మర్పల్లి, న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కె.చంద్రశేఖర్‌రావు స్థాపించిన టీఆర్‌ఎస్ దశాబ్దానికి పైగా సాగించిన ఉద్యమం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం మర్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాలులో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వికారాబాద్ శాసనసభ స్థానం నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న బి.సంజీవరావు, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిలతో కలిసి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ఉద్యమం తీవ్రమవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాల అభివృద్ధికి కేసీఆర్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని, అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకు రావాలని కోరారు.
వికారాబాద్ అసెంబ్లీ పార్టీ అభ్యర్థి సంజీవరావు మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో పార్లమెంటుకు, శాసనసభకు పోటీచేస్తున్న తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు.
సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కనకయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి, నాయకులు అబ్రహం, చంద్రయ్య, పలు గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు పలువురు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.
పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
Published Sat, Apr 12 2014 11:32 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement