చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ అధినేత, కాబోయే సీఎం కేసీఆర్‌పై ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పేర్కొన్నారు. చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న రైతు ఉప్పరి నర్సింలు కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో రైతురుణ మాఫీపై తొలి సంతకం చేసి వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి సంతకం చేసి వారికి అండగా నిలిచారన్నారు. అలాంటి ధీమా మళ్లీ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో ఉండగానే జిల్లాలో రైతు ఆత్మహత్యలు జరగడం దారుణమన్నారు. రైతులకు ధైర్యం కల్పించాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను వైఎస్ అందించిన విధంగా ప్రత్యేక ప్యాకేజీ కల్పించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా నర్సింలు కుమారుడు ప్రవీణ్ చదువుకయ్యే ఖర్చును తాను భరిస్తానని తెలిపారు. ఆయన వెంట శాలిపేట గ్రామ ఎంపీటీసీ యాదమ్మ సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ క్రీస్తుదాస్, నాయకులు సుధాకర్‌గౌడ్, రవి, వెంకటరమణ తదితరులు ఉన్నారు.
అధిష్టానం ఆదేశిస్తే మెదక్ ఎంపీగా పోటీచేస్తా!
సంగారెడ్డి అర్బన్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నందున పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను మెదక్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధిస్తానని ప్రభుగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెంటే తాను ఉన్నానని, వైఎస్ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ దాడికి దిగడంతో వైఎస్సార్ సీపీలో చేరానన్నారు.
తానెప్పుడు పార్టీలు మారలేదని పదవుల కోసం పాకులాడలేదన్నారు. పార్టీలను తరచుగా మార్చేవారిని ప్రజలు నమ్మరన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన వారిలో కేసీఆర్‌కు తనకు మాత్రమే రాజకీయాలు తెలుసన్నారు. ఉప ఎన్నికలో బీసీ నాయకునిగా ప్రజలు తనను గుర్తించి గెలిపిస్తారన్నారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్నదనే సందేశం ఇవ్వడానికి కేసీఆర్‌ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నందున తాను పోటీకి సిద్ధమన్నారు.
రైతులకు కేసీఆర్ భరోసా ఇవ్వాలి
Published Tue, May 20 2014 11:51 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement