సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచింగ్, నాన్–టీచింగ్ సిబ్బంది బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. వాస్తవానికి అధ్యాపక సంఘాల నేతలు గత కొంతకాలంగా బదిలీల కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
పాఠశాల విద్యలో బదిలీలు చేపట్టడం, ఈ వ్యవహారం కోర్టు స్టేతో ఆగిపోవడం తెలిసిందే. తాజాగా స్పౌజ్ కేసులను పరిశీలించిన కోర్టు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, కాలేజీ సిబ్బందినీ బదిలీ చేయాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది.
విద్యామంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇటీవల ఇంటర్, కాలేజీ విద్య ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో అధికారులు బదిలీల ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.
బదిలీల్లేక ఐదేళ్లు: 2018 జూన్ నెలాఖరులో సాధారణ బదిలీలు చేపట్టారు. అప్పటి మార్గదర్శకాలను అనుసరించి 500 మంది ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. 2016–17లో జూనియర్ లెక్చరర్స్‌కు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతులు కల్పించారు. ఈ విధంగా పదోన్నతులు రావడంతో 2018లో జరిగిన బదిలీల్లో కనీసం రెండేళ్లు పనిచేసిన సర్వీస్ లేకపోవడంతో వారికి బదిలీ అవకాశం రాలేదు.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 317 జీవో అమలు చేశారు. పదవీ విరమణ వయసును ప్రభుత్వం 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. దీంతో చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటూ, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని కాలేజీ అధ్యాపక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. తాజా నిర్ణయం వల్ల 6 వేల మందికిపైగా న్యాయం జరుగుతుంది.
మార్గదర్శకాలపై కసరత్తు: బదిలీలు చేపట్టాలనే యోచన చేసిన నేపథ్యంలో మార్గదర్శకాలపై కూడా స్పష్టత ఉండాలని విద్యాశాఖ కార్యదర్శి అధికారులకు సూచించినట్టు సమాచారం. 317 జీవో తర్వాత ఏర్పడిన పరిస్థితులు, ఎన్ని సంవత్సరాలను కనీస, గరిష్ట అర్హతగా తీసుకోవాలనే అంశాలపై అధికారులు తర్జనభర్జనలో ఉన్నారు. స్పౌజ్ కేసులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి జాబితాను, ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలున్నాయి? అనే అంశాలపై వివరాలు తెప్పిస్తున్నారు. వచ్చేవారం బదిలీలపై స్పష్టత రావొచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment