ముహూర్తం ఆలస్యం? | tigala krishna reddy in dilemma | Sakshi
Sakshi News home page

ముహూర్తం ఆలస్యం?

Published Wed, Oct 1 2014 12:27 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

tigala krishna reddy in dilemma

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి చుక్కెదురైంది. దసరా రోజున గులాబీ గూటికి చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్న తీగల.. లాంఛనప్రాయంగా పార్టీ ముఖ్యుల అభిప్రాయం కూడా తెలుసుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.  తన కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. పార్టీ మారాలనే నిర్ణయం సరికాదని తేల్చిచెప్పారు.

 టీఆర్‌ఎస్‌లో చేరాలనే అంశంపై ముఖ్య నేతల నుంచి ప్రతిఘటన ఎదురుకావడం... మీరెళ్లినా పార్టీకెలాంటి నష్టంలేదని మెజార్టీవర్గం తెగేసి చెప్పడంతో డైల మాలో పడ్డ కృష్ణారెడ్డి... కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా అభిప్రాయసేకరణ జరిపిన తీగల... టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని, ఈ విషయంలో తనను వెన్నంటి నిలబడాలని అభ్యర్థించారు.

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అవసరమని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా సమృద్ధిగా నిధులు రాబట్టలేమని, అధికారపార్టీలో చేరితే ఈ సమస్య పరిష్కారమవుతుందని వివరించారు. అయితే, ఎమ్మెల్యే అభిప్రాయంతో ఏకీభవించని తమ్ముళ్లు... గతంలో దేవేందర్‌గౌడ్ పార్టీని వీడినా ఆయన వెంట తాము వెళ్లలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘మీకిష్టమైతే పార్టీ మారండి... మేం మాత్రం ఇదే పార్టీలో కొనసాగుతాం’ అని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న తీగల కృష్ణారెడ్డి ఈ అంశంపై మరోసారి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ప్రస్తుతానికి టీడీపీలో కొనసాగుతానని స్పష్టం చేశారు.

 మారడం ఖాయం..!
 సన్నిహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా తీగల కృష్ణారెడ్డి మాత్రం టీడీపీలో కొనసాగే అవకాశాలు స్వల్పంగానే ఉన్నట్లు మంగళవారం జరిగిన పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది.  పార్టీ మారుతారనే ఊహాగానాలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీగలకు కబురుపంపారు. ఈ మేరకు చంద్రబాబును కలిసిన కృష్ణారెడ్డి పార్టీ మారే అంశంపై వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. అక్కడి నుంచి నేరుగా మీర్‌పేటలోని తన కళాశాలలో పార్టీ సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందే టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయంపై కొందరు నేతలను ఒప్పించారు.

తన అనుకూలవర్గీయులతో వ్యక్తిగతంగా మాట్లాడిన ఆయన... టీఆర్‌ఎస్‌లో చేరితే కలిగే లాభనష్టాలను వివరించారు. ఈ మేరకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారు చేసుకున్నారు. అయినప్పటికీ, కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోకుండా పార్టీ మారారనే ఆరోపణలు రాకుండా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంలో ఊహించనిస్థాయిలో ప్రతికూలత రావడంతో సందిగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ వీడబోనని ‘జై తెలుగుదేశం’ నినాదం చేస్తూ సమావేశాన్ని ముగించిన ఆయన... రాత్రి పొద్దుపోయేవరకు కూడా ముఖ్య నేతలను తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు.

ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ అయి, టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ తాజా పరిణామాలను గమనిస్తే... కారెక్కడం ఖాయంగానే కనిపిస్తున్నా... ముహూర్తం మాత్ర ం ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ చైర్మన్ పదవి కట్టబెడుతామనే ఆఫర్‌తోనే తీగలకు వల వేశారని ప్రచారం జరుగుతుండగా, కేవలం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన కార్యకర్తలకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement