సాక్షి, హైదరాబాద్: తమ గురించి మాట్లాడితే రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెడతామని మంత్రి కేటీఆర్ బెదిరిస్తున్నారని.. అయినా భయపడేదే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుల గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, ఎలాంటి చర్చ జరుగుతోందో ముందు ఆయన తెలుసుకోవాలని సూచించారు. చట్టాలు కేటీఆర్‌కు చుట్టాలు కావని, కేసులు పెడితే ఏం చేయాలో తమకూ తెలుసునని చెప్పారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌కు వైట్ చాలెంజ్ విసిరారు. ‘డ్రగ్స్ వినియోగంపై నేను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదు. యువతకు ఆదర్శంగా ఉండేందుకే ఈ చాలెంజ్ విసురుతున్నా.
ఏ విషయంలోనైనా యువతకు రోల్‌మోడల్‌గా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. అందుకే గ్రీన్ చాలెంజ్ తరహాలోనే వైట్ చాలెంజ్ కూడా స్వీకరిద్దాం. కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఈ చాలెంజ్ విసురుతున్నా. ఇద్దరూ స్వీకరించండి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్దకు వస్తా. మీరూ రండి. అందరం వెళ్లి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు రక్త నమూనాలు, వెంట్రుకలు ఇద్దాం’ అని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌తో తనకేం సంబంధం లేదని మంత్రి అంటున్నారని, అలాంటప్పుడు ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ఇది తన ఆరోపణ కాదని.. ఈడీనే కోర్టుకు అఫిడవిట్ రూపంలో చెప్పిందన్నారు. ఎక్సైజ్ శాఖ విచారణను అడ్డుకున్నది ఎవరని రేవంత్ ప్రశ్నించారు. చదవండి: ఫాల్తూ మాటలు మాట్లాడితే ‘దేశద్రోహమే’
గోతికాడ నక్క బీజేపీ...
తెలంగాణ ఈ దేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ గోతికాడ నక్కలా ఎదురుచూస్తోందని రేవంత్ పేర్కొన్నారు. తప్పుడు చరిత్రను మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలకు రాంజీ గోండు, కాశీంరిజ్వీ గురించి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. వారిద్దరికీ కనీసం 100 సంవత్సరాల తేడా ఉందని చెప్పారు. అమిత్‌షా పర్యటన సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రకటనల్లో గోండు బిడ్డ సోయం బాపూరావు ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై విచారణ జరపాలని, అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పించాలని తాము కోరినా బీజేపీ టైం ఇప్పించలేదని చెప్పారు. కనీసం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సంజయ్, అరవింద్ ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలన్నారు.
కేసీఆర్, నరేంద్రమోదీ.. టీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలపై కొట్లాడేది కాంగ్రెస్ మాత్రమేనని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బడాయి మాటలు మానుకోవాలని, వాళ్ల రిమోట్ కేసీఆర్ చేతిలో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాతో తమకు కొత్త బలం వచ్చిందని, కేసీఆర్ ఇక శాశ్వతంగా ఫాంహౌస్‌కు పరిమితం అవుతారని అనిపిస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Amit Shah: 2023లో మాదే అధికారం
Comments
Please login to add a commentAdd a comment