సాక్షి, రంగారెడ్డి జిల్లా: డాక్టర్ ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రియాంక తల్లి, చెల్లి భవ్య పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించిన తీరుపై, కేసు నమోదులో జాప్యం కారణంగా ఎస్సై రవికుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు పి.వేణుగోపాల్‌రెడ్డి, ఎ.సత్యనారాయణ గౌడ్‌లను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితురాలి కుటుంబం చేసిన ఫిర్యాదును ఆధారం చేసుకుని విచారణ జరిపించిన కమిషనర్.. ఈమేరకు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ప్రియాంక అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించి ఉంటే తమ కూతురు ప్రాణాలతోనైనా దక్కేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయిన తర్వాత ఎన్ని బృందాలతో దర్యాప్తు చేసినా ఏ ఫలితం లేదని కన్నీటి పర్యంతం కావడం, మీడియాలో సైతం పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కమిషనర్ వేటు వేశారు.
(చదవండి : ప్రియాంక ఫోన్ నుంచి ఆరిఫ్‌కు కాల్)
Comments
Please login to add a commentAdd a comment