Konda Vishweshwar Reddy
-
ఏఐసీసీలో ఖర్గే ఓ బొమ్మ మాత్రమే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శీతాకాల సమావేశంలో వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుందని అన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదని తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో వక్ఫ్ మతం కిందకు రాదని చెబుతున్నాయని,. వక్ఫ్ అనేది ఇతర దేశాల్లో ప్రభుత్వం కిందనే ఉందని తెలిపారు. ఎవరడ్డుకున్నా వక్ఫ్ బోర్డు సవరణ జరుగుతుందని చెప్పారు.ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కీలకమని.. ఎవరైనా సర్వోన్నత న్యాయస్థాన తీర్పును గౌరవించాల్సిందేనని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. దీనికి సుప్రీంకోర్టుకు మించి అధికారలిచ్చారని విమర్శించారు. ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొన్నారు.‘300 వందల ఏళ్ల క్రితం కింద ఔరంగా జేబు నోటి మాటతో భూములిచ్చి ఉండొచ్చు, కానీ నేడు కుప్పలువుకుప్పలుగా డాక్యుమెంట్స్‌తో భూములు మావని అంటున్నారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం, నవ్వాలో, ఏడ్వాలో, బాధపడాలో తెలియని పరిస్థితి. దేవాలయం అనేది మతానికి సంధించింది. వక్ఫ్ ఆనేది సమాజానికి సంబంధించినది.ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ దేశాన్నైనా అమ్ముకుంటాయి. ఏఐసీసీలో ఖర్గే ఒక బొమ్మ మాత్రమే. నాడు మన్మోహన్ సింగ్‌ను ఎలా వాడుకున్నారో నేడు ఖర్గే కూడా అలాగే వాడుకుంటున్నారు.రాహుల్ తాత నెహ్రూ హాయంలో పాలేకర్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1980 మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు, ఎలాంటి చర్యలు లేవు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ విధానాలు నచ్చక అంబేద్కర్ కేబినెట్ వదిలేసి వెళ్లిపోయారు.రాజ్యాంగాన్ని బొంద పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది’ అని మండిపడ్డారు. -
పనికిరాని ప్రాజెక్టుకు మరమ్మతులెందుకు?
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం త ప్పుదారిలో పడింది. ఈ ని ర్ణయం వల్ల కాంగ్రెస్‌కే నష్టం జరుగుతుంది. పనికిరాని ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం సరికాదు’అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా చూస్తే ఎన్నికల వరకే కొట్లాటలు ఉంటాయని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పరిధిలోని జంట జలాశయాల పరిరక్షణకు సంబంధించి గత ప్ర భుత్వం జీఓ 111 రద్దు చేసినా, దాని కంటే కూడా నిరర్థకమైన జీఓ 69ను కొత్తగా తీసుకొచ్చిందని విమర్శించారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధి కూడా జరగాలంటే ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్ ఏరియా’గా ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలలో విషం నింపిందని మండిపడ్డారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని, దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ వేవ్‌తోనే తాను చేవెళ్లలో పెద్ద మెజారిటీతో గెలుపొందానని చెప్పారు. కేంద్ర కేబినెట్లో మీకు పదవి ల భించనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు విశ్వేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ ‘కేంద్రమంత్రి అయితే నాకు రాజకీయంగా నష్టం. దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన బాధ్యతల కారణంగా చేవెళ్ల ప్రజలకు దూరం అవుతా. కానీ నాకున్న పరిజ్ఞానం దేశం మేలు కోసం ఉపయోగించాలని ఉంది’ అని అన్నారు. -
కాంగ్రెస్‌కు అభ్యర్థులే దొరకడం లేదు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చాలాచోట్ల అభ్యర్థులే దొరకడంలేదని, అందుకే ఇతర పార్టీల్లో టికెట్ రాని నేతల కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ముఖ్యమంత్రిని కూడా బయటనుంచి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయనకు టికెట్ రాకపోవడం బాధాకరమన్నారు. డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ఇద్దరూ పెద్ద లీడర్లేనని, జితేందర్‌రెడ్డి పార్టీ మారతారని తాను భావించడం లేదని చెప్పారు. చేవెళ్ల సీటు మోదీదేనని రాసి పెట్టు కోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలోని 12, 13 సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనవసరంలేదని చెప్పారు. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి వస్తానన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననే తమ పార్టీపై దుష్ప్రచారం సాగుతోందని, మద్యం కుంభకోణం కేసులో చర్యలు తీసుకోకపోవడం వల్ల అలా అనుకుని ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కాంగ్రెస్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. -
పొలిటికల్ వార్!
వికారాబాద్: చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్‌రెడ్డి మధ్య నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఇన్నాళ్ల పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే వరకూ వెళ్లింది. ఇది కాస్తా కార్యకర్తల మధ్య చిచ్చు రాజేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఈ నేతల మధ్య వివాదం మరింత ముదిరేలా ఉందనే చర్చ సాగుతోంది. అసలేం జరిగిందంటే.. ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇద్దరూ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీలుగా గెలిచిన వారే. 2014 ఎన్నికల్లో కొండా టీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరఫున కొండా, టీఆర్ఎస్ నుంచి రంజిత్‌రెడ్డి పోటీ చేయగా రంజిత్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. నాటి నుంచి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలూ పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఎవరి గ్రూపులను వారు బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ప్రత్యర్థి పార్టీ నాయకులపైనా గురిపెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. రంజిత్‌రెడ్డి అనుచరులైన కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి నేరుగా విశ్వేశ్వర్‌రెడ్డికే ఫోన్ చేసి ‘నా అనుచరులతో నువ్వెలా మాట్లాడతావు’ అని నిలదీసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రంజిత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అసంతృప్త నేతలు పలువురు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారిలో కొందరి స్పందన తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. తాను బీఆర్ఎస్లో చేరబోతున్నట్టు కొన్ని రోజులు ప్రచారం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్నట్టుగా చెబుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు డా.జి.వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారబోవడం లేదని చెప్పారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలిశానని, మంగళవారం నిజామాబాద్ సభ అప్పుడు మాత్రం.. తమ అంబేడ్కర్ కాలేజీ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యఅతిథి ఖరారు కోసం ఢిల్లీలో ఉన్నానని తెలిపారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా చెప్పారు. బీజేపీ నేతలను చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నామంటూ ప్రచారం చేసుకోవడం ద్వారా తమ బలహీనతలను కాంగ్రెస్ నేతలు బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. మరికొంతమంది ఈ జాబితాలో మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో సహా దాదాపు 20 మంది నాయకులున్నారని చెబుతున్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి లాంటి కొందరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, బీజేపీ కుంభస్థలాన్ని కొట్టామనే భావన కలిగించే స్థాయి నేతలను సైతం పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయశాంతి, ఏనుగు రవీందర్‌రెడ్డిలను ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా వారు స్పందించలేదు. తర్జనభర్జన! కాంగ్రెస్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లాలా? లేక బీజేపీలోనే ఉండాలా? అన్నదానిపై అసంతృప్త నేతలు తర్జనభర్జన పడుతుండటమే వారి స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది. -
‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పాటు బీఆర్ఎస్, ఇతర పారీ్టలకు కూడా ఏకపక్షంగా గెలిచే బలం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కొందరు బీజేపీ చాలా బలంగా ఉందని అనుకుంటారని, అయితే ఇంకా చేయాల్సింది చేస్తేనే ఎన్నికల్లో గెలిచే బలం వస్తుందనేది తమ అభిప్రాయమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీలోనే తాను ఉంటానని, మరే ఇతర పారీ్టలోనూ చేరబోనని స్పష్టం చేశారు. బుధవారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు, మూడు రోజులుగా మీడియాలో తాను ఇతర పారీ్టల్లో చేరుతున్నట్టు, నాయకులతో భేటీలు నిర్వహిస్తున్నట్టు కథనాలు రావడంతో పార్టీ నేతలు వివరణ నివ్వాలని సూచించారని చెప్పారు. తాను ఎలాంటి రహస్య సమావేశాలు నిర్వహించలేదని, ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ఏం చేయాలనే దానిపైనే చర్చించామని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోకుంటే నష్టమే కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఉపయోగించుకుని బీజేపీ ఈ బలా న్ని పెంచుకోవాలనేదే తమ ప్రయత్నమని చెప్పారు. దీనిని సరిగా ఉపయోగించుకోలేకపోతే ఓడిపోయే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై తమకున్న కొన్ని అనుమానాలపై స్పష్టతనివ్వాల ని అధిష్టానాన్ని కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రపార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్‌తో ఆయా అంశాలపై మాట్లాడామని, త్వరలోనే కేంద్రహోం మంత్రి అమిత్‌షాను కూడా కలుస్తామని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. కాగా, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబం డబ్బుతో కాంగ్రెస్ పార్టీని సులభంగా కొనుగోలు చేసే అవకాశం ఉందంటూ విశ్వేశ్వర్‌రెడ్డి ట్వీట్ చేశారు. -
‘బీజేపీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.. పార్టీని వీడను’
సాక్షి, హైదరాబాద్: తాను బీజేపీని వీడి ఎక్కడికి వెళ్లడం లేదని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి స్పష్టత ఇచ్చారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీని మించిన సెక్యులర్ పార్టీ మరొకటి లేదన్నారు. బీజేపీపై ప్రజలకు నమ్మకం ఉందని, అదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని పేర్కొన్నారాయన. ‘‘కొంతమంది మా మీద ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు లేదని నిరూపించుకునేందుకు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని అంటున్నారు. కానీ, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. అది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాల పని. వాటి పని అవి చేసుకుపోతాయి. కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని మాత్రమే పార్టీ కోరగలదు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్పార్టీ అదే.. బీజేపీలో కన్ఫ్యూజన్ నెలకొందని కొందరు అంటున్నారు. కానీ, అలాంటిదేం లేదు. దేశంలో బీజేపీ అంత సెక్యులర్ పార్టీ మరొకటి లేదు. అందుకే కామన్ సివిల్ కోడ్ తేవాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అయితే కొందరు మాత్రం పనిగట్టుకుని మతానికో కోడ్ ఉండాలని కోరుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓ నాయకుడు భారత్ జోడో యాత్ర చేసి.. కశ్మీర్ కు వేరే కోడ్ ఉండాలని అంటాడు. ఇది అసలైన కన్ఫూజన్. పార్టీల్లో మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పార్టీ కాంగ్రెస్. రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలు లేకుండా వ్యవహరించే కాంగ్రెస్సే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ అని అంటారు. అలాగే బీఆర్ఎస్లో ఉన్నోళ్లంతా.. ఒకప్పటి తెలంగాణవ్యతిరేకులేనని, ఆంధ్రను అడ్డగోలుగా విమర్శించారని గుర్తుచేశారాయన. వీటిల్లో ఏ పార్టీ కూడా సవ్యంగా లేదని.. అవి రియల్ కన్ఫ్యూజ్డ్ పార్టీలనీ అన్నారు. రేవంత్‌కు ఆహ్వానం.. రేవంత్‌రెడ్డి లక్ష్యం మా లక్ష్యం ఒక్కటే. కానీ, కేసీఆర్‌ను కొట్టగల ఆయుధాలు మా దగ్గరే ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చాలనేది మా ప్రధాన డిమాండ్ కాదు. ఢిల్లీ పర్యటనలో వేరే వేరే ఇష్యూలను అమిత్ షాకు వివరించాం. నా మనసులో మాటల్ని ఒక టీవీ ఛానల్ ఇంటర్వూలో చెప్పాను. కానీ, కొన్ని మీడియా ఛానెల్స్ వాళ్లు నేను చెప్పింది మరోలా రాశారు. నేను పార్టీ మారడం లేదు. బీజేపీ నేతలను కొనడం అంత ఈజీ కాదు.. అందుకే ప్రజలకు బీజేపీ పై నమ్మకం ఉంటుంది. పార్టీ కోసం ప్రచారం చేసుకోకపోవడమే మా మైనస్ అని కొండా విశ్వేశ్వరరెడ్డి తన పేరిట ప్రచారం అవుతున్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. -
ప్రధాని మోదీతో కొండా విశ్వేశ్వర్ దంపతుల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దంపతులు ప్రధాని నరేంద్రమోదీతో శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న తమ రెండో కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి ప్రధానిని కలిశామని కొండా దంపతులు వెల్లడించారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రధానితో చర్చించినట్లు విశ్వేశ్వర్‌రెడ్డి భార్య సంగీతరెడ్డి ట్వీట్లో తెలిపారు. తెలంగాణలో విద్య, వైద్యం, ఇతర విషయాల గురించి చర్చించామని విశ్వేశ్వర్‌రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. తమ స్వచ్ఛ్ ట్రక్, బయోగ్యాస్ ప్రాజెక్టుల గురించి మోదీకి వివరించామన్నారు. -
మ్యాచ్ టికెట్ల విక్రయంలో అవకతవకలు జరిగాయి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
-
టార్గెట్ కాంగ్రెస్! చేవెళ్లతో మొదలై మునుగోడు మీదుగా.. నెక్ట్స్?
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తోంది. చేవెళ్లతో మొదలు పెట్టిన చేరికల గేమ్.. ఇప్పుడు మునుగోడు మీదుగా ఎక్కడివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా దక్షిణాదిలో బలంగా కనిపిస్తోన్న కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి, తన విజయావకాశాలు మెరుగు పరుచుకునేలా బీజేపీ అడుగులు వేస్తోందని సీనియర్ నేతలు అంటున్నారు. మరోపక్క ఈ వలస వ్యవహారం జోరందుకుంటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ నేతలు లేరని, ఇది పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్ సునీల్ కనుగోలు అధిష్టానానికి నివేదించినట్టు తెలుస్తోంది. కొండాతో షురూ.. టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచి 2019లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా వేసుకున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌లో ఇటీవల జరిగిన సభలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి ఇన్చార్జిగా పెట్టేందుకు ఆ స్థాయి ఉన్న నేత ఎవరూ లేకపోవడం ఆందోళనకరమని అధిష్టానానికి నివేదిక వెళ్లినట్టు తెలిసింది. 2019లో కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీగా పోటీచేసిన విశ్వేశ్వర్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. రాజగోపాల్‌రెడ్డికి రెడ్‌కార్పెట్! ఇక మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పేరుతో తిరుగుతున్నారు. కోమటిరెడ్డి కుటుంబం ఎప్పట్నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన పార్టీని వీడితే రెండు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. గతంలో భువనగిరి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన రాజగోపాల్‌రెడ్డి తన పరిచయాలతో నల్లగొండతో పాటు ఖమ్మంలోనూ ప్రభావం చూపిస్తారని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఆయనతో మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండల్లో పాదయాత్ర చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇది తొలుత కాంగ్రెస్ పార్టీపైనే ప్రభావం చూపిస్తుందని సీనియర్ నేతలు అంటున్నారు. రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొంతమంది నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినా సునీల్ కనుగోలు వద్దని వారించినట్టు తెలిసింది. మహబూబ్‌నగర్, ఖమ్మంపైనా దృష్టి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్న కొంతమంది నేతల పైనా బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఈటల రాజేందర్ చర్చిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి కృష్ణారావు కాంగ్రెస్‌లోకి వెళ్లాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేరికతో పాటు, ఈటల రాజేందర్‌కు బీజేపీలో లభిస్తున్న ప్రాధాన్యత, రాజగోపాల్‌రెడ్డి అదే పార్టీలో చేరబోతున్నారనే వార్తలతో ఆయన సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. ఇక ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితోనూ గతంలో ఈటల ఒకసారి సమావేశమైనట్టు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతానికి ఆయన కుమార్తె వివాహ వేడుకలో బిజీగా ఉన్నారని తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నూతన జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత సైతం బీజేపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. ప్రత్యామ్నాయం లేకపోతే ప్రమాదం కాంగ్రెస్‌లో సీనియర్/ప్రముఖ నేతలున్న చోట ప్రత్యామ్నాయ నేతలు లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీకి గడ్డు పరిస్థితిని తెచ్చిపెట్టేలా ఉంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారి ఉప ఎన్నికలు వస్తే దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ నేతలు లేరనే దానిపై సునీల్ కనుగోలు టీం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. అక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో బలమైన నేతలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించినట్టు తెలిసింది. ఇలా నల్లగొండలోని నకిరేకల్, ఆలేరు, దేవరకొండ, మిర్యాలగూడ స్థానాల్లో నేతల కొరత కనిపిస్తున్నట్టు తెలిసింది. ఇక మహబూబ్‌నగర్‌లోని మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు జడ్చర్ల, గద్వాల, మక్తల్, దేవరకద్ర, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేకుండానే నెట్టుకొస్తున్నట్టు సునీల్ టీం నివేదించినట్టు తెలిసింది. ఈ పరిస్థితి పార్టీకి ప్రమాదకరమని, బలమైన నేతలను పార్టీలోకి తీసుకురావడంతో పాటు ఉన్న నేతలపై ఫోకస్ చేసి పార్టీ కిందిస్థాయి దాకా వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సునీల్ సూచించినట్టు తెలిసింది. -
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, హైదరాబాద్: చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కొండా విశ్వేశ్వరరెడ్డి చేయి పట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేయించారు. కాగా, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వరరెడ్డి.. టీఆర్ఎస్ తరపున 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు యూఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో.. అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్‌గా నిలిచారు కూడా. 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2018లో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కిందటి ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చదవండి: (హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలి: ప్రధాని మోదీ) -
బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. జులై 1వ తేదీన ఆయన, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరతారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడు.. మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వరరెడ్డి.. టీఆర్ఎస్ తరపున 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు US పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో.. అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్‌గా నిలిచారు కూడా. 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. 2018లో టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కిందటి ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతా రెడ్డి.. కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య. -
ఇంకా డోలాయమానంలోనే.. కొండా ఏదీ జెండా!.. విశ్వేశ్వర్ దారేటు?
సాక్షి, వికారాబాద్ : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నా ఏ పార్టీలో చేరుతారనే విషయం దాటవేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ విధానాలను గట్టిగా వ్యతిరేకిçస్తూ వస్తున్న ఆయన కాంగ్రెస్, బీజేపీల విషయంలో సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ఇటీవల బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఏ పార్టీలో చేరతాననే విషయం చెబుతానని ఇటీవల ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంతో ఆయన ప్రాబల్యం, అనుచరగణం ఎక్కువగా ఉన్న జిల్లాలో మరోసారి చర్చకు దారి తీసింది.. 2021 మార్చిలో అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మూడునెలల పాటు నిరీక్షిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత అనేకసార్లు ఆయన మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఎలాంటి పొలిటికల్ స్పష్టత ఇవ్వకుండానే ముగించడం ఆయన క్యాడర్‌ను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ వస్తోంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనే పార్టీతోనే.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేయగానే ఆయన బీజేపీలో చేరుతారనే చర్చ జరిగింది. అనంతరం పలు మార్లు ఆయన టీఆర్ఎస్ను బీజేపీ గట్టిగా ఎదుర్కోనుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో కొందరు నాయకులు అమ్ముడు బోయిండ్రు అంటూ విమర్శిస్తూనే.. కేసీఆర్‌తో గట్టిగా ఫైట్ చేసే పీసీసీ నాయకుడొస్తే కాంగ్రెస్‌లో చేరాలా? లేక తటస్తులు పార్టీ పెడితే వారితో కలవాలా అంటూ గతంలో అస్పష్ట ప్రకటనలు చేశారు. దీంతో కొండా దారెటు అనే విషయం ఆయన క్యాడర్‌తో పాటు జిల్లా రాజకీయాల్లో నానుతోంది. కొండా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ ఎలాంటి రాజకీయ దుమారం చేస్తారా? అని రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతుండగా ఆయన మాత్రం చర్చకు ఇంకా తెరదించటంలేదు. కొండా ఇచ్చే స్పష్టత కోసం ఆయన అనుచరగణంతో పాటు రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బీజేపీలో చేరుతారంటూ ప్రచారం ఇటీవల కొండా.. బీజేపీలో చేరుతారనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ విషయంలో అధికారపార్టీతో పోరాడుతానని చెప్పారే తప్ప ఆయన స్పష్టత నివ్వలేదు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రగులుతున్న రాజకీయ వేడితో ప్రజలు, కేడర్ కంటే ఆయా పార్టీల నేతల్లోనే కొండా పయనంపై ఉత్కంఠ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. ఒకవేళ బీజేపీలో చేరితే ఎవరికి పోటీగా మారతారని చర్చసాగుతోంది. పరిగి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే తమ పరిస్థితి ఏమిటని అక్కడి నేతలు భావిస్తుండగా చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తే మరోసారి కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వనున్నారనే ఊహాగానాలు ఇటీవల ఊపందుకున్నాయి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జెండా, ఎజెండాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డోలాయమాన వ్యూహాన్ని వీడటంలేదు. ఏడాది కాలంగా తటస్తంగా ఉంటూ వస్తున్న ఆయన ఏ పార్టీలోచేరుతారనే విషయంలో స్పష్టతనివ్వడంలేదు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. కొండా దారెటో అనే విషయం జిల్లాలో చర్చ సాగుతోంది. ప్రజలు, కేడర్ మరిచిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మీడియాలో తళుక్కుమంటూ మళ్లీ తెరచాటుకు వెళ్తుండటం గమనార్హం. -
జీవో111 పరిధిలో సీఎం సంబంధీకుల భూములు
సాక్షి, హైదరాబాద్: జీవో111 పరిధిలోని భూములను సీఎం సంబంధీకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు కొనుగోలు చేయడం వల్లే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను ఎత్తేసిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే దాదాపు 25 వేల ఎకరాలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. 2014 తర్వాత ఈ పరిధిలో భూములు కొనుగోలు చేసిన ప్రాంతాలను గ్రీన్జోన్లుగా ప్రకటించాలని, అంతకుముందు నుంచి భూములున్న వారిని గ్రీన్‌జోన్ పరిధిలోకి తీసుకురావొద్దని అన్నారు. ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ జోన్’గా మార్చాలని డిమాండ్ చేశారు. జీవో 111ను ఎత్తేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణ యం నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ సాగులో ఉన్న కూరగాయలు, వరి ఇతర పంటలకు వాడుతున్న పురుగు, కలుపు నివారణ మందులతోనే కాలుష్యం వ్యాపిస్తోందన్నారు. అందుకే అతి తక్కువ కాలుష్యాన్ని వ్యాప్తి చేసే పరిశ్రమలు పెట్టాలని తాను సూచించినట్లు గుర్తు చేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల్లో కాలుష్యాలు చేరకుండా ఇచ్చిన జీవో 111కు, పర్యావరణ పరిరక్షణకు పెద్దగా సంబంధం లేదని, 11కి.మీనుంచి అనేక కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. 1974లో అప్పటి కేంద్రం తెచ్చిన ‘సెంట్రల్ వాటర్‌యాక్ట్’ను వికారాబాద్ దాకా అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఏం జరిగినా హుజురాబాద్‌లో గెలిచేది ఆయనే: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి: తాను ఏ పార్టీలో చేరాలా అనే అంశంపై కన్ఫ్యూజన్లో ఉన్నట్లు కేటీఆర్ బినామీ మీడియాలో తనపై దుష్ట్రచారం చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తనకంటూ ఓ స్పష్టత ఉందన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లో సీనియర్ నాయకులు సురేష్‌రెడ్డి, కొండా రాందేవ్‌రెడ్డి, రౌతు కనకయ్య, బీమేందర్‌రెడ్డి, కొండా కృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అనేక సమీకరణాలు జరుగనున్నాయని, అధికారం కోసం జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ ఏదో ఒక జాతీయ పారీ్టతో జతకట్టే అవకాశం ఉందని.. ఇది తేలిన తర్వాతే చేరికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేసే పారీ్టలోనే చేరనున్నట్లు ప్రకటించారు. అది బీజేపీనా.. కాంగ్రెసా అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు. చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ అందుకే ఆ పార్టీని వీడాను.. ఉద్యమ పార్టీగా చెప్పుకొంటున్న టీఆర్ఎస్లో ప్రస్తుతం తెలంగాణ వాదులెవరూ లేరని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకరిద్దరు ఉన్నా వారికి ఎలాంటి అధికారం లేదని అధికారమంతా తండ్రీ కొడుకులకే పరిమితమైందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ చేతుల్లో బందీగా మారిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగానే ఆ పార్టీని వీడాల్సి వచి్చందన్నారు. నా మద్దతు ఈటలకే వందల కోట్లు ఖర్చు చేసినా.. భారీగా పోలీసులను మోహరించినా హుజురాబాద్‌లో గెలిచేది మాత్రం ఈటల రాజేందరేనని జోస్యం చెప్పారు. బీజేపీలో చేరకపోయినా తన సంపూర్ణ మద్దతు ఆయనకేనని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు తనకు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ.. తాను మాత్రం ఆయనకు అనుకూలంగా పని చేయనున్నట్లు వెల్లడించారు. చదవండి: ఎన్నిక వచ్చినప్పుడల్లా సవాలేనా?: ఎమ్మెల్సీ కవిత రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం కేసీఆర్ సీఎం అయ్యాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశారన్నారు. రూ.15,000 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి.. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టారని ఆరోపించారు. జిల్లాకు సాగునీరిస్తానని చెప్పి, ఎడారిగా మార్చేశారన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని గాలికొదిలేసి జిల్లాలో కొత్తగా మరో మూడు ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
హుజూరాబాద్‌లో ఈటలను గెలిపించండి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా తెలంగాణకు ఆ నియోజకవర్గ ప్రజలు దిక్సూచిలా నిలవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. ఈమేరకు శనివారం ఆయన నియోజకవర్గ ఓటర్లకు బహిరంగ లేఖరాశారు. స్వయంపాలనలో తెలంగాణ పేద ప్రజలు అభివృద్ధి చెందుతారని తాను, రాజేందర్ నమ్మి కలిసి పనిచేశామని, కానీ సీఎం కేసీఆర్ అందర్నీ మోసం చేస్తున్నట్లు గ్రహించామని లేఖలో తెలిపారు. -
బెదిరిస్తే.. భయపడేదే లేదు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమ గురించి మాట్లాడితే రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెడతామని మంత్రి కేటీఆర్ బెదిరిస్తున్నారని.. అయినా భయపడేదే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుల గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, ఎలాంటి చర్చ జరుగుతోందో ముందు ఆయన తెలుసుకోవాలని సూచించారు. చట్టాలు కేటీఆర్‌కు చుట్టాలు కావని, కేసులు పెడితే ఏం చేయాలో తమకూ తెలుసునని చెప్పారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌కు వైట్ చాలెంజ్ విసిరారు. ‘డ్రగ్స్ వినియోగంపై నేను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదు. యువతకు ఆదర్శంగా ఉండేందుకే ఈ చాలెంజ్ విసురుతున్నా. ఏ విషయంలోనైనా యువతకు రోల్‌మోడల్‌గా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. అందుకే గ్రీన్ చాలెంజ్ తరహాలోనే వైట్ చాలెంజ్ కూడా స్వీకరిద్దాం. కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఈ చాలెంజ్ విసురుతున్నా. ఇద్దరూ స్వీకరించండి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్దకు వస్తా. మీరూ రండి. అందరం వెళ్లి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు రక్త నమూనాలు, వెంట్రుకలు ఇద్దాం’ అని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌తో తనకేం సంబంధం లేదని మంత్రి అంటున్నారని, అలాంటప్పుడు ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ఇది తన ఆరోపణ కాదని.. ఈడీనే కోర్టుకు అఫిడవిట్ రూపంలో చెప్పిందన్నారు. ఎక్సైజ్ శాఖ విచారణను అడ్డుకున్నది ఎవరని రేవంత్ ప్రశ్నించారు. చదవండి: ఫాల్తూ మాటలు మాట్లాడితే ‘దేశద్రోహమే’ గోతికాడ నక్క బీజేపీ... తెలంగాణ ఈ దేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ గోతికాడ నక్కలా ఎదురుచూస్తోందని రేవంత్ పేర్కొన్నారు. తప్పుడు చరిత్రను మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలకు రాంజీ గోండు, కాశీంరిజ్వీ గురించి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. వారిద్దరికీ కనీసం 100 సంవత్సరాల తేడా ఉందని చెప్పారు. అమిత్‌షా పర్యటన సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రకటనల్లో గోండు బిడ్డ సోయం బాపూరావు ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై విచారణ జరపాలని, అమిత్‌షా అపాయింట్మెంట్ ఇప్పించాలని తాము కోరినా బీజేపీ టైం ఇప్పించలేదని చెప్పారు. కనీసం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సంజయ్, అరవింద్ ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలన్నారు. కేసీఆర్, నరేంద్రమోదీ.. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలపై కొట్లాడేది కాంగ్రెస్ మాత్రమేనని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బడాయి మాటలు మానుకోవాలని, వాళ్ల రిమోట్ కేసీఆర్ చేతిలో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాతో తమకు కొత్త బలం వచ్చిందని, కేసీఆర్ ఇక శాశ్వతంగా ఫాంహౌస్‌కు పరిమితం అవుతారని అనిపిస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Amit Shah: 2023లో మాదే అధికారం -
బీజేపీలో చేరికపై తొందరొద్దు..! ఊగిసలాటలో ఈటల...
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ రోజుకో మలుపు తిరుగుతోంది. దీనితో ఆయన తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెల కొంది. బీజేపీలో చేరడం దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో గురు వారం జరిగిన రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈటలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమంటూ గురువారం బీజేపీ శిబిరం స్పష్టమైన సంకే తాలు ఇచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు విశాల రాజ కీయ వేదిక నిర్మాణం కోసం కలసి పనిచేద్దా మంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే బీజేపీలో చేరడంపై మాజీ మంత్రి ఈటల ఇప్పటికే తన సన్నిహితులకు చూచాయగా వెల్లడించారు. రాజకీయంగా తనను అణగదొక్కడంతో పాటు భూకబ్జా కేసుల్లో కుటుంబసభ్యులను కూడా వేధింపులకు గురి చేస్తుండటంతో బీజేపీలో చేరేందుకే ఈటల మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఆయన ఆ పార్టీ జాతీయ నాయకులతోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆయన చేరికకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని సమాచారం. బీజేపీలో చేరికపై తొందరొద్దు! ఈటల బీజేపీలో చేరతారంటూ రెండు రోజులుగా వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో కోదండరాం, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం షామీర్పేటలోని ఈటల నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేసీఆర్ రాజకీయ వేధింపులతో ఇబ్బంది పడుతున్న ఈటలకు నైతిక మద్దతునిచ్చేందుకే వచ్చినట్లు కోదండరాం, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. అయితే ఈటలతో జరిగిన అంతర్గత భేటీలో మాత్రం బీజేపీలో చేరిక, విశాల రాజకీయ వేదిక వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. బీజేపీలో చేరికపై తొందర పాటు నిర్ణయం వద్దని వివరించినట్లు తెలిసింది. బీజేపీలో చేరితే ఈటల రాజకీయ భవిష్యత్తుకు జరిగే నష్టం, ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించడంలో ఈటల పాత్ర, కలసి వచ్చే వారితో సమన్వయం చేసుకోవాల్సిన తీరుపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. బీజేపీ పచ్చజెండా? కొద్ది రోజులుగా ఈటల రాజేందర్‌తో వరుస మంతనాలు జరుపుతున్న బీజేపీ కీలక నేతలు ఆయన చేరికకు సంబంధించి పార్టీలో అంతర్గతంగా అభిప్రాయ సేకరణ జరిపినట్లు సమాచారం. ఈటల చేరికపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని రాష్ట్ర ముఖ్య నేతలు అధిష్టానానికి సంకేతాలు పంపారు. ఇదిలా ఉంటే గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిగిన వర్చువల్ భేటీలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తావించారు. ఈటల కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులతో నిరంతరం ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈటల చేరిక ముహూర్తం ఒకట్రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉండగా, ఢిల్లీలోనే ఈటల చేరిక కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అవినీతి ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటలను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీపై ధిక్కార స్వరం వినిపించారు. అంతర్గత అభిప్రాయ సేకరణ చేసిన పార్టీ తనను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఊగిసలాటలో ఈటల తమ పార్టీలో ఈటల చేరడం ఖరారైందని బీజేపీ శిబిరం నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నా ఈటల మాత్రం చేరికకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయట్లేదు. భూ వివాదాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తుండటంతో బీజేపీలో చేరాలనే ఒత్తిడి కూడా ఈటలపై పెరుగుతున్నట్లు సమాచారం. బీజేపీలో చేరితో తనకు ఎవరు దూరం అవుతారానే కోణంలో ఈటల విశ్లేషించుకుంటున్నారు. బీజేపీలో చేరికపై బహిరంగ ప్రకటన చేయడానికి ముందు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో మరోమారు భేటీ కావాలనే యోచనలోనూ ఈటల ఉన్నారు. రాష్ట్ర అవతరణ దినం జూన్ 2లోగా ఈటల భవిష్యత్ రాజకీయ ప్రస్తానంపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆక్సిజన్ కొరత.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుడ్‌న్యూస్
సాక్షి, హైదరబాద్: కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృస్టిస్తోంది. లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత కారణంగానే ఎక్కువమంది మృత్యువాతపడుతున్నారు. అయితే కరోనా సోకిన వీరిలో చాలా వరకు ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతోనే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆక్సిజన్ నిరంతర సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి. కోవిడ్ కష్ట కాలంలో ఆక్సిజన్ కొరత నెలకొన్న తరుణంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ శుభవార్త అందించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియో విడుదల చేశారు. చైనీస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సరిగా చేయడం లేదన్నారు. అదే తను చెప్పబోయే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ గాలి నుంచి వాయువులను పీల్చుకొని ఫిల్టర్ ద్వారా నైట్రోజన్, 98శాతం కచ్చితమైన ఆక్సిజన్‌ను వేరు చేసి నైట్రోజన్‌ను బయటకు పంపి ఆక్సిజన్‌ను పైపు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఇటీవల సిలీండర్లు దొరకడం లేదని, ఒకవేళ దొరికినా తొందరగా అయిపోతుందన్నారు. జపాన్‌లో రూపొందించిన ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కరెంట్‌తో నడుస్తుందని పేర్కొన్నారు. దీనిని కరెంట్ పెడితే 30 రోజులు ఏకధాటిగా వాడుకోవచ్చని తెలిపారు. ఇప్పుడే రీఫిల్లింగ్ అవసరం లేదని, ఏడాది.. రెండేళ్ల తరువాత మార్చుకోవచ్చన్నారు. వీటిలో ఒకటి యజ్ఞ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన కజిన్ అనిత మరో రెండు విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక వికారాబాద్, చేవెళ్లలో 15, 20 బెడ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: టీఆర్ఎస్ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ Chinese oxygen concentrators don't work well. The specs say the oxygen flow is 5 liters/min at 97% purity, but they barely deliver barely 3 liters of oxygen at 80% purity. So my cousin Anitha and I are donating 3 German made Oxygen Concentrators to Yagyna Foundation in Vikarabad. pic.twitter.com/egPLZXGkiO — Konda Vishweshwar Reddy (@KVishReddy) May 8, 2021 -
టీఆర్ఎస్ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ
సాక్షి, తాండూరు టౌన్: టీఆర్ఎస్ వ్యతిరేకులతో కలిసి రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతానని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేకులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తాండూరుకు వచ్చిన కొండా పలువురు స్థానిక నేతలను కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా దోచుకుంటోందని ఆరోపించారు. తాను టీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచినప్పటికీ పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. అయితే కాంగ్రెస్ పోరాడే తత్వాన్ని మరిచిపోయిందని, అందుకే ఆ పార్టీని వీడానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యానని, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. వీరందరూ కలిసొస్తే కొత్త పార్టీకి రెడీ అని, తానొక్కడిని మాత్రం పార్టీ పెట్టేది లేదని వెల్లడించారు. టీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఏకం కాని పక్షంలో బీజేపీలో చేరుతానని తెలిపారు. ఇప్పటికే తాను కోదండరాం, తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్, మహబూబ్‌ఖాన్, దాసోజు శ్రావణ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులను కలిశానని, త్వరలోనే రేవంత్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ఒకప్పటి కాంగ్రెస్ నేతలు సబితారెడ్డి, సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి వలె అమ్ముడుపోయే నేతలను కలుపుకొనిపోయే పరిస్థితి ఉండదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో అనేకమంది కోవర్టులు ఉన్నారని కొండా ఆరోపించారు. ఆయనతో పాటు టీజేఎస్ తాండూరు నేత సోమశేఖర్, కాంగ్రెస్ నేత రఘునందన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
కొండా బర్త్‌డే: కాంగ్రెస్‌లో ‘కేకు’ రగడ..
తాండూరు టౌన్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నేతల మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కొండా జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేయాలని నాయకులు ముందుగా భావించారు. అయితే కార్యకర్తలు, నేతలు అందరూ రాకముందే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్‌మహరాజ్ కేక్ కట్ చేశారు. దీంతో ఆగ్రహించిన పార్టీ నేత ఖయ్యూం రమేష్‌మహరాజ్‌తో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలందరి సమక్షంలో వేడుకలు నిర్వహిస్తే బాగుండేదని, కొందరి సమక్షంలో తూతూ మంత్రంగా జరపడం సరికాదన్నారు. తాను అత్యవసర పనిమీద వెళ్లాల్సి ఉందని, ఉందని, మరో పెద్ద కేకు తీసుకొస్తారని, దానిని కట్ చేసి వేడుకలు నిర్వహించుకోవాలని రమేష్ మహరాజ్ చెప్పడంతో వాగ్వాదం మరింత ముదిరింది. ఎవరికి వారే నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రమేష్ మహరాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మరో కేక్ తీసుకొచ్చి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు అలీం, బస్వరాజ్, మల్లికార్జున్, ప్రభాకర్‌గౌడ్, వరాల శ్రీనివాస్‌రెడ్డి, లింగదల్లి రవి, షుకూర్ పాల్గొన్నారు. చదవండి: ముగ్గురు మంత్రులు.. 3 జిల్లాలు అందమైన యువతుల ఫొటోలతో ఎర, గొంతులు మార్చి.. -
‘మంత్రి స్పందించడం ఆనందంగా ఉంది’
హైదరాబాద్ : కరోనా వైరస్‌తో పోరాడుతున్న జర్నలిస్టు సిద్ధిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ మారిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. కరోనాతో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ తన ఆరోగ్య పరిస్థితిపై ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తన ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదని.. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని కన్నీరు పెట్టారు. దయచేసి తనను అపోలో ఆస్పత్రిలో చేర్పించాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. చికిత్సకు తానే డబ్బులు భరిస్తానని చెప్పారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అతని సమస్యపై హరీశ్‌రావు స్పందించడం ఆనందంగా ఉందన్నారు. ‘ఈ వీడియోను నాకు ఒక జర్నలిస్టు మిత్రుడు పంపించాడు. కానీ అప్పటికే మంత్రి హరీశ్‌రావు అతన్ని యశోద ఆస్పత్రిలో చేర్పించారని తెలిసింది. ఈ వీడియో అతనికి సాయం అందేలా చేసింది. మంత్రి స్పందించడం నాకు ఆనందం కలిగించింది. శ్రీనివాస్ త్వరలో కోలుకోవాలి’ అని విశ్వేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. శాపాల నుంచి ఎవరు కాపాడలేరు.. మరోవైపు, సచివాలయం కూల్చివేతకు సంబంధించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా బాధితుడి శరీరాన్ని కుక్కలు తింటున్నాయని.. ఇంతకంటే సిగ్గుపడే అంశం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఇదేనా మీ బంగారు తెలంగాణ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. చనిపోతున్న ప్రజల శాపాల నుంచి వాస్తు, యాగాలు, జ్యోతిష్యులు వారిని కాపాడలేరని వ్యాఖ్యానించారు. A journalist friend sent me this video. But got to know Minister Harish Rao got him admitted in Yashodha Hospital. The video helped get attention and glad the minister could respond. I wish the Siddhireddy Srinivas speedy recovery. pic.twitter.com/NaiPdd0BZx — Konda Vishweshwar Reddy (@KVishReddy) July 8, 2020 -
ఓడినా నైతిక విజయం నాదే: కొండా
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల నుంచి ఎంపీగా ఓడినా నైతిక విజయం తనదేనని కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో చివరి వరకు గెలుపు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినప్పటికీ, పట్టణ ఓటర్లను ప్రత్యర్థులు కొనుగోలు చేయడంతో తాను ఓడిపోయానని వివరించారు. శక్రవారం ఆయన గాంధీభవన్‌లో ఎమ్మెల్యే పైల ట్ రోహిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీసులు, అధికారులను తన స్వలాభం కోసం వాడుకుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి నానా ఇబ్బందుల కు గురిచేసిందని ఆరోపించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నేతలని లక్ష్యంగా చేసుకున్నారని, సమావేశాలకు అనుమతులివ్వకుండా అడ్డుకున్నారన్నారు. రాజకీయంగా తనను పూర్తిగా అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకుందని, నేతలు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. -
కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: పోలీసులను నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారంటూ నమోదైన కేసులో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, రూ. 25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్వేశ్వర్‌రెడ్డిని విచారించాలనుకుంటే, ఆయనకు నోటీసు జారీచేసి విచారణకు హాజరు కావాలని కోరవచ్చునని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వేశ్వర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషనర్‌పై ఈ కేసు నమోదైందని తెలిపారు. పోలీసులే మొదట పిటిషనర్ పట్ల దురుసుగా ప్రవర్తించారని, దీనిపై ఆయన ఫిర్యా దు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. ఆ తరువాత గచ్చిబౌలి సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై మాత్రం స్పందించి, పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనిలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. పిటిషనర్ తీవ్రమైన నేరానికి పాల్పడ్డారన్నారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన పోలీసులనే నిర్భంధించి హిం సించారని తెలిపారు. ఈ కేసులో తాము అరెస్ట్ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేవలం ఆందోళనతోనే పిటిషనర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, విశ్వేశ్వర్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. -
కొండా విశ్వేశ్వరరెడ్డికి స్వల్ప ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట కలిగింది. పోలీసులను నిర్బధించిన కేసులో ముందస్తు బెయిల్ కోసం విశ్వేశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా రూ. 25వేలతో కూడిన రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 41ఏ సీఆర్పీసీ ప్రకారం నోటీసులు అందుకున్న తరువాత పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి సన్నిహితుడు సందీప్ రెడ్డి వద్ద పది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు బంజారాహిల్స్‌లోని విశ్వేశ్వరరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కొండా అనుచరులు ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్భందించారు. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పలు సెక్షన్ల కింద విశ్వేశ్వరరెడ్డిపై కేసు నమోదైంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విశ్వేశ్వరరెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే నాంపల్లి కోర్టు ఆ పిటిషన్‌ను తిరిస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకే పోలీసులు తనపై కావాలనే తప్పుడు కేసు నమోదు చేశారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.