విధి వంచితులు
Published Wed, Mar 1 2017 9:55 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
► ఆరు నెలల క్రితం తండ్రి మృత్యువాత
► కిడ్నీ సంబంధ వ్యాధితో మృత్యుఒడికి చేరిన తల్లి
► అనాథలైన ముగ్గురు పిల్లలు
బొమ్మలరామారం (ఆలేరు) :
పేద కుటుంబంపై విధి మరోమారు కన్నెర్రజేసింది. ఆరు నెలల క్రితమే తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. నాటి నుంచి కూలినాలి చేసి తన పిల్లలను కాపాడుకుంటున్న తల్లి కిడ్నీ సమస్యతో మంగళవారం మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. హృదయ విధారకమైన ఈ సంఘటన మండలంలోని సోలిపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంధాల నాగమల్లయ్య, పోషమ్మ దంపతులది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ఇద్దరు ఆడ పిల్లలు ప్రభావతి మమత, కొడుకు వెంకటేష్‌తో కలిపి ఐదుగురు సభ్యుల కుటుంబం. కూలి పని లభించిన రోజు కడుపునిండా భోజనం చేస్తూ.. పని దొరకని రోజు పస్తులున్నా.. బయటకు పడని నైజం వారిది. పోషమ్మ, నాగమల్లయ్య దంపతులు తమ పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావొద్దని తపన పడేవారు. వారు పస్తులండి మరీ పిల్లలకు ఓ ముద్ద పెట్టి పాఠశాలకు పంపేవారు.
కొడుకును పదో తరగతి వరకు చదివించి కూతుళ్లను మధ్యలో బడి మాన్పించారు. నాగమల్లయ్య ఆర్నెల్ల క్రితం గుండెపొటుతో మృతి చెందాడు. నాటి నుంచి పోషమ్మ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించింది. మూడు నెలల నుంచి కిడ్నీ సమస్యతో పోషమ్మ సైతం అనారోగ్యంతో మంచాన పడింది. చేతిలో చిల్లి గవ్వలేని పిల్లలు తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో ఇరుగుపొరుగు వారి నుంచి రూ.రెండు లక్షల వరకు అప్పు చేసి ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. కానీ విధి వారిని వెక్కిరించింది. కిడ్నీ వ్యాధితో మంగళవారం పోషమ్మ మృతి చెందింది.
కన్న వారిని పోగొట్టుకున్న ఆ పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు అమ్మాయిలు, కుమారుడు అనాథలుగా మారారు. పోషమ్మ అంత్యక్రియలకు సైతం డబ్బు లేకపోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోషమ్మ అంత్యక్రియల ఖర్చులకు రూ.ఐదువేలను చీకటిమామిడి ఎంపీటీసీ మచ్చ శ్రీనివాస్ ద్వారా అందజేశారు. పిల్లలను కలసి వారికి అన్ని రకాలు సహయ సహకారాలు అందిస్తానని తెలిపాడు.
Advertisement
Advertisement