ఈ మార్గంలో రద్దీ సమయంలో ప్రస్తుత ట్రాఫిక్: గంటకు 11,241 పీసీయూ. (చదవండి: ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment