టీఆర్‌ఎస్‌... తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌ పరివార్‌ | Rahul Gandhi Comments on KCR Politics | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌... తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌ పరివార్‌

Published Thu, Nov 29 2018 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Rahul Gandhi Comments on KCR Politics - Sakshi

బుధవారం కోస్గిలో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభకు హాజరైన ప్రజలు

(కోస్గి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని... తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌ పరివార్‌ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. అవసరమైనప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ సహకారం అందించిన టీఆర్‌ఎస్, బీజేపీకి బీ(బీజేపీ)టీంలా వ్యవహరించిందన్న విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం లక్ష్యం మళ్లీ మోదీని ప్రధానిని చేయడమేనని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌ను, 2019లో మోదీని ఓడించి తీరుతామన్నారు. బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు రాహుల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల స్వపాన్ని నెరవేర్చేందుకు సోనియా రాష్ట్రం ఇస్తే... కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేశారని, ఈ విషయం ఇక్కడి ప్రజలకు అర్థమయిందని అన్నారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల లోటు బడ్జెట్‌ రాష్ట్రంగా మార్చారని, కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైనింగ్‌ చేసి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇక్కడ ప్రభుత్వం మారడం ఖాయమని, తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నెరవేరుస్తామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల స్వప్నాన్ని నెరవేరుస్తామని అన్నారు. ఓ కుటుంబం చేతిలో ఉన్న అధికారాన్ని తెలంగాణ ప్రజలకు కట్టబెడతామని చెప్పారు. 

కోస్గిలో రాహుల్‌ ప్రసంగం ఇది... 
‘ఐదేళ్ల ముందు తెలంగాణ ప్రజలు ఓ కల కన్నారు. నయా తెలంగాణ ఏర్పడుతుందని, నీళ్లు, నిధులు, నియామకాలు దక్కితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశించారు. సీఎంగా కేసీఆర్‌ మీ కలలను నెరవేరుస్తారని ఆశించారు. కానీ, ఆ స్వప్నాలను నెరవేర్చకుండా ఆయన మోసం చేశారు. ఆశించిన స్వప్నం నెరవేరలేదని ప్రజలకు అర్థమయిపోయింది. కాంగ్రెస్‌ హవా చూస్తుంటే కేసీఆర్‌ గద్దె దింపడం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉండేది. ఇప్పుడు రూ.2 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌ అయింది. ప్రతి కుటుంబంపై రూ.2 లక్షల అప్పు చేశారు. ప్రజలపై అప్పు మోపారు కానీ, కేసీఆర్‌ కుమారుడి ఆదాయం 400 శాతం పెంచుకున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్‌ హయాంలో రూ.50 వేల కోట్లతో ప్రారంభించాం. కానీ, కేసీఆర్‌ ఆ ప్రాజెక్టుకు కాళేశ్వరంగా పేరు మార్చి రీడిజైనింగ్‌ చేశారు. అంచనా వ్యయం రూ.90 వేల కోట్లు చేశారు.

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పేరుతో పాత చెరువులు పునరుద్ధరించి డబ్బులు దండుకున్నారు. నాలుగున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో మీరు చెప్పగలరా? కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురికి మాత్రం ఉద్యోగాలిచ్చారు. ఆ నలుగురి కోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాశనం చేశారు. మహిళలు సహా రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని కేసీఆర్‌ ఆశ పెట్టాడు. మా సర్కార్‌ వచ్చిన తరువాత పేదలకు ఇళ్లు కట్టిస్తాం. దళితులు, గిరిజనులకు భూములిస్తాం. మా ముఖ్యమంత్రి తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే పని చేస్తారు. రాష్ట్ర ఆదాయాన్ని కేసీఆర్‌ తన కుటుంబం, బంధువులు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టాడు. ప్రజల ఆరోగ్యానికి నిధులివ్వలేదు. పేదలు ఎంఆర్‌ఐలు, ఎక్స్‌రేల కోసం ఆసుపత్రులకు వెళ్లి, ఆపరేషన్లు చేయించుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కాంట్రాక్టర్లకు దోచి పెట్టిన సొమ్మంతా ప్రజలకు చెందేలా చేస్తాం.  

అవసరమైనప్పుడల్లా సంపూర్ణ సహకారం.. 
ప్రధాని మోదీకి అవసరమైనప్పుడల్లా కేసీఆర్‌ సంపూర్ణ సహకారం అందించారు. దేశాన్ని విభజించే పనిలో మోదీ ఉన్నాడు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నాడు. రైతుల పక్షాన భూసేకరణ చట్టం కోసం మేం పార్లమెంట్‌లో పోరాడుతుంటే కేసీఆర్‌ పార్టీకి చెందిన ఎంపీలు మోదీకి పూర్తి మద్దతుగా నిలిచారు. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు... తెలంగాణ రాష్ట్రీయ పరివార్‌ సంఘ్‌. వీళ్లిద్దరూ ఒక్కటే జోడీ, బీజేపీ–బీ టీం అని మర్చిపోవద్దు. ప్రతి విషయంలో మీరు బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారని నేను పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలను అడిగా. పైనుంచి ఆదేశాలు వచ్చాయని, కేసీఆర్‌ చెప్పినందుకే తాము అలా చేస్తున్నామని వాళ్లు నాతో చెప్పారు. మోదీ రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఒకటే తరహా పార్టీలని అన్నారు. గతంలో ఎందుకు మోదీ ఈ మాట అనలేదు. రాఫెల్‌ విషయంలో కేసీఆర్‌ ఎప్పుడైనా మోదీకి వ్యతిరేకంగా నోరు విప్పాడా? మోదీకి వ్యతిరేకంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు.  

మీ కలలు నెరవేరుస్తాం... 
ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. మీరు కన్న కలలు, అందుకు చేసిన పోరాటాలు నిజం అవుతాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మీ స్వప్నాన్ని కాంగ్రెస్‌ నెరవేరుస్తుంది. మీ కలలన్నీ నెరవేర్చే బాధ్యత మేం తీసుకుంటాం. ముందు ఇక్కడ కేసీఆర్‌ని ఓడిద్దాం. 2019లో మోదీని ఢిల్లీలో ఓడిద్దాం. ఇంత ఎండలో కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.’అని రాహుల్‌ తన ప్రసంగాన్ని ముగించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఒబేదు ల్లా కొత్వాల్‌ అధ్యక్షతన జరిగిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్‌.సి.కుంతియా, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా కూటమి అభ్యర్థులు, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జనసమితి నేతలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement