మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు ఎవరు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తన చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని నగర మాజీ మేయర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తీగల కృష్ణారెడ్డి అన్నారు.
మహేశ్వరం,న్యూస్ లైన్: మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు ఎవరు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తన చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని నగర మాజీ మేయర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తీగల కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో టీడీపీ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శివగంగ ఆలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీడీపీ ప్రభంజనాన్ని అపడం ఎవరి తరం కాదని అన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో సబితాఇంద్రారెడ్డిపై ఓటమి చెందానని, ఈ సారి పోటీలో ఎవరు దిగినా 25 వేల మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మహేశ్వరం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని, ఈ సీటును బీజేపీకి ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు. మహేశ్వరం సీటు పొత్తులో భాంగంగా బీజేపీకి ఇస్తారని వస్తున్న వదంతులు నమ్మెద్దని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, జైపాల్‌రెడ్డిలు ఈసారి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ నెల 9న భారీ ర్యాలీగా వచ్చి అధికారికంగా నామినేషన్ వేస్తామని తెలిపారు. తీగల వెంట టీడీపీ సీనియర్ నాయకులు కూన యాదయ్య, లక్ష్మి నర్సింహ్మరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడ్మ మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి అంగోత్ కృష్ణా నాయక్, కందుకూరు, సరూర్‌నగర్ మండలాల పార్టీ అధ్యక్షుడు పొట్టి ఆనంద్, అమర్‌నాధ్‌రెడ్డి, పార్టీ నాయకులు బి.వెంకట్‌రెడ్డి, అంజయ్యగౌడ్, ఎర్ర సత్తయ్య, జంగయ్య, పబ్బ బాల్‌రాజ్, మహేశ్వరం, కందుకూరు, సరూర్‌నగర్, సరూర్‌నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.