మోదీ, కేసీఆర్‌.. దొందూ దొందే | Rahul Gandhi Public Meeting At Bhainsa | Sakshi
Sakshi News home page

నాలుగున్నరేళ్లుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు

Published Sun, Oct 21 2018 1:09 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Rahul Gandhi Public Meeting At Bhainsa - Sakshi

సాక్షి ప్రతినిధులు, ఆదిలాబాద్‌/ నిజామాబాద్‌: ‘ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భ వించిన తర్వాత తెలంగాణ.. దేశానికి ఒక రోల్‌మోడల్‌గా నిలుస్తుందని అనుకున్నాం. కొత్త తరహా పాలన ఉంటుం దని ప్రజలు కలగన్నారు. కానీ కేసీఆర్‌ పాలన దేశంలోనే అత్యంత అవినీతి మయమని తేలింది. రాష్ట్రంలో కుటుంబ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు’ అని ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. తాము అధికారంలోకొస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అందిస్తామని, రాష్ట్రంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో పాలిస్తామన్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రచారం కోసం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌ శనివారం నిర్మల్‌ జిల్లా భైంసా, కామారెడ్డిల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.

ఈయన ప్రసంగమంతా.. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీని లక్ష్యంగానే సాగింది. వీరిద్దరూ మొదట్నుంచీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని రాహుల్‌ ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆయన విమర్శించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన బడుగు, బలహీన వర్గాలు, దళిత, గిరిజనుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలు భావించారు. కేసీఆర్‌ పాలనలో తమ కలలు నెరవేరుతాయని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజల కలలు కల్లలయ్యాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తారు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీయే.. తెలంగాణ కలలను సాకారం చేస్తుంది. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన వారి కలలను సాకారం చేసే బాధ్యత మాది’అని రాహుల్‌ పేర్కొన్నారు. 
 
అంబేద్కర్‌ను అవమానించారు 
భైంసా సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ.. ‘దేశమంతా అంబేద్కర్‌ను కీర్తిస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం ఆ మహనీయుడిని అవమానించారు. కాంగ్రెస్‌ అంబేద్కర్‌ పేరుతో ప్రారంభించిన చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం నిర్మిస్తున్నారు. రూ.38వేల కోట్లతో పూర్తయే ప్రాజెక్టు విలువను రూ.లక్ష కోట్లకు పెంచారు. రాజీవ్‌ సాగర్, ఇందిరా సాగర్‌ ప్రాజెక్టుల అంచనావ్యయాన్నీ పెంచేశారు. కుటుంబానికి, అనుచరులకు మేలు చేసేలా భారీ అవినీతికి పాల్పడ్డారు’అని కేసీఆర్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పేదలు, రైతులు, గిరిజనుల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదివాసీ బిల్లు, భూసేకరణ బిల్లులను మోదీ, కేసీఆర్‌ నీరుగార్చారన్నారు. రాఫెల్‌ విమానాల కొనుగోలులో అనిల్‌ అంబానీకి రూ. 30వేల కోట్లు బహుమతిగా ఇప్పించారని మోదీపై ఆరోపణలు చేశారు. జల్, జంగిల్, జమీన్‌ కోసం పోరాడే ఆదివాసీలకు కాంగ్రెస్‌ తెచ్చిన చట్టాన్ని మోదీ సూచనతోనే కేసీఆర్‌ అమలు చేయలేదని ఆరోపించారు. భూసేకరణ బిల్లును అమలు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించిన మోదీ.. తెలంగాణలో దాన్ని నిలిపివేయాలని కేసీఆర్‌కు సూచించారని ఆరోపణలు చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. 
 
రాఫెల్‌తో భారీ చోరీ 
‘మోదీ దేశానికి కాపలాదారు కాదు. అనిల్‌ అంబానీ, విజయ్‌మాల్యా, లలిత్‌ మోదీవంటి 15 మందికి మాత్రమే కాపలాదారు. రాఫెల్‌ ఓ పెద్ద కుంభకోణం. మోదీ రాఫెల్‌ ద్వారా చోరీకి పాల్పడ్డారు. నిరుపేదల సొమ్ము దోచి అనిల్‌ అంబానీకి పెట్టారు. రూ.30వేల కోట్లు అంబానీకి బహుమతిగా ఇచ్చారు’అని రాహుల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 56 అంగుళాల చాతీ అని చెప్పుకునే మోదీ.. ఈ విషయంపై పార్లమెంట్‌లో నిలదీస్తే కళ్లలోకి చూడకుండా దిక్కులు చూశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల మధ్య, వర్గాలమధ్య చిచ్చు పెడతూ ఒకరిని మరొకరిపై ఉసిగొల్పుతున్నారని, మనందరం ఏకమై ఇలాంటివారిని ఓడించాలా వద్దా? అని ప్రజలను ప్రశ్నించారు. నోట్లరద్దు, జీఎస్టీతో ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయన్నారు. 
 
పసుపు బోర్డు ఏమైంది?  
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని కామారెడ్డి సభలో రాహుల్‌ ఆరోపించారు. పసుపుబోర్డు ఏర్పాటు, 100 రోజుల్లో నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీలు ఏమయ్యాయన్నారు. రూ.300 కోట్లు వెచ్చించి ప్రగతిభవన్‌ను కట్టుకున్న కేసీఆర్‌ నిజాం షుగర్స్‌కు నయాపైసా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్య, వైద్య సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో రైతుల పాత్ర కీలకమన్న రాహుల్‌.. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 4వేల మంది రైతులను కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. రైతులకు బేడీలు వేయడం, మిర్చి రైతులపై కేసులు పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇంటికో ఉద్యోగం, ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఇంటింటికీ తాగునీరు వంటి వాటిల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చని కేసీఆర్‌ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల పాల్జేశారని రాహుల్‌ విమర్శించారు. దీనికారణంగా ఒక్కో కుటుంబంపై రూ.2.60 లక్షలు, ఒక్కో వ్యక్తిపై రూ.60 వేల అప్పు మిగిలిందని వివరించారు. కర్ణాటక తరహాలో.. తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు, పత్తికి క్వింటాలుకు రూ.7వేల మద్దతు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి వంటి హామీలను రాహుల్‌ ప్రస్తావించారు. గల్ఫ్‌ బాధితులను ఆదుకునేందుకు రూ.500 కోట్లు ఇస్తామన్న హామీతో.. గద్దెనెక్కిన కేసీఆర్‌ నాలుగున్నరేళ్లలో ఒక్క పైసా కూడా విదల్చలేదన్నారు. 
 
అవినీతిలో ఇద్దరూ ఇద్దరే! 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌లు ఒకే తరహాలో దోపిడీకి పాల్పడుతున్నారని రాహుల్‌ ఆరోపించారు. ఒక్కొక్కటిగా రీడిజైన్‌తో ప్రాజెక్టుల అంచనాలు పెంచి కేసీఆర్‌.. రాఫెల్‌ యుద్ధ విమానం అంచనాలను పెంచి మోదీ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య స్నేహం కొనసాగుతోందన్న రాహుల్‌.. కేసీఆర్‌ మోదీతో స్నేహభావంతో మెలుగుతున్నారన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్న కేసీఆర్‌.. విఫలమైన పెద్దనోట్ల రద్దు పథకానికి మద్దతిచ్చారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లోనూ వివిధ సందర్భాల్లో మోదీకి కేసీఆర్‌ అండగా నిలిచారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ మాదిరిగానే ఎంఐఎం కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్‌ ఆరోపించారు. 
 
ఓటమి ఖాయం 
తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోదీ ఓడిపోతారని రాహుల్‌ జోస్యం చెప్పారు. ఇక్కడ, అక్కడ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఐదేళ్లు వృధా అయ్యాయన్నారు. కేసీఆర్‌ వస్తే తమకు న్యాయం జరుగుతుందని భావించిన ఆదివాసీలు, 12% రిజర్వేషన్లు వస్తాయనుకున్న మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రజల కలలు సాకారం కావాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. తాము వస్తే అరాచకాలు, అవినీతి, ఆత్మహత్యలు లేని తెలంగాణ చూపిస్తామని హామీ ఇచ్చారు. మోదీ, కేసీఆర్‌ లాగా.. తాను అబద్దాలు చెప్పనని, అబద్ధాలు వినాలనుకుంటే వారి సభలకే వెళ్లాలని ప్రజలకు సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదివాసీల భూములు వెనక్కి ఇస్తామని, భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. 
 
రైతు ఆత్మహత్యలపై స్పందించని సీఎం: ఉత్తమ్‌ 
తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వీరి కుటుంబాల్లో ఏ ఒక్కరినీ కేసీఆర్‌ పరామర్శించలేదని.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. రాహుల్‌ ఢిల్లీ నుంచి వచ్చి 15 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి రైతులకు సంఘీభావం తెలిపారని, వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్‌ (పాత)జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. డిసెంబర్‌ 12న రాష్ట్రంలో ఏర్పడబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. భైంసా, కామారెడ్డి సభల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా, సీనియర్‌ నేత కె. జానారెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, ఎ.రేవంత్‌రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి ఎస్‌.జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీగౌడ్, సలీం అహ్మద్, చిన్నారెడ్డి, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, రాష్ట్ర ముఖ్య నేతలు షబ్బీర్‌ అలీ, నంది ఎల్లయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, సర్వే సత్యనారాయణ, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సురేశ్‌ షెట్కార్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, కె.ప్రేంసాగర్‌ రావు, రమేష్‌ రాథోడ్, రాంచంద్రారెడ్డి, బోడ జనార్ధన్, ఎం.అరవింద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ఆర్‌ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement