ఆశల పల్లకి
తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ కొత్త రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ జూన్ 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడం ఎంతోదూరం లేదు. ఇక, ఆ తర్వాత తమకు ఎలాంటి అవకాశాలు అందివస్తాయి..? పద్నాలుగేళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కుతుందా..? షరా మామూలుగా వడ్డించిన విస్తరి ముందు వేరే వారు వచ్చి కూర్చుంటారా..? అసలు ఎవరెవరికి పదవులు దక్కుతాయి...? ఇవీ.. ప్రస్తుతం సగటు టీఆర్‌ఎస్ కార్యకర్త మదిని తొలుస్తున్న ప్రశ్నలు.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్‌ఎస్‌కు ఏమాత్రం బలం లేదని జోరుగా ప్రచారం జరిగిన జిల్లా నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎన్నికయ్యారు. ఒక విధంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్ పట్టు అంతంతమాత్రమే అనుకున్న దశలో జిల్లాలో ఆరు స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఇక, ఎన్నికల ముందు వివిధ సమీకరణలతో టికెట్లను త్యాగం చేసినవారు, ఇప్పుడు తమకు ఏదో ఒక అవకాశం ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తున్నారు. వివిధ కారణాలతో ఈసారి టీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కని సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారు. ఎన్నికలముందు పార్టీలో చేరిన పైళ్ల శేఖర్‌రెడ్డికి భువనగిరి టికెట్ కేటాయించడం, ఎమ్మెల్యేగా గెలుపొందడం చకచకా జరిగిపోయాయి.
ఇక్కడ మొదటినుంచీ పనిచేస్తున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి గురించి అధినాయకత్వం ఆలోచించాల్సి ఉంది. ఇదే రకమైన పరిస్థితి నల్లగొండలోనూ ఉంది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న చకిలం అనిల్‌కుమార్‌ను కాదని, దుబ్బాక నర్సింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఏదో ఒక రకంగా అనిల్‌కుమార్‌కు న్యాయం చేయాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ అధినాయకత్వంపై ఉందన్న అభిప్రాయం ఆయన వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడలో మొదటినుంచీ పార్టీలో పనిచేసిన నాయకత్వం ఉంది. అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి చేరికతో ఆయనకే నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయనే అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. కానీ, మొదటినుంచీ పార్టీ జెండాను మోసిన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సైతం, స్థానిక నాయకత్వం అండదండలు లేకున్నా, కొద్దోగొప్పో కేడర్ పార్టీనే నమ్ముకుని ఇన్నాళ్లూ పనిచేశారు.
ఇక, పార్టీ ఆవిర్భావం నుంచి ఎలాంటి పదవుల్లేకుండా పనిచేస్తున్న సీనియర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, కార్పొరేషన్ల డెరైక్టర్ల పదవులు ఉంటాయి. ఇవి కాకుండా, జిల్లాస్థాయిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్, పాలకవర్గ సభ్యుల పోస్టులు ఉంటాయి. ప్రధాన దేవాలయాలకు ధర్మకర్తల మండ ళ్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు తదితర నామినేటెడ్ పోస్టులు ఉండనే ఉంటాయి. మండల పరిషత్‌లలో సైతం కో-ఆప్షన్ సభ్యుల పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం ఈ పోస్టులు, సంఖ్య, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోటీ, ముఖ్య నాయకుల ప్రయత్నాలు.. తదితర చర్చలతో టీఆర్‌ఎస్ శ్రేణులు బిజీబిజీగా ఉన్నాయి. మరికొద్ది రోజులు ఆగితే కానీ, ఎవరె వరికి ఏయే పదవులు దక్కుతాయో.. తెలియదు. ఈ పదవుల భర్తీ పూర్తిగా పూర్తయితే, నేతల పదవుల దాహం తీరడమే కాదు, టీఆర్‌ఎస్‌లో రాజకీయ నిరుద్యోగం కూడా చాలా వరకు తీరిపోయినట్టేనని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.