విద్యాభివృద్ధికి కృషి
మహేశ్వరం: విద్యాభివృద్దికి తమ వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఎంపీ నిధులు రూ.2.50 లక్షల నిధులతో మినరల్ వాటర్ ఫిల్టర్లను ఆయన స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ఎంపీ నిధులను వెచ్చించి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. నేడు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా మధ్యాహ్న భోజనం, రోజూ గుడ్డు, ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్, పుస్తకాలు, నోట్ బుక్స్ అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వాటి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శారద ఒకేషనల్ కాలేజీలో స్పోకేన్ ఇంగ్లీష్ క్లాసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నేనావత్ ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్ననవీన్, సర్పంచ్ ఆనందం, ఉప సర్పంచ్ రాములు, పలువురు నాయకులు పాల్గొన్నారు.