tigala krisna reddy
-
ముహూర్తం ఆలస్యం?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి చుక్కెదురైంది. దసరా రోజున గులాబీ గూటికి చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్న తీగల.. లాంఛనప్రాయంగా పార్టీ ముఖ్యుల అభిప్రాయం కూడా తెలుసుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తన కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. పార్టీ మారాలనే నిర్ణయం సరికాదని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్లో చేరాలనే అంశంపై ముఖ్య నేతల నుంచి ప్రతిఘటన ఎదురుకావడం... మీరెళ్లినా పార్టీకెలాంటి నష్టంలేదని మెజార్టీవర్గం తెగేసి చెప్పడంతో డైల మాలో పడ్డ కృష్ణారెడ్డి... కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా అభిప్రాయసేకరణ జరిపిన తీగల... టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని, ఈ విషయంలో తనను వెన్నంటి నిలబడాలని అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అవసరమని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా సమృద్ధిగా నిధులు రాబట్టలేమని, అధికారపార్టీలో చేరితే ఈ సమస్య పరిష్కారమవుతుందని వివరించారు. అయితే, ఎమ్మెల్యే అభిప్రాయంతో ఏకీభవించని తమ్ముళ్లు... గతంలో దేవేందర్‌గౌడ్ పార్టీని వీడినా ఆయన వెంట తాము వెళ్లలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘మీకిష్టమైతే పార్టీ మారండి... మేం మాత్రం ఇదే పార్టీలో కొనసాగుతాం’ అని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న తీగల కృష్ణారెడ్డి ఈ అంశంపై మరోసారి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ప్రస్తుతానికి టీడీపీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. మారడం ఖాయం..! సన్నిహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా తీగల కృష్ణారెడ్డి మాత్రం టీడీపీలో కొనసాగే అవకాశాలు స్వల్పంగానే ఉన్నట్లు మంగళవారం జరిగిన పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. పార్టీ మారుతారనే ఊహాగానాలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీగలకు కబురుపంపారు. ఈ మేరకు చంద్రబాబును కలిసిన కృష్ణారెడ్డి పార్టీ మారే అంశంపై వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. అక్కడి నుంచి నేరుగా మీర్‌పేటలోని తన కళాశాలలో పార్టీ సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందే టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయంపై కొందరు నేతలను ఒప్పించారు. తన అనుకూలవర్గీయులతో వ్యక్తిగతంగా మాట్లాడిన ఆయన... టీఆర్ఎస్లో చేరితే కలిగే లాభనష్టాలను వివరించారు. ఈ మేరకు ముహూర్తం కూడా దాదాపుగా ఖరారు చేసుకున్నారు. అయినప్పటికీ, కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోకుండా పార్టీ మారారనే ఆరోపణలు రాకుండా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంలో ఊహించనిస్థాయిలో ప్రతికూలత రావడంతో సందిగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ వీడబోనని ‘జై తెలుగుదేశం’ నినాదం చేస్తూ సమావేశాన్ని ముగించిన ఆయన... రాత్రి పొద్దుపోయేవరకు కూడా ముఖ్య నేతలను తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ అయి, టీఆర్ఎస్లో చేరే అంశంపై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ తాజా పరిణామాలను గమనిస్తే... కారెక్కడం ఖాయంగానే కనిపిస్తున్నా... ముహూర్తం మాత్ర ం ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. హెచ్ఎండీఏ చైర్మన్ పదవి కట్టబెడుతామనే ఆఫర్‌తోనే తీగలకు వల వేశారని ప్రచారం జరుగుతుండగా, కేవలం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన కార్యకర్తలకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. -
మహేశ్వరంలో విజయం నాదే
మహేశ్వరం,న్యూస్ లైన్: మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు ఎవరు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తన చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని నగర మాజీ మేయర్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి తీగల కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో టీడీపీ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శివగంగ ఆలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీడీపీ ప్రభంజనాన్ని అపడం ఎవరి తరం కాదని అన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో సబితాఇంద్రారెడ్డిపై ఓటమి చెందానని, ఈ సారి పోటీలో ఎవరు దిగినా 25 వేల మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని, ఈ సీటును బీజేపీకి ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు. మహేశ్వరం సీటు పొత్తులో భాంగంగా బీజేపీకి ఇస్తారని వస్తున్న వదంతులు నమ్మెద్దని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, జైపాల్‌రెడ్డిలు ఈసారి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ నెల 9న భారీ ర్యాలీగా వచ్చి అధికారికంగా నామినేషన్ వేస్తామని తెలిపారు. తీగల వెంట టీడీపీ సీనియర్ నాయకులు కూన యాదయ్య, లక్ష్మి నర్సింహ్మరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడ్మ మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి అంగోత్ కృష్ణా నాయక్, కందుకూరు, సరూర్‌నగర్ మండలాల పార్టీ అధ్యక్షుడు పొట్టి ఆనంద్, అమర్నాధ్రెడ్డి, పార్టీ నాయకులు బి.వెంకట్‌రెడ్డి, అంజయ్యగౌడ్, ఎర్ర సత్తయ్య, జంగయ్య, పబ్బ బాల్‌రాజ్, మహేశ్వరం, కందుకూరు, సరూర్‌నగర్, సరూర్‌నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.