సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా టీఆర్‌ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ నివాసంలో ఆయనతో సమావేశమైన కొండా.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియాతో కలిసి కొండా రాహుల్ వద్దకు వెళ్లారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల టికెట్ ఇస్తానని తనకు హామీ ఇవ్వాలని, రాజకీయంగా తన వర్గానికి అవకాశాలు ఇవ్వాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాహుల్‌ను కోరుతున్నట్టు తెలుస్తోంది.
రాహుల్‌తో భేటీ అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ తెలంగాణ సిద్ధాంతాలకు దూరమైందని, దానిని జీర్ణించుకోలేకనే పార్టీని వీడానని ఆయన తెలిపారు. మంత్రి మహేందర్ రెడ్డితో వ్యక్తిగత విభేదాల వల్లే పార్టీని వీడాలనే ప్రచారంలో నిజంలేదన్నారు. వ్యక్తిగత కారణాలు మొదటినుంచి ఉన్నాయని, కానీ, అందుకు మహేందర్‌రెడ్డితో విభేదాలు కారణం కాదన్నారు. ఈ నెల 23వ తేదీన సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన వెల్లడించారు. ‘చేవెళ్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు. నా నియోజకవర్గ సమస్యలు కాంగ్రెస్ పార్టీతో పరిష్కారమవుతాయని భావిస్తున్నా.రాహుల్ గాంధీతో సమావేశం మంచిగా జరిగింది. నియోజకవర్గ అంశాలు, రాష్ట్రంలోని అంశాలపై ఆయనతో మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది’ అని తెలిపారు. కుంతియా మాట్లాడుతూ.. ఈ నెల 23న సోనియా, రాహుల్ సమక్షంలో విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని, ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారని తెలిపారు.
టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈనెల 23న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో మేడ్చల్‌లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. చాలా రోజులుగా కొండా టీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే కొండా సరైన సమయం కోసం వేచిచూశారని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
తాను పార్టీని వీడేందుకు దారితీసిన కారణాలను తెలియజేస్తూ మూడు పేజీల లేఖ రాసిన కొండా.. రాజకీయాల్లోకి రావడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేనప్పటికీ అప్పటి అవసరానికి అనుగుణంగా తాను టీఆర్‌ఎస్‌లో చేరానని, క్రమంగా పార్టీలోని పరిస్థితులు తనను ఇబ్బందు లకు గురిచేశాయని, మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలు తనను మనస్తాపానికి గురిచేశాయని తెలిపారు.
తెలంగాణ వ్యతిరేకులను కేబినెట్‌లో చేర్చుకుని వారికే అన్ని అధికారాలు ఇచ్చారని, పార్టీలో తాను బలహీనుడిని అయిపోయానని, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సమ్మతి కాదని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, సంప్రదాయ రాజకీయ నాయకుడిలా కార్యాచరణ–సిద్ధాంతాలను, భావాలు–సెంటిమెంట్‌ను వేరుచేసి తాను పనిచేయలేనని, అందుకే తీవ్ర బాధాకరం అయినప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. క్రమంగా టీఆర్‌ఎస్ ప్రజలకు దూరమవుతోందని, ప్రభుత్వపరంగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతోందని కూడా ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment